నవరత్నాలతో జీవితాలు మారతాయా?

నవ రత్నాల మీద ఏ శాస్త్రవేత్తయినా నిజంగా పరిశోధనలు చేస్తే వాటి ప్రభావం గురించి తెలుస్తుంది. వజ్రం, వైడూర్యం, పగడం, మాణిక్యం, పుష్యరాగం, నీలం, ముత్యం, కెంపు, గోమేధికం అనే ఈ నవ రత్నాలలో నిజంగానే జీవితాలను ప్రభావితం చేసే శక్తి ఉంది. సరైన వ్యక్తి, సరైన సమయంలో, సరైన రత్నాన్ని ధరిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మీ జీవితంలో మీకు సమస్యలు ఏవైనా ఉన్నా, జీవితంలో ఎదుగుదల ఆగిపోయినా, ఉన్నత స్థితికి రావాలని ఉన్నా, అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నా మీరు సరైన రాయిని లేదా రత్నాన్ని ధరిస్తే తప్పకుండా మీ ఆశయం, అభిలాష నెరవేరుతుంది. చాలామంది జీవితాల విషయంలో ఇది నిజమని తేలింది.

అయితే ఎవరు ఏ రత్నాన్ని ధరించాలన్నది పూర్తిగా తెలుసుకోవాలి. నవరత్నాలకు సంబంధించినంత వరకూ అందరికీ అన్ని రత్నాలూ పనికి రావు. ఉదాహరణకు, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ నక్షత్రాలలో పుట్టినవాళ్ళు అందరూ కెంపు ధరించకూడదు. ఆ నక్షత్రాలు రవికి సంబంధించినవే కానీ, అందరికీ కెంపు వర్తించదు. జాతక చక్రంలో రవి ఏ స్థానానికి అధిపతి, అతను ఏ స్థానంలో ఉన్నాడు అనేది ముందుగా తెలుసుకోవాలి. రవి వల్ల ఆ జాతకుడికి ఉపకారం జరుగుతుందా, అపకారం జరుగుతుందా అన్నది తెలుసుకోవాలి. మిగిలిన గ్రహాల విషయంలో కూడా ఇదే విధంగా పరిశీలన జరగాలి. ఆ తరువాతే ఏ రత్నం పెట్టుకోవాలన్నది నిర్ణయించాలి.

జాతక చక్రంలో వివిధ గ్రహాల స్థితి గతుల్ని బట్టి రత్నాలను నిర్ణయించాలి. ఒక్కో జాతక చక్రాన్ని బట్టి ఒక్కో రత్నాన్ని నిర్ణయించాలి. ఈ విషయంలో ఒక విషయాన్ని మాత్రం పూర్తిగా అర్థం చేసుకోవాలి. 6, 8, 12 స్థానాల అధిపతుల దశల్లో ఆ అధిపతికి సంబంధించిన రాయిని ధరించకూడదు. ఇలా ధరిస్తే ఆ గ్రహానికి సంబంధించిన చెడు ఫలితాలు మరింతగా పెరుగుతాయి.

మొత్తం మీద, స్థూలంగా ఆలోచిస్తే, రవికి కెంపు, చంద్రుడికి ముత్యం, కుజుడికి పగడం, గురువుకు పుష్యరాగం, శనికి నీలం, శుక్రుడికి వజ్రం, బుధుడికి పచ్చ, రాహువుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించాల్సి ఉంటుంది. అయితే దీన్ని మొత్తం జాతకం చూసిన తరువాత మాత్రమే నిర్ణయించాలి.

రత్నాలను ఎప్పుడు, ఏ వేలికి ధరించాలన్న దానిపై స్పష్టమయిన వివరణ ఏదీ లేదు. కానీ, శరీరానికి తగిలేటట్టు ధరించాలన్న దానిపై మాత్రం ఏకాభిప్రాయం ఉంది. సరైన రత్నాన్ని ఎంచుకున్న తరువాత ఏ వేలికయినా దరించ వచ్చని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక ఏ రోజయినా రత్నపు  ఉంగరం ధరించవచ్చు. బంగారం అయితేనే మంచిది. బుధ, గురు వారాల్లో ధరించడం వల్ల ఆశించిన ప్రయోజనం త్వరలో నెరవేరుతుంది. ఇష్ట దైవానికి నమస్కారం చేసి (మనసులో అయినా పరవాలేదు) ఉంగరాన్ని పెట్టుకోవడం మంచిది. ఉంగరం కింద వైపు ఓపెన్ అయివుండాలి. పెట్టుకున్నది సరైన రత్నం అయితేనే ఫలితం ఉంటుందనే సంగతిని మరచిపోకూడదు.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సరైన రత్నాన్ని ధరిస్తే, అది గ్రహ శాంతులకన్నా, గ్రహ జపాలకన్నావేగంగా పని చేస్తుంది. పెట్టుకున్న రాయి శరీర తత్వంతో కలిసిపోవడానికి, చెడుని పోగొట్టడానికి  కొద్ది రోజులు పడుతుంది. ఈ లోగా జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. లోపల అలజడిగా ఉండవచ్చు. కొన్ని కష్ట నష్టాలు ఎదురు కావచ్చు. వీటికి చలించకుండా రత్నాన్ని శరీరం మీద ఉంచుకోవడమే మంచిది. ఆ తరువాతే అది మీకు అనుకూలంగా పని చేయడం ప్రారంభిస్తాయని గ్రహించాలి.

Send a Comment

Your email address will not be published.