న్యూ జిలాండ్ నెంబర్ 1 – శ్రీజన్

పట్టుమని మదమూడేళ్ళు నిండలేదు. మూతిమీద ఇంకా మీసాలు రాలేదు. ముఖంలో చిలిపితనం పోలేదు.

తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడతాడు. తెలుగుదనానికి ఒక అద్దంలా నిలిచాడు. ప్రత్యర్ధులను మట్టి కరిపించాడు. న్యూ జిలాండ్ దేశానికి ఛాంపియన్ గా నిలిచాడు. మువ్వన్నెల జెండాను మరిపించాడు. పరాయి గడ్డపై ఒక తెలుగు బిడ్డ పరాక్రమాన్ని చూపించాడు.

శ్రీజన్ కొంచాడ తల్లిదండ్రులు శ్రీలత మరియు శ్రీపతి కొంచాడ. ఆక్లాండ్ నగరంలో గత పదిహేనేళ్ళుగా నివసిస్తున్నారు. వారి గారాల బిడ్డ శ్రీజన్. చిన్నతనంలోనే టెన్నిస్ ఆడాలని గట్టి ప్రయత్నమే చేసాడు గానీ సరైన కోచ్ దొరక్క కొంత ఇబ్బంది పడి తండ్రితో పాటు కొన్నాళ్ళు బాడ్మింటన్ ఆడడానికి యాదృచ్చికంగా వెళ్ళడం జరిగింది. అలా మొదలైన ఈ ఆట న్యూ జిలాండ్ దేశంలో 13 సంవత్సరాల లోపు పిల్లల ఛాంపియన్ గా తీర్చిదిద్దింది. ఇదంతా గత రెండు సంవత్సరాలలోపే జరిగిందంటే శ్రీజన్ లో వున్న పట్టుదల కృషే కారణం.

మొదట్లో సరదాగా మొదలైన ఈ ఆట ఒకటి రెండు కౌంటీ పోటీలకు వెళ్లి గెలవడంతో మరింత శ్రద్ధగా ఆడి విజయ సోపానాలకు దగ్గరయ్యాడు. 2014 ఏప్రిల్ లో నార్త్ హార్బర్ పోటీల్లో 3 వ స్థానాన్ని సంపాదించగలిగాడు. అక్టోబర్ నెలలో జరిగిన జాతీయ పోటీల్లో డబుల్స్ లో తన మిత్రునితో మొదటి స్థానాన్ని సింగిల్స్ లో 4 వ స్థానాన్ని సంపాదించిన తదుపరి మరింత తర్ఫీదు పొందితే ఛాంపియన్షిప్ గెలిచే అవకాశం ఉంటుందని గత డిసంబరు నెలలో హైదరాబాద్ వెళ్లి ప్రత్యెక శిక్షణ పొందడం జరిగింది. దీనంతటికీ ఆక్లాండ్ నగరంలో మన తెలుగు వారైన శ్రీ సూర్యా రావు తీగల గారు బాడ్మింటన్ శిక్షకుడుగా వుండడం, వారు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం వలనే అని శ్రీజన్ చెప్పాడు. తనలోని ఆట పై నున్న శ్రద్ధాశక్తులు గమనించి వారు ప్రతీ వారం శిక్షణా కాలాన్ని పెంచి ప్రోత్సహించారని వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. శ్రీ సూర్య గారు భారత దేశం తిరిగి వెళ్లిపోవడంతో ప్రస్తుతం రిచీ మార్ వద్ద శిక్షణ పొందుతున్నాడు.

చదువులో కూడా తక్కువేమీ కాదు. ప్రస్తుతం ఇంటికి దగ్గరలోనే వున్న బ్లాక్ హౌస్ బే ఇంటర్మీడియట్  కాలేజీలో 8వ తరగతి చదువుతున్నాడు. క్లాసులో మొదటి ఐదు మందిలో వుంటాడు. చదువులో తండ్రే తనకు స్పూర్తి అంటాడు శ్రీజన్. తల్లిదండ్రులిద్దరూ బాడ్మింటన్ లో తను సాధించిన విజయానికి స్పూర్తిదాయకమని చెప్పాడు.  ఖాళీగా వున్నపుడు డ్రమ్స్ నేర్చుకుంటూ వుంటాడు.  కాలేజీలో కన్సర్ట్స్ కి డ్రమ్స్ వాయిస్తాడు కూడాను.

ఈ సంవత్సరం మే, జూలై నెలల్లో జరిగిన పోటీల్లో జాతీయ స్థాయి టైటిల్ ని గెలుచుకొని వయసు తక్కువైనా ప్రస్తుతం 15 ఏళ్ల పిల్లలతో పోటీ పడడానికి సిద్ధపడుతున్నాడు. వచ్చే రెండు నెలల్లో జరిగే జాతీయ పోటీల్లో గెలుపొంది తెలుగు పతకాన్ని కీర్తి శిఖరాలకు తీసుకేల్లగాలడని ఆశిద్దాం.

Send a Comment

Your email address will not be published.