కలియుగ వెంకటేశ్వరుడిని పదకవితా పితామహుడు అన్నమయ్య కొనియాడినట్టు మరెవ్వరూ కొనియాడి ఉండరు అనడం అతిశయోక్తి కాదు. కొన్ని వేల కృతులతో వెంకటేశ్వరుడిని కీర్తించిన అన్నమయ్య గొప్ప వాగ్గేయకారుడు.
అన్నమాచార్య వారిది తాళ్ళపాక వారి వంశం. వీరి వంశం సంగీతానికి సాహిత్యానికి నిలయం. వీరి జన్మస్థలం కడప జిల్లాలోని తాళ్ళపాక. ఇది పెన్నానది తీరాన ఉన్నాది. మహాభక్తుడైన కన్నప్ప కూడా ఇక్కడే పుట్టాడు. ఈ జిల్లా పరిధిలోని ప్రతి నదీ ఓ పాట పాడుతుందని అంటారు. అంతే కాదు కథలు కూడా చెప్పగలదు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి. ఆయన కూడా గొప్ప కవి, పండితుడు. తల్లి లక్కమాంబ. ఆమె మహా భక్తురాలు. ఆమె కూడా పాటలు పాడేవారు. కడప జిల్లా సిద్దపట్నం తాలూకాలో ఉన్న చెన్నకేశవస్వామి ఆమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడని అంటారు.
అన్నమయ్యకు ఏదైనా ఒకసారి చెప్తే చాలు ఇట్టే దానిని అవగతం చేసుకునేవారు. పద్యసాహిత్యంపై అతితక్కువ సమయంలో పట్టు సంపాదించిన అన్నమయ్య నోటంట వచ్చిన ప్రతి మాట పాటై పోయేది.
ఒకరోజు ఆయన గడ్డి కోస్తుండగా పొరపాటున చిటికెనవేలు తెగిపోయింది. అప్పుడు గాతపడ్డ చోటు నుంచి కారిన రక్తాన్ని చూసి అన్నమయ్య జీవితంపై విరక్తితో మనసులో “తల్లీ తండ్రీ అంతా అబద్ధం…..ఈ బంధాలన్నీ అశాశ్వతం….ఈ బంధాలన్నీ భగవద్భక్తికి అవరోధాలు..” అని అనుకున్నారు.
అలా అన్నమయ్య చిన్న చిన్న పదాలతో గొప్ప భావాలను పలుకుతూ అనతికాలంలోనే అందరి దృష్టీ ఆకర్షించారు.
ఓసారి యాత్రీకులతోపాటు అన్నమయ్య కూడా గోవిందా గోవిందా అనుకుంటూ తిరుపతి చేరుకున్నారు. యాత్రీకులతో పాటు అన్నమయ్య “వేడుకుందామా వేంకటగిరి వేంకటేశుని …” అని ఆలపిస్తూ స్వామివారితో మమేకమయ్యారు.
తిరుమల కొండకోనల్లో ఆయనకు దశ అవతారాలు కనిపించాయి. ఆ దివ్యానుభూతుని స్మరిస్తూ “అదిగో అల్లదిగో శ్రీహరివాసము …” అంటూ కీర్తించిన తీరు మనం నిత్యమూ వింటూనే ఉన్నాం కదా…
ఆయన పాడుతున్న పాటలు వింటూ స్వామివారి అర్చకులు ఆశ్చర్యపోయేవారు.
వేంకటేశునిపై ఓ శతకాన్ని రాసిన అన్నమయ్య తిరుమల సమీపంలోని వివిధ పుణ్యస్థలాలు సందర్శించి వెంకటేశ్వరుడిని చూసి దణ్ణం పెట్టుకోవడానికి వెళ్ళారు. అయితే అప్పుడు అక్కడ బంగారు వాకిళ్ళు మూసి ఉన్నాయి. స్వామివారిని చూసి అర్చించుకోవాలనుకున్న తనకు ఈ అడ్డంకి ఏమిటని అనుకుని “బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాననే పాదము ….” అంటూ కీర్తించారు.
అంతే ఒక్కక్షణంలో ఆ వాకిల్లకున్న తాళాలు ఊడిపోయాయి. అక్కడ ఉన్నవారందరూ ఇది చూసి విస్తుపోయారు. అప్పుడు వారందరూ అన్నమయ్యను అసామాన్యుడిగా వర్ణించారు.
వేంకటపతి మినహా మరో దైవం లేదని ఆయన కీర్తించిన కృతులు ఒక్కొక్కటీ ఆణిముత్యమే.
వెంకటేశ్వరుడిని తనివితీరా దర్శించి ఆలపించిన పాటలు అజరామరం. వెంకటేశ్వరుడి అలంకారానికి పులకించిపోయారు అన్నమయ్య. అన్నమయ్యకు వెంకటపతి అనేక రూపాలలో దర్శనమిచ్చాడు. అన్నమయ్య అటుతర్వాత అహోబిలం కూడా వెళ్లి అక్కడి నరసింహస్వామిని కీర్తించారు.
“నానాటి బ్రతుకు నాటకము….”
“మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును…”
“ఎటువంటి భోగి వీడెటువంటి..” అని అనేక కీర్తనలు రాసిన అన్నమయ్య 1408 మే తొమ్మిదవ తేదీన జన్మించారు. తన 94వ ఏట 1503వ సంవత్సరంలో తుదిశ్వాస విడిచిన అన్నమయ్య రచయిత, యోగి, స్వరకర్త, కవిగా వినుతికెక్కారు.
– యామిజాల రేణుక