నేత్ర పర్వం గరుడ సేవ

చిరు జల్లులతో వరుణుడు వెంట రాగా ….. ఏడు కొండల వాడా వెంకట రమణా అంటూ భక్త కోటి భక్తి పారవశ్యంతో సేవిస్తుండగా రత్న ఖచిత ఆభరణాలు ధరించి, స్వర్ణ కిరీట ధారుడైన శ్రీవారు శ్రీదేవి, భూదేవి సమేతుడై గరుడ వాహనం పై తిరువీధుల్లో నేడు చిద్విలాసం గా విహరించారు.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన మైన వాహన సేవ గరుడ సేవ. జీవితం లో ఒక్కసారి అయినా గరుడ వాహన సేవ ను చూడ గలిగితే జన్మ ధన్యమయి నట్లు గా భావిస్తారు భక్తులు.

తొమ్మిది రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు సాయంత్రం జరిగే గరుడ సేవకి విశేష ప్రాధాన్యత ఉంది. శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రుడైన గరుడుడు స్వామి వారిని స్వయంగా తన భుజాల పైన మోసే అద్భుత క్షణాలను వీక్షించడం కోసం దేశం నలు మూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచీ హాజరయ్యారు. నీలి వర్ణ పట్టు పీతాంబరాలు ధరించిన మలయప్ప స్వామి ఈరోజు విశేష ఆభరణాలతో భక్తులకు దర్శన మిచ్చారు. ఆకాశ రాజు కుమార్తె పద్మావతి దేవిని నారాయణవరంలో శ్రీనివాసుడు పరిణయమాడిన సందర్భంలో కట్న కానుకల క్రింద మామ ఆకాశ రాజు సమర్పించిన లక్ష్మీ హారాన్ని ధరించి స్వామి భక్తులకు అభయ హస్తం ఇచ్చారు. ఈ లక్ష్మీ హారాన్ని ప్రతి రోజూ గర్భ గుడి లో ఉన్న మూల విరాట్టు కి అలంకరిస్తారు. కేవలం బ్రహ్మోత్సవాల్లో జరిగే గరుడ సేవ రోజున మాత్రమే ఉత్సవ విగ్రహం అయిన మలయప్పకి అలంకరిస్తారు. ఇంకా ఎంతో అమూల్యమైన పచ్చల పతకం, వెలకట్ట లేని వజ్ర, స్వర్ణ ఆభరణాలు ధరించి వైనతేయుడి పై దర్శనం ఇచ్చారు.

శ్రీవల్లి పురం నుంచి వచ్చిన పూల మాలలు ధరించి, విల్లి పురం నుంచి ప్రత్యేకం గా వచ్చిన గొడుగులు వెంట రాగా స్వామి వారు తిరు మాడా వీధుల్లో ఊరేగారు. స్వామి వారికి దారి ఇవ్వడానికి గజ రాజులు ముందుకు సాగగా, మంగళ వాయిద్యాలు, భక్త జనుల కోలాటాలు ఆడుతూ, పాడుతూ స్వాగతం పలికారు. తిరుమలకి వేల్లందుకు రవాణా సౌకర్యం లేకపోయినా వేలాది మంది భక్తులు గరుడ సేవలో పాల్గొన్నారు.

Send a Comment

Your email address will not be published.