నా పేరు కవి - ఇంటి పేరు చైతన్యం

CNarayanaReddyప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డి పరమపదించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన జూన్ 12 వ తేదీ ఉదయం హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 ఏళ్ళు. ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారికి ఆయన పెట్టిన పేర్లు పవిత్రమైన నదుల పేర్లే. గంగ, యమునా, సరస్వతి, కృష్ణవేణి.

“నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావం …” అని చెప్పుకున్న సినారె తనదైన శైలితో భావాలతో సాహిత్య రంగంలో ఓ ప్రత్యేక స్థానం సంతరించుకున్నారు. తుది శ్వాస వరకు రాస్తూనే ఉన్న ఆయన తెలంగాణాలోని సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీ పేట లో 1931 జూలై 29 వ తేదీన పుట్టిన సినారె తల్లి పేరు సింగిరెడ్డి బుచ్చమ్మ. తండ్రి పేరు సింగిరెడ్డి మళ్ళా రెడ్డి. వీరిది రైతు కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన సినారె పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. అసలు పేరు సింగి రెడ్డి సత్యనారాయణ రెడ్డి. అయితే స్కూల్ లో ఓ సారి అధ్యాపకుడు “సత్య” పేరు మార్చి నారాయణ రెడ్డిగా మిగిల్చి నారాయణరెడ్డి పేరుతో ప్రసిద్ధులయ్యారు.

కరీంనగర్లో ప్రాధమిక విధ్య చదివిన సినారె హైదరాబాదుకొచ్చి ఇంటర్, డిగ్రీ పూర్తి చేసారు. 1954 లో ఆయన ఎం ఏ పూర్తి చేసారు. ఆ తర్వాత ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ఆయన ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు – ప్రయోగములు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆధునికాంధ్ర కవిత్వానికి ఇప్పటికీ ఈ సిద్ధాంత గ్రంధమే పెద్ద దిక్కుగా ఉండటం గమనార్హం. అనంతరం ఆయన అధ్యాపకుడిగా పనిచేసారు. అధికార భాషా సంఘం చైర్మన్ గాను, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్ లర్ గాను, తెలుగు విశ్వా విద్యాలయానికి వైస్ చాన్స్ లర్ గా వ్యవహరించారు.

తెలుగు కవులలో మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికైన ఘనత ఆయనది.

విద్యార్థి దశలోనే సీస పద్యాలు రాసిన సినారె మొదటి ముద్రిత పుస్తకం నవ్వని పువ్వు. అది 1953 వ సంవత్సరం.

మరో ఎనిమిదేళ్ళకు తెలుగు చలన చిత్ర రంగంలోకి గులేబకావళి కథతో గేయరచయితగా పరిచయమై నందమూరి రామారావు నటించిన చిత్రాలన్నిటిలో పాటలు రాసారు. అంతేకాదు, విశ్వనాథ సత్యనారాయణ ఏకైక నవల ఏకవీరను ఎన్టీఆర్, కాంతారావులతో తెరకెక్కించిన చిత్రానికి ఆయన మాటలు కూడా రాసారు. ఆయన సినిమా కోసం రాసిన పాటల్లో మొట్టమొదటగా రికార్డు అయిన “నన్ను దోచుకుందువటే…” (ఈ పాట తెలుగుమల్లి మరియు భువన విజయం ప్రదర్శించిన “నాడు – నేడు” కార్యక్రమంలో పొందుపరచడం జరిగింది. దీనితోపాటు అల్లూరి సీతారామరాజు చిత్రంలోని “వస్తాడు నా రాజు…” పాట కూడా ప్రదర్సించిడం జరిగింది) పాటైతే ఆయన రాసిన చివరి సినిమా గీతం …”జయ జయహే భారతావని పావని,..” . ఈ పాట మనసైనోడు చిత్రానికి రాసారు. ఈ చిత్రాన్ని ఆయనకే అంకితం చేస్తున్నట్టు చిత్ర నిర్మాత హసీబుద్దీన్ తెలిపారు.

ఆయన మూడు వేల అయిదు వందల పాటలు రాసారు.
ఆయన రాసిన ప్రతి పాటా జనరంజకమే. అవి నవ పుష్పాలు. రసరమ్యాలు.

రాస్తూ రాస్తూ పోవాలనుకున్న కవి ఆయన. అందుకే ఆయన అనుంగు శిష్యుడు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ ఎం గోపి సినారె మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ “పొద్దున్నే ఆయన లేరన్న వార్త నా మటుకు ప్రపంచాన్ని చీకటిగా మార్చేసింది. ఇది నమ్మశక్యం కాని విషయం. ఆయన ఇవాళ కవిత రాయలేదంటే చెప్పండి అప్పుడు నమ్ముతాను” అని అన్నారు.

అనాది నుంచి నేటి వరకూ పరిణమిస్తూ వస్తున్న మనిషి ప్రస్థానాన్ని చిత్రీకరించే దీర్ఘ వచన కవిత విశ్వంభరలో సినారె అన్నారిట్లా…….
“సృష్టికి మూలం జ్ఞానబీజం…
విశ్వంభరా భ్రమణానికి మూలం శాశ్వత చైతన్య తేజం…” అని.

“కవిని మాత్రం సూర్యునితో ఖచ్చితంగా పోల్చవచ్చు….ఏడు వన్నెలు జీర్ణించుకుని ఏక వర్ణం చిమ్ముతాడు” అన్న సినారె విశ్వంభర ఆధునిక ఐతిహాసిక వచన కవితా కావ్యమనడంలో అతిశయోక్తిలేదు.

తెలుగుసాహిత్యంలో ఆయన స్పృశించని ప్రక్రియలేదు. అజన్తాసుందరి, నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, ఋతుచక్రం, మట్టీ మనిషి, శికరాలు –లోయలూ, ఇంటిపేరు చైతన్యం ఇత్యాది ఎనభై పుస్తకాలు రాసిన సినారె మృతి సాహితీప్రియులకు సాహితివేత్తలకూ తీరని లోటే. అలాగే కొత్త రచయితలను ప్రొత్సహిస్తూ వారి పుస్తకాలకు ముందుమాట రాసిన సినారె తన భార్య సుశీల పేరిట ప్రతి ఏడూ ఉత్తమ రచయిత్రిని యాభై వెల రూపాయల నగదు పురస్కారంతో సన్మానిస్తున్నారు.

ఆయన మృతి పట్ల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖర రావు, మంత్రులు, రచయితలు, ఆయన దగ్గర చదువుకున్న శిష్యులూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతి తెలిపారు.

సినారె ఆణిముత్యాలు కొన్ని….

“మనసైన స్నేహం మరుమల్లెచెండు
యెడ లేని మొహం అది గాలిదిండు….”

“మరణం నను వరించి వస్తే ఏమంటాను – నేనేమంటాను
పాలు పట్టీ జోల పాడి పడుకోమంటాను”

“ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక
ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక”

“శిశు హృదయానికి కల్లలు లేవు రస రాజ్యానికి ఎల్లలు లేవు
లోపలి నలుపు “సినారె” కు తెలుసు పైపై తొడుగు దేనికని…”

“ఆత్మలను పలికించేదే అసలైన భాష
ఆ విలువ కరువైతే అది కంఠ శోష “

కీర్తి శేషులైన శ్రీ సి.నా.రె.ను.. ఒక సినీ గేయ కవిగా మనలో చాలామందికి తెలుసు… అయితే ఆయన ఒక గొప్ప సాహితీవేత్త … మానవ జీవితంలో లోతైన తాత్విక చింతనను కాచి వడపోసి
ఆయన ఇటీవలి కాలంలో వ్రాసిన “ప్రపంచ పదులు ” అనే శీర్షిక తో వ్రాసిన కవితలు ఆయన లోతైన భావుకు తకు తత్వ వివేచనా పరతకు అద్దములు… ప్రసిద్ధములు .. ఉత్తమ స్థాయి స్ఫూర్తి ప్రబుద్ధములు

కన్ను మూసిన ” కవి సి.నా.రె. మూసీ కినారె ” గారి కళ్ళు తెరిపించే

”ప్రపంచ పదుల “లోని కొన్ని ..

తవ్వగలిగితె గుండెపొరలను రవ్వలెన్నో యెదుట పడవా

ఇవ్వగలిగితె నాదలయలను మువ్వలెన్నో వెంటపడవా

చెక్కుచెదరని లక్ష్యము౦టే చేతకానిది మనిషి కేదీ…

చూడగలిగితె పట్టపగలే చుక్కలెన్నో కంటపడవా

కదపగలిగితె పెనుయెడారిని గoగలెన్నో బయటపడవా
……….. .

వెళ్ళితే కాదనను కాగేకళ్ళ ఆవిరి చూసిపో

వీడితే కాదనను మూల్గేనాడి ఊపిరి చూసిపో

అన్నీ తెలిసే తెంచుకొని పోతున్న నీకో విన్నపం

నవ్వినా కాదనను మునిగే నావ అలజడి చూసిపో

కాల్చినా కాదనను మ౦టను కాస్త నిలబడి చూసిపో

… ….

ఉప్పెనలో తలఒగ్గక నిలువున ఉబికొచ్చేదే జీవితం

ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం

చచ్చేదాకా బతికివుండటం జాతకాలలో ఉన్నదే—

ఒరిగిపోయినా తనకంఠం ( నలుగురు మెచ్చేదే జీవితం

ప్రలోభాలు పైబడినా నీతికి పడి చచ్చేదే జీవితం

…….(సి.నా.రె … ప్రపంచ పదులు)
కవి హృదయాలలోచిరస్థాయిగా నిలిచిపోయే సి.నా.రే…… స్మృతి ఒక ఆనందం
భౌతికంగా మాత్రం ఇక మనకు లేరే…ఆ విషయం దు: ఖాస్పదం

Send a Comment

Your email address will not be published.