పవన్ నాకు ఆదర్శం

సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయి తనకు ఆదర్శమని అన్నారు.
ఈ నెల ఎనిమిదవ తేదీన ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్ర బాబు నాయిడు పదవీ స్వీకార ప్రమాణం చేసినప్పుడు ఆనాటి కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన వివేక్ ఓబ్రాయి పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ తో అనేక విషయాలపై ఆయన చాలాసేపు మాట్లాడారు.

పవన్ అన్న తనకు ఆదర్శమని వివేక్ ఓబ్రాయి చెప్పారు. తనను చంద్రబాబు నాయుడుగారు రమ్మంటే ఆయన పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి వచ్చానని అంటూ సూపర్ స్టార్ పవన్ తో తనకున్న సంబంధాలను చెప్పారు.

పవన్ తనకు పెద్దన్నయ్యలాంటి వారని, అయిదారేళ్ళ క్రితం తాను పవన్ కళ్యాణ్ ను కలిసానని అన్నారు. పవన్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. అయితే ఇప్పుడు మరెన్నో కారణాలకు తాను పవన్ అన్నను గౌరవిస్తున్నానని అన్నారు.

పవన్ అన్నతో మాట్లాడినప్పుడు ఆయన జన సేన పార్టీ గురించి చర్చించానని, ప్రజలకు సేవ చెయ్యాలన్న పవన్ మాటలు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. అలాగే రాజకీయాలలో ఏదో సాధించాలని తనకు పెద్దగా కోరికలు లేవని కూడా పవన్ చెప్పారని వివేక్ ఓబ్రాయి తెలిపారు. తనకు ప్రజలు ముఖ్యమని పవన్ చెప్పారని ఆయన అన్నారు.

భారీ ఎత్తున ఓ రక్తదాన శిబిరం నిర్వహించి ఒక్క రోజులో ఓకే లక్ష లీటర్ల రక్తం సేకరించాలని ఉందని పవన్ తో చెప్పగా ఈ కార్యక్రమానికి పవన్ తన వంతు సహకారం అందిస్తానన్నారని ఆయన చెప్పారు. ఈ మాటలు బట్టి పవన్ ప్రజా మనిషి అని చెప్పుకోవచ్చని, త్వరలో తాను మళ్ళీ వచ్చి పవన్ ను కలిసి మాట్లాడుతానని అన్నారు.

తాను రాజకీయాలలోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో అయితే లేదని, నిజానికి కొన్ని రోజుల క్రితమే తనను రాజకీయాలలోకి రావలసిందిగా కొందరు కోరారని, కానీ తానే ఆసక్తి చూపలేదని వివేక్ ఓబ్రాయి చెప్పారు. సమాజంలో మార్పు కోసం తాను ఒక ఆక్టివిస్టుగా చురుకుగా పాలుపంచుకోవాలని ఉందని అన్నారు.

రక్త చరిత్ర సినిమాలో వివేక్ ఓబ్రాయి పరిటాల రవి పాత్ర పోషించిన సంగతి విదితమే. పరిటాల రవి గారి భార్య సునీతను తాను కలిసానని, ఆమె మంత్రిగా పదవీ భాద్యతలు చేపడుతున్నందుకు సంతోషంగా ఉందని వివేక్ ఓబ్రాయి అన్నారు. ఆమె తనకు అక్క లాంటి వారని చెప్పారు. పరిటాల కుటుంబంతో తమ ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు.

Send a Comment

Your email address will not be published.