నాగార్జున అవయవ దానం

అవయవ దానంపై నగరంలో చైతన్యం వెల్లివిరుస్తోంది. మృత్యుముఖంలో చిక్కి దాతల
కరుణ కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులకు మేమున్నామంటూ సుమారు 4,300 మంది
అవయవ దానానికి ముందుకు వచ్చారు. ప్రముఖ సినీ హీరో నాగార్జున ప్రధాన
ప్రోత్సాహకుడుగా యశోద ఆస్పత్రి గత శనివారం హైదరాబాద్ లోని శిల్ప కళా
వేదికలో నిర్వహించిన అవయవ దాన ఉద్యమ కార్యక్రమంలో వేలాదిమంది అంగీకార
పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయిన వారితో మొదటగా
నాగార్జున ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై తాను
నటించే ప్రతి సినిమాలోనూ అవయవ దానంపై అవగాహన ప్రచారం నిర్వహిస్తానని
చెప్పారు. తన తండ్రి నాగేశ్వర రావు కూడా వయవ దానానికి సంసిద్ధత వ్యక్తం
చేసారని, అయితే ఆయనకు వచ్చిన రుగ్మత కారణంగా అది సాధ్యపడ లేదని నాగార్జున
చెప్పారు. నాగార్జునతో పాటు దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోయిన్ సోనియా,
బాడ్మింటన్ క్రీడాకారిణి సింధు కూడా సంతకాలు చేశారు. దేశంలో అవయవాల కోసం
ఎదురు చూస్తూ ఏటా అయిదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని యశోదా
ఆస్పత్రి ఎండీ జి.ఎస్. రావు చెప్పారు. ఆస్పత్రులలో వందలాది మంది అవయవాల
కోసం నమోదు చేసుకుని ఉన్నారని ఆయన తెలిపారు.

Send a Comment

Your email address will not be published.