పల్లెల్లోనూ సైకిల్ జోరు

జిల్లా పరిషత్, మండల పరిషత్ వంటి ఎన్నికల్లోనూ సైకిల్ హవానే కనిపించింది. గత మార్చ్ 30న జరిగిన జిల్లా, మండల  ప్రజా పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర లో 9 జిల్లాలను కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లా పరిషత్ కూడా సైకిల్ చేజిక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం నిన్న వెలువరించింది.  నిన్న పట్టణాల్లో విజయ దుందుభి మోగించిన తెలుగుదేశం పార్టీ నేడు పల్లెల్లోనూ ఘన విజయం సాధించడం ప్రత్యర్థుల్ని సైతం నిర్ఘాంత పరుస్తోంది. సీమాంధ్ర లో మొత్తం 13 జిల్లా పరిషత్ లు ఉన్నాయి. అందులో 9 తెలుగుదేశం పార్టీ చేతికి అంది వచ్చాయి. అవి: శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు.

కాగా, జగన్ పార్టీ కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో మాత్రమే పాగా వేయగలిగింది. మండల ఎన్నికల్లో కూడా 70 శాతం స్థానాలు తెలుగుదేశం పార్టీకి, 30 శాతం స్థానాలు జగన్ పార్టీకి దక్కాయి. ఇది ఇలా వుండగా, తెలంగాణా రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీం నగర్, నిజామాబాద్ జిల్లాల్లో తెలంగాణా రాష్ట్ర సమితి విజయ కేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ పార్టీకి నల్గొండ మాత్రమే దక్కింది. మిగిలిన తెలంగాణా జిల్లాల్లో కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితిల మధ్య దాదాపు టై  ఏర్పడింది. ఈ పల్లె  ఫలితాలను బట్టి ఈ నెల 16న విడుదలయ్యే లోక్ సభ, శాసనసభ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.