పవన్ అత్తారింటికి వెళ్ళేది సైకిల్ మీదేనా?

పవనిజం తో పైరసీ సినిమాని వంద కోట్లకు చేరువలోకి తీసుకెళ్ళి పవర్ స్టార్ పవర్ ఏంటో అందరికీ రుచి చూపించాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ అభిమానులతో పాటు రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పుడు అందరూ చర్చిస్తోంది పవన్ నటించిన సినిమా అత్తారింటికి దారేది సాధించిన అఖండ విజయం గురించి కాదు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పవన్ సృష్టించబోయే సునామి గురించి. పవన్ కల్యాణ్ తెలుగు దేశం లో చేరనున్నాడు అనే గాసిప్స్ రాష్ట్ర మంతా చక్కర్లు కొడుతున్నాయి.

పవన్ కల్యాణ్, బాలయ్య బాబు, చంద్ర బాబు, లోకేష్ లు కలిసి ఉన్న తెలుగు దేశం ఫ్లెక్సీ ఒకటి గోదావరి జిల్లాలో అభిమానులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ మీడియా పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి కధనాలు వండి వారుస్తున్నాయి. పచ్చ కండువా భుజం పైన వేసుకున్న పవన్ స్టిల్ లు పలు వెబ్ సైట్ లలో కూడా హల్ చల్ చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఇటీవల కొద్ది కాలంగా చంద్రబాబు వియ్యంకుడు, సినిమా హీరో బాలకృష్ణ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. వారిద్దరి మధ్యా చాలా సానిహిత్యం ఏర్పడింది. బాలకృష్ణ కుటుంబం కోసం తాను నటించిన అత్తారింటికి దారేది సినిమాని ప్రత్యేకంగా వేయించినట్టు విశ్వసనీయం గా తెలిసింది. బాలయ్యబాబుతో ఉన్న స్నేహం వల్ల పవన్ కల్యాణ్ క్రమంగా తెలుగు దేశానికి దగ్గర అవుతున్నాడని, పార్టీ లో చేరడం కోసం చంద్రబాబుతో మంతనాలు జరిపి అన్న నాగబాబుకి మచలీపట్నం ఎం.పి. టికెట్ ఖాయం చేసుకున్నాడని మీడియాలో బోలెడన్ని కధనాలు వస్తున్నాయి. ఈ కధనాలని అటు పవన్ కానీ, ఇటు తెలుగు దేశం వర్గాలు కానీ అవునని ధృవీకరించడం లేదు, ఖండించడం లేదు. తెలుగు దేశం నాయకులు అయితే పూటకో ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ లోకి రావాలని పవన్ కళ్యాణ్ భావిస్తే సాదరం గా ఆహ్వానిస్తాం, ఆయన చాలా మంచి వ్యక్తి అని కితాబులు కూడా ఇస్తున్నారు.

అయితే పవన్ కల్యాణ్ నిజంగా రాజకీయాల్లోకి వస్తాడా ? వస్తే సొంతం గా పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తాడా లేకుంటే ఇప్పుడున్న పార్టీ లలో ఏదో ఒకదానికి మద్దతు ఇచ్చి పరోక్షం గా రాజకీయాల్లో ఉంటాడా అన్నది రాజకీయ వర్గాల్ని, అభిమానుల్నీ వేధిస్తున్న ప్రశ్న.

పవన్ కళ్యాణ్ కనుక రాజకీయాల్లోకి వస్తే అది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉంటుంది. మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 2009 ఎన్నికలకు ముందు స్థాపించారు. అప్పుడు ఆ పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడు గా పవన్ కళ్యాణ్ పని చేశారు. ప్రజారాజ్యం పార్టీ ప్రచార బాధ్యతని కూడా కొంత మోశారు. ఆ ఎన్నికల ప్రచారంలో పవన్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ వెనుక ఉన్న భీమరాం బాడా బస్తీని కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీ చేయించి మరో చోటకి తరలించినప్పుడు పవన్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల పంచెలూడ కొట్టండి అంటూ ప్రజలకి పిలుపు నిచ్చారు. అయితే, ఆ ఎన్నికలలో ప్రజారాజ్యం పరాజయం పాలైంది. పవన్ కల్యాణ్ పంచె లూడ కొట్టమన్న కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.ఆర్ నాయకత్వం లో తిరిగి ఘన విజయం సాధించింది. ప్రజా రాజ్యం 16 సీట్లతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సుమారు నాలుగు దశాబ్దాలుగా పైగా తిరుగు లేని హీరో గా వెలిగిన మెగా స్టార్ ప్రజా రాజ్యాన్ని నడప లేకపోయాడు. తాను ఏ పార్టీకి వ్యతిరేకం గా పార్టీ పెట్టాడో మర్చి పోయి కేంద్ర, రాష్ట్ర మంత్రుల పదవుల బేరం కుదుర్చుకొని ఆ పార్టీ లోనే ప్రజారాజ్యాన్ని వేలీనం చేసి పడేశాడు. కేంద్ర మంత్రి పదవిని అనుభవిస్తూ అధిష్టానం రాష్ట్రాన్ని విభజన చేస్తాం అంటే సరే అని సోనియా భజన చేస్తూ రాష్ట్ర ప్రజల ముఖ్యంగా అభిమానుల ఆగ్రహాన్ని చవి చూస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ప్రజారాజ్యం పరాజయం తర్వాత ఇంత వరకూ ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడ లేదు. అంతే కాదు ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిపాడనే కోపంతో అన్నతో కూడా సంబంధాలు సరిగా లేవు. రామ్ చరణ్ పెళ్లి లో తప్ప మిగిలిన సందర్భాల్లో వారిద్దరూ ఒక వేదిక పై అభిమానులకి కనపడింది చాలా అరుదు.

అన్నదమ్ములు ఇద్దరూ ఎడమొకం, పెడమొకం గా ఉన్న ఈ సమయంలో పవన్ రాజకీయాల్లోకి వస్తాడా ?
వస్తే స్వయం గా అన్నకి వ్యతిరేక పార్టీలో పని చేయాలి. పవన్ కానీ, మెగాస్టార్ కానీ ముఖ్యంగా నమ్ముకొంది వారి సామాజిక వర్గపు ఓట్ల పైనే. అయితే ఆ సామాజిక వర్గం ఓట్లని రాబట్టకలదే గానీ ముఖ్యమంత్రి పీటాన్ని దక్కించు కోగల నిర్ణయాత్మకం కాదు. గత ఎన్నికల్లో చిరంజీవి, పవన్, అభిమానులూ కలిసి పని చేస్తేనే వారికి ఇరవై సీట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు అన్న ఒక శిబిరంలో, తమ్ముడు మరో వర్గంలో. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి అండదండలు అందించిన ఒక సామాజిక వర్గం కాంగ్రెస్ ని విడిచి వై.ఎస్. జగన్ పార్టీ లోకి వెళుతోంది. ఎన్నికలకి ముందు కొద్ది రోజుల్లో పార్టీ నుంచి ఖాళీ చేయడం దాదాపు ఖాయమని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు. అందుకే పార్టీని కాపులతో బలోపేతం చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చిరంజీవిని ఆ సామాజిక వర్గ బలమైన నేతగా అధిష్టానం భావిస్తోంది. పల్లం రాజు, బొత్స వంటి వారి వల్ల పార్టీకి గ్లామర్ రాదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలకి ముందే కనుక రాష్ట్రం విడి పోతే సీమాంధ్ర సి.ఎం. అభ్యర్ధి గా చిరంజీవికి కూడా ఒక ఛాన్స్ ఉంది. మరి అప్పుడు పవన్ ఎవరికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడు. ఒకవేళ మీడియా లో ప్రచారం జరుగుతున్నట్టుగా పవన్ తెలుగు దేశం లో కనుక చేరితే చంద్ర బాబు మంత్రాంగంలో ఇమడ గలడా, మాట తప్పాడన్న కారణంతో సొంత అన్ననే కాదనుకున్న వ్యక్తి వర్తమాన రాజకీయాల్లో ఎదురయ్యే ఆటుపోట్లని లౌఖ్యంతో ఎదుర్కోగలడా అన్నది అభిమానుల ప్రశ్న. మరి ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే పవన్ నోరు తెరవాల్సిందే.

Send a Comment

Your email address will not be published.