పవన్ కొత్త పార్టీ

ప్రసిద్ధ తెలుగు నటుడు పవన్ కళ్యాన్ శుక్రవారం నాడు ‘జన సేన’ పేరుతో ఒక కొత్త పార్టీని ప్రారంభించారు. కేంద్ర మంత్రి చిరంజీవికి సోదరుడయిన పవన్ హైదరాబాద్ లో వేలాది మంది అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు. సమాజంలో విలువలతో, ప్రమాణాలతో కూడిన రాజకీయాలను తీసుకు రావడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన ప్రకటించారు. దేశ సమగ్రత కోసమే కాక, అన్యాయం, అవినీతి, అసమానత్వం వంటి అవలక్షణాలను తొలగించడానికి తాను ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్, ఇతర పార్టీలు వ్యవహరించిన తీరు తననెంతో కలవరపరిచాయని ఆయన అన్నారు. తాను తెలంగాణా రాష్ట్రం ఏర్పడడానికి వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వ్యవహరించిన తీరు దారుణంగా వుందని వ్యాఖ్యానించారు. ఆయనకు తాము మద్దతు ఇవ్వమని, తాము తెలుగు దేశం పార్టీకే మద్దతు ఇస్తామని కాపు నాడు ప్రకటించింది. తనకు కులం, మతం లేవని, తనకు కాపు నాడు మద్దతు ఇవ్వనక్కర లేదని పవన్ స్పష్టం చేశారు.

జన సేన పార్టీ తెల్లటి జెండా మీద, పారిశ్రామిక చక్రంతో ఏర్పడింది. ఈ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు కానీ, తన అభ్యర్థుల్ని స్వతంత్ర సభ్యులుగా నిలబెట్టే అవకాశం  ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  రాజకీయ రంగ ప్రవేశం  ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన వంతుగా పెదవి విప్పారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనను మహారాష్ట్రలోని శివ సేనలా ఊహించుకుంటే పోరపాటవుతుందని అన్నారు. పవన్ సేన  ఓ ప్రభంజనం సృష్టిస్తుందని వర్మ వ్యాఖ్యానించారు. చిరు ప్రజారాజ్యంలో జరిగిన అవకతవకలు జన సేన పార్టీలో జరగవని వర్మ అపార నమ్మకం. జన సేనకు మించిన గొప్ప పార్టీ ఇంకొకటి ఉండబోదని కూడా వర్మ తెలిపారు. తెలివితేటలూ, నిజాయితీ, అభిమానం, పౌరుషం ఉన్న వాళ్ళు పవన్ పార్టీకి ఓటు వేస్తారంటూ జనసేనాను సాదాసీదాగా అనుకోకూడదని చెప్పారు. శివ సేన కంటే జన సేన వెయ్యి రెట్లు నయమైన పార్టీగా నిలుస్తుందని, జనసేనను మరో రాజకీయ పార్టీగా అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుందని వర్మ గట్టిగా చెప్పారు.

Send a Comment

Your email address will not be published.