పట్టు వదలని కిరణ్ కుమార్

ఆరు నూరయినా, నూరు ఆరయినా రాష్ట్ర విభజన జరగనివ్వమని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి భీష్మించుకు కూర్చున్నారు. తాను అధిష్టానం చెప్పినట్టే నడుచుకున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. తాను అధిష్టానం ఆదేశాలను ఆమోదించే ప్రసక్తే లేదని, విభజనను అడ్డుకోవడానికి ప్రాణాలొడ్డి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.  “నేను విభజనకు అంగీకరించడం జరగని పని. విభజన ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. బిల్లును సమర్పించిన తరువాత నా సంగతేమిటో రుచి చూపిస్తా” అని ఆయన అన్నారు. “శాసనసభలో ఇంకా బిల్లును ప్రవేశపెట్టలేదు. ఇంకా చర్చకు స్వీకరించలేదు. దాని ప్రవేశానికి అంగీకరించారు అంతే. ఇది చాలా సున్నితమయిన అంశం. గతంలో శాసనసభలో ఇటువంటి బిల్లు మీద చర్చించడం జరగలేదు” అని ఆయన అన్నారు. ఇటువంటి బిల్లు మీద ఎలా చర్చ జరగాలన్నది శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ ఏ. చక్రపాణి నిర్ణయిస్తారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన సమయంలో శాసనసభలో ఇటువంటి బిల్లుపై బాగా చర్చ జరిగింది. ఈ రాష్ట్రాలలో అనుసరించిన పద్ధతినే ఇక్కడ కూడా అనుసరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రిస్మస్ సెలవులలో భాగంగా శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి.

Send a Comment

Your email address will not be published.