నాటకరంగానికి నట సిరి

నాటకమే ఊపిరిగా చేసుకున్న ప్రముఖ రంగస్థల నటులు, రచయిత చాట్ల శ్రీరాములు ఇక లేరు. ఆయన వయస్సు 84 ఏళ్ళు. ఆయన అయిదు దశాబ్దాలు నాటక రంగాభివృద్ధికి కృషి చేసారు. ఆయన హైదరాబాద్ లోని రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

1931 డిసెంబర్ అయిదున విజయవాడలో పుట్టి పెరిగిన శ్రీరాములు మొట్టమొదటిసారిగా తన పన్నెండో ఏట మేవాడ్ పతనం అనే నాటకంలో నటించారు.

మొదట్లో ఆయన రైల్వే ఉద్యోగి. రైల్వేలో తొలుత టికెట్ కలెక్టర్ గా చేరారు. ఆ తర్వాత ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మొట్టమొదటి అనౌన్సర్ కావడం గమనార్హం.

ఆయన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ విదేశాలలో అనేక నాటకాలు వేశారు.

ఆంధ్రా నాటక కళా పరిషత్ ఆయనను రెండు సార్లు ఉత్తమ నటుడుగా ఎంపిక చేసి సత్కరించింది. అంతేకాకుండా 1982 లో ఆయన సంగీత నాటక అకాడెమీ అవార్డు కూడా అందుకున్నారు.

ఆయన నెలకొల్పిన నటనాలయంలో నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రశ్రేణి నటులు తర్ఫీదు పొందారు.

న్యాయం కావాలి, స్వప్న, సుడిగుండాలు, అగ్నిపుత్రుడు, శిశిర తదితర చిత్రాలలో నటించిన శ్రీరాములు ప్రతిభను గుర్తించి బ్రిటీష్ డ్రామా లీగ్ (లండన్) 1970 లో “ప్రొడ్యూసర్, టీచర్” అనే సర్టిఫికేట్ ప్రదానం చేసింది.

కేంద్ర మానవ వనరుల శాఖ శ్రీరాములుకి ఎమరిటస్ ఫెలోషిప్ ఇచ్చి గౌరవించడం విశేషం. ఈ ఫెలోషిప్ పొందిన మొదటి రంగస్థల నటులు శ్రీరాములే.

తన నట జీవితంలో ఎన్నో అవార్డులూ రివార్డులూ అందుకున్న శ్రీరాములు స్వయంగా ఓ నాటక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా కళాకారులను సత్కరించేవారు.

Send a Comment

Your email address will not be published.