పూర్తి స్థాయిలో కొత్త రాజధాని అమరావతిని నాలుగేళ్ళలో నిర్మించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. వచ్చే ఏడాది జూన్ 2 నుంచి విజయవాడ, దాని పరిసరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసినప్పటికీ, శాశ్వత భావన నిర్మాణాలు మాత్రం అత్యధిక భాగం 2019 జూన్ నాటికి పూర్తి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఆయన గత బుధవారం మంత్రులు, అధికారులతో కొత్త రాజధాని నిర్మాణంపై సమీక్ష జరిపారు. అమరావతిని మూడు దశల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అమరావతిలో భాగంగా మొత్తం తొమ్మిది నగరాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ తొమ్మిది నగరాలనూ తొమ్మిది రంగుల్లో తీర్చి దిద్దుతారు.
మొదటగా సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, కొన్ని ముఖ్యమయిన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేస్తారు. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయి ఉద్యాన వనాల మధ్య నిర్మాణ మవుతాయి. ఇవి కాకుండా కొన్ని జలాశయాలను కూడా ఈ పరిసరాల్లో నిర్మిస్తారు. ఏడు ప్రపంచ శ్రేణి స,స్థాలు వీటి నిర్మాణాన్ని చేపడతాయి.