నిన్ను నీవు నమ్మాలి

swami-vivekananda“సహనాన్ని, సర్వమత సత్య తత్వాన్ని ప్రపంచానికి తెలియచెప్పిన సనాతన ధర్మాన్ని హిందూ మతం విశ్వశిస్తుంది. సమస్త మతాల నుంచి, సమస్త దేశాల నుంచి పరపీడితులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం హిందూ దేశం”
– స్వామి వివేకానంద.

చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో భారత దేశ ఆధ్యాత్మిక గురువుగా పాల్గొని హిందూ మత ఔన్నత్యాన్ని చాటి చెప్పిన స్వామి వివేకానంద భువనేశ్వరి, విశ్వనాధ్ దంపతులకు నలుగురు కొడుకులు. ఆరుగురు కుమార్తెలు. వారిలో అయిదవ సంతానంగా ఈ వ్యాస కథానాయకులైన స్వామి వివేకానంద జన్మించారు. 1863 జనవరి 12వ తేదీన పుట్టిన వివేకానంద తొలి పేరు విశ్వేశ్వరుడు. కాశీ వీరేశ్వర శివుడి అనుగ్రహంతో పుట్టడంతో ఈ పేరు పెట్టారు. అయితే ఆ తర్వాత నరేంద్రనాథ్ అయ్యారు. అందరూ నరేన్ అని పిలిచేవారు. ఆయన ముద్దు పేరు బిలే. శ్రీరామకృష్ణ పరమహంస నిర్వాణం తర్వాత స్వామి వివేకానంద నామదేయులయ్యారు. 1891 ఫిబ్రవరి నుంచి 1892 అక్టోబర్ వరకు వివేకానందగాను, 1892 అక్టోబర్ నుంచి 1893 వరకు సచ్చిదానంద పేరుతోను పిలువబడే ఆయన 1893 మే మాసం నుంచి స్వామి వివేకానంద పేరు స్థిరపడింది.

బాల్యంలో చిలిపి చేష్టలకు పెట్టింది పేరైన వివేకానంద దుందుడుకు స్వభావులు. జ్ఞాపక శక్తి అపారం. అందరి దేవుళ్లలో పరమశివుడంటే మహా ఇష్టముండేది. ప్రకృతి ఆరాధకులు. సంగీత జ్ఞానం మెండుగా ఉండేది. ఆయన సాహసం వివేకంతో కూడినది. అందులో సమయస్పూర్తి ఉండేది. తాతగారు దుర్గాప్రసాద్ లా తానూ ఓ రోజు “సన్న్యాసి” అయిపోతానని చెప్పుకున్న వివేకానంద ఆత్మవిచారణ స్వతహాగా కలిగి ఉండి సత్య సాక్షాత్కార లక్ష్యంగా ముందుకుసాగారు.

శ్రీరామకృష్ణ పరమహంస మాటలకు ఆకర్షితులైన వివేకానంద ఓ రోజు ఆయన వద్దకు వెళ్లి తన మనసుని వేధిస్తున్న ఓ ప్రశ్న వేశారు. అప్పటికే చాలా మందిని కలిసి అడిగినప్పటికీ సరైన జవాబు లభించకపోవడంతో వివేకానంద రామకృష్ణ పరమహంసతో “మీరు భగవంతుడిని చూసేరా?” అని అడిగారు.

అప్పుడు రామకృష్ణుల వారు “చూశాను. న ఇన్ను చూస్తున్నంత స్పష్టంగా , ఇంకా చెప్పాలంటే చాలా స్పష్టంగా చూసాను. నీతో మాట్లాడినట్లే ఆయనతో మాట్లాడవచ్చు. కానీ అలా మాట్లాడాలనే కోరిక ఎంతమందికి ఉంటుంది? పెళ్ళాం పిల్లల కోసం , డబ్బు కోసం, సుఖాలకోసం, భోగాల కోసం కాలాన్ని వెచ్చిస్తారు. దైవ దర్శనం కలగడం లేదని విచారించే వారెవరు? నిన్ను చూడాలని ఉంది భగవంతుడా అని మధనపడి గట్టిగా పిలిస్తే తప్పకుండా అతడు ప్రత్యక్షమవుతాడు” అని చెప్పారు.

మరోసారి రామకృష్ణుల వారితో “అందరికీ ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతున్నాయి. కానీ నాకెందుకు ఏదీ కలగడం లేదు. మూడు నాలుగు రోజులపాటు సమాదిస్థితిలోకి వెళ్లి పోవాలని ఉంది” అని వివేకానంద అన్నప్పుడు ఆయన ఇలా అన్నారు –

“నువ్వు ఒట్టి అవివేకివి. నువ్వు అనుకున్న దానికన్నా మరింత గొప్ప స్థితి ఉంది. ఉన్నవన్నీ నువ్వే అని అప్పుడప్పుడూ పాడుతూ ఉంటావు కదా….ఆ స్థితి నువ్వు అనుభవించాలి” అని.

అనంతరం రామకృష్ణుల వారు తమకు ఎంతో ఇష్టమైన రామ నామ మంత్రం దీక్షను వివేకానందకు అనుగ్రహించారు.

ఒకరోజు వివేకానందకు నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్తారు. చాలాసేపుతర్వాత ఆయన బాహ్య స్మృతిలోకి వస్తారు.

అప్పుడు రామకృష్ణుల వారు వివేకానందను ఉద్దేశించి “స్వీయసంకల్పంతో మాత్రమే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాడు. తాను ఎవరు అనేది తెలుసుకున్న వెంటనే దేహాన్ని త్యజిస్తాడు. అతను మేధాశక్తితో, ఆధ్యాత్మిక శక్తితో ఈ ప్రపంచ పునాదులను కదిలిస్తాడు” అని చెప్పారు.

రామకృష్ణ పరమహంస మాటలు అక్షరసత్యమయ్యాయి. మాతృశ్రీ శారదాదేవి దీవెనలతో దేశాదేశాలూ పర్యటించిన స్వామి వివేకానంద భారతీయల స్థితిగతులను ప్రత్యక్షంగా చూసారు. తాను నేర్చుకున్నది సమాజానికి నేర్పుతూ మతం పేరిట సాగుతున్న రాజకీయాలు, మూఢ నమ్మకాలతో భారత దేశం బానిసత్వంలో మగ్గుతోందని, ఈ స్థితి మారాలని గట్టిగా చెప్పారు. దేశ పురోగామిలో మహిళా ఉద్ధరణ కూడా ఒక ప్రధాన అంశమని ప్రకటించారు. ప్రజల స్థితిగతులను పాలకుల దృష్టికి తీసుకెళ్ళి వారి బాధ్యతలను గుర్తు చేసారు. అమాయక ప్రజల బాగోగులకోసం సోదర సాధువులతో కలిసి తన జీవితాన్ని అంకితం చేసుకున్న వివేకానంద ప్రపంచానికి ఒక సందేశం అవసరమన్న దృక్పధంతో దేశాదేశాలూ సందర్శించారు. ఆధ్యాత్మిక శక్తిని తెలియచెప్పారు.

చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో సోదర సోదరీమణులారా అంటూ వివేకానంద తన ప్రసంగంలో హిందూ మత ఔన్నత్యాన్నిచాటి చెప్తూ మనో దృక్పథం విశాలమై ఉండాలన్నారు. సంకుచిత పరిధుల నుంచి బయటకు రావాలన్నారు. హిందూ మతం విశ్వజనీన మతం అనే అద్భుత భావన కలిగించారు. రామకృష్ణ పరమహంస తమ జీవితాన్ని ఓ ప్రయోగ క్షేత్రంగా చేసుకుని మతాలెన్నో మార్గాలు కూడా అన్నే అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి వెల్లడించిన విషయాన్ని వివేకానంద తమ ప్రసంగంలో ప్రస్తావించారు. విజ్ఞానం, మతం పరస్పర అనుబంధం కలిగినవన్నారు. మానవాళి మనుగడకు కావాల్సినవి సహకారం, ఐక్యత, శాంతియుత సమన్వయం ప్రధానమని చెప్పిన వివేకానంద మాటలు మహామంత్రంగా స్వీకరించి మనమందరం పాటిద్దాం.

“నేను నలభయ్యో ఏడు చూడబోను. నేను చెప్పాల్సిన మాటలు చెప్పేసాను. చెయ్యాల్సింది చేసేసాను. లోక క్షేమం కోసం నేను చేసిన పనిని ప్రజలు గ్రహిస్తారు. గొప్ప తపస్సు, ధ్యానం నన్ను ఆవహించాయి. నేను ఎప్పటికన్నా ప్రశాంతంగా ఉన్నాను. నా నావ ప్రశాంతమైన గమ్యానికి చేరుకుంటోంది. నేను రామకృష్ణులకు దాసుడను. నేను ముక్తుడిని. నేను సర్వత్రా ప్రేరణ కల్పిస్తూనే ఉంటాను. నేనిక వెళ్లిపోవాలి. మృత్యువు ఆసన్నమైంది….” అని చెప్పిన వివేకానంద 1902 జూలై 4వ తేదీన మనకు భౌతికంగా దూరమయ్యారు. కానీ ఆయనలోని దివ్యత్వం యావత్ ప్రపంచానికీ ఎప్పటికీ ఓ నిత్య బోధనే.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.