నవ్వుకి ఆయనే "మందు"

ఎం ఎస్ నారాయణ మృతితో టాలీవుడ్ మరోసారి విషాద సాగరంలో మునిగింది.

నిన్న సాయంత్రం ప్రముఖ హాస్య నటుడు ఎం ఎస్ నారాయణ పోయారన్న మీడియాలో వార్తలు రావడంతోనే అవన్నీ వదంతులుగా పరిశ్రమ పెద్దలు చెప్పిన మరి కొన్ని గంటలకే (2015 జనవరి 23న) ఆయన శాశ్వతంగా కన్ను మూశారు. ఈ నెలలో సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖలు ఆహుతి ప్రసాద్, వీ బీ రాజేంద్ర ప్రసాద్ చనిపోయిన మరి కొన్ని రోజులకే ఇప్పుడు ఎం ఎస్ నారాయణ అనారోగ్యంతో హైదరాబాద్ లోని కిమ్స్ ( ప్రైవేటు) ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 63 ఏళ్ళు. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె వున్నారు. ఆయన పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. ఆయన తండ్రి పేరు మైలవరపు బాపి రాజు, తల్లి పేరు వెంకట సుబ్బమ్మ. వీరిది రైతు కుటుంబం. బాపిరాజు దంపతులకు మొత్తం పది మంది పిల్లలు. వారిలో ఏడుగురు కొడుకులు. ముగ్గురు కుమార్తెలు. ఎం ఎస్ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రు. ఎం ఎస్ ది కులాంతరు ప్రేమ వివాహము. ఆయన భార్య పేరు కళాప్రపూర్ణ.

1951 ఏప్రిల్‌ 16న పుట్టి పెరిగిన ఎం ఎస్ వెస్ట్ గోదావరిలోని భీమవరంలోని కె.జి.ఆర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. కళారంగం పట్ల ఉన్న ఆస్తకితో ఆయన లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి నటనారంగంలోకి ప్రవేశించారు. తొలుత ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు.

మోహన్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘పెదరాయుడు’ చిత్రంలో ఓ చిన్నపాత్రలో నటించిన ఎం ఎస్ మొత్తం ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన పెదరాయుడు 1995 లో విడుదల అయ్యింది.

ఆయనకు మంచి నటుడిగా పేరు తెచ్చిన సినిమా ‘మానాన్నకి పెళ్ళి’ ఈ చిత్రంలో ఆయన హాస్య నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన వెనుతిరిగి చూడలేదు.

ఆనందం, నువ్వు నాకు నచ్చావ్‌, ఇడియట్‌, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, యమదొంగ, దేశముదురు, దూకుడు, డిస్కో, దూబాయ్‌ శీను తదితర సినిమాల్లో చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించారు.

ఆయన బాడీ లాంగ్వేజ్‌ కానివ్వండీ మేనరిజమ్స్‌ కానివ్వండీ డైలాగులు చెప్పే తీరు కానివ్వండీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది. తాగుబోతు పాత్రలు చేయడంలో ఆయనకాయనే సాటి.

ఆయన దర్శకత్వంలోనే కొడుకు విక్రమ్‌ హీరోగా ‘కొడుకు’ చిత్రం వచ్చింది. ఆ తర్వాత “భజంత్రీలు” అనే చిత్రానికి కూడా ఆయన దర్శకత్వం వహించారు. మరోవైపు ఆయన కుమార్తె శశికిరణ్‌ దర్శకురాలిగా ఈమధ్యే ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది.

నంది అవార్డు అయిదు సార్లు అందుకున్న ఎం ఎస్ సినీ గోయెర్స్ అవార్డు కూడా రెండు సార్లు పొందారు. అలాగే దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందడం గమనార్హం. .

మంచి నటుడుగానే కాక మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఎం ఎస్ మృతి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

Send a Comment

Your email address will not be published.