పవన్ స్టార్

పవన్‌ కళ్యాణ్ అచ్చంగా పవర్ స్టార్….ఇందులో అనుమానం లేదు.

p-kalyanఅటు సినిమాలు చేస్తూనే ఇటు ప్రజలకోసం పోరాడుతానని కాకినాడ సభలో మరో సారి చెప్పుకున్న పవన్‌ కళ్యాణ్ నటుడే కాదు, నిర్మాత, దర్శకుడు కూడా. కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు 1972 సెప్టెంబర్ రెండో తేదీన జన్మించిన పవన్ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. మరొకరు నాగబాబు. అలాగే ఇద్దరు అక్కయ్యలు కూడా ఉన్నారు. అన్నయ్య, వదినల సహకారంతోనే తాను ఈ స్థాయికి ఎదిగినట్టు చెప్పుకునే పవన్ నెల్లూరులోని వీ ఆర్ కళాశాలలో ఇంటర్ చదివారు. ఆ తర్వాత
కంప్యూటర్స్ లో డిప్లోమా చేశారు.

పవన్ నటించిన మొదటి చిత్రం “అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి”. ఈ చిత్రం 1996లో వచ్చింది. “కళ్యాణ బాబు”గా టాలీవుడ్ కు పరిచయమైన పవన్ ఆలోచనా సరళి మిగిలిన నటులకన్నా భిన్నమైనది. అందుకే ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని పెంచుకున్నారు.

అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి – సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల మధ్య సినీ ప్రస్థానంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎదిగిన పవన్ గబ్బర్ సింగ్ చిత్రానికి టాలీవుడ్ లో ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పవన్ వర్క్ చేసిన “అత్తారింటికి దారేది” చిత్రం ద్వారా వచ్చిన వసూళ్ళలో తెలుగు సినీపరిశ్రమలో కొత్త రికార్డును సృష్టించింది.
అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు కూడా నిర్మించిన పవన్ చిన్న వయస్సులోనే దర్శకత్వ బాధ్యతలు కూడా పుచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి.

మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశమున్న పవన్ “ఖుషి” చిత్రంలో చేసిన కార్నివాల్ ఫైట్ అతని టాలెంట్ కి గొప్ప ఉదాహరణ. తన చిత్రాలలో వచ్చే ఫైట్ సన్నివేశాలలో పవన్ స్వయంగా నటించినవే.

సినీ జీవితంలో ఓ స్థాయికి చేరుకున్న పవన్ రెండేళ్ళ క్రితం అంటే 2014లో మార్చి 14వ తేదీన ప్రజల కోసం జనసేన పేరుతో ఓ భారీ సభ నిర్వహించారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలకు అతీతంగా ఓ భారతీయుడిగా జాతి సమైక్యత కోసం, సమగ్రత కోసం జనసేన పార్టీ పుట్టినట్టు ప్రకటించుకున్నారు పవన్!

రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందించి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవనియ్యకుండా ప్రతి ఒక్కరూ పోరాడాలని పవన్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు చిరంజీవి” ప్రజారాజ్యం” పార్టీ తరఫున ప్రచారం చేసినప్పటికీ 2014 సాధారణ ఎన్నికల్లో మాత్రం పవన్ బీజేపీ – టీడీపీ లకు మద్దతుగా గళం విప్పారు. ఆయన పిలుపుతో నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు.
విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆ మధ్య తిరుపతిలో ఓ గంట సేపు భారీ జనసమూహం మధ్య ఉద్వేగంతో మాట్లాడిన పవన్ ఆ తర్వాత కాకినాడ సభలో ఎందుకనో కాస్త తగ్గారు అనే టాక్ వినవస్తోంది.

ప్రత్యేక హోదా కోసం పవన్ ఓ కార్యాచరణ ప్రకటిస్తారని అందరూ ఆశించారు. కానీ ఆయన ప్రత్యేక ప్యాకేజ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పాచి పోయినరెండు లడ్డూలను తీసుకుంటారా అని ఎంత సేపూ బీజీపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు పైనా, టీజీ వెంకటేష్ పైనా విమర్శలు చేసారు. సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరుతో పవన్ జరిపిన ఈ సభ అంచనాలకు మించి విజయవంతం అయినప్పటికీ జనం అంచనాలకు తగినట్లు ఆయన ప్రసంగం లేదని విమర్శలు వచ్చాయి. తనదీ రాజకీయ పార్టీ అని చెప్పుకున్న పవన్‌ ప్యాకేజీని సమర్థించిన ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ఉత్తరాంధ్రవాసుల చిరకాల కోరికైన విశాఖ జోన్‌పై మౌనం వహించడంతోనూ ఆయనపై పలువురు మాటలతో విరుచుకుపడ్డారు.

ఇలా ఉండగా, ఇప్పటికే ”ఇజమ్‌” పేరుతో ఓ పుస్తకం విడుదల చేసిన పవన్ తాజాగా “నేను – మనం – జనం” పేరుతో మరో పుస్తకాన్ని రాస్తున్నారు. ఈ పుస్తకం ద్వారా జనసేన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన ఉద్దేశం. తనను ప్రేరేపించిన పరిస్థితులను, పార్టీ ద్వారా చెయ్యాలనుకున్న కార్యక్రమాలను, సాధించాలనుకున్న ఆశయాలకు ప్రతిరూపంగా ఈ కొత్త పుస్తకం ఉండవచ్చని అనుకుంటున్నారు.

ఏదేమైనా, జనం మధ్య నిలదొక్కుకోవాలంటే పవన్ కళ్యాన్ తగిన ప్రణాళికతో తనకున్న అభిమానాన్ని ప్రజాబలంగా మలచుకోవడం ప్రధానం. కనుక ఆయన అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ ప్రజా జీవితంలోను ఏ మేరకు తన ఇమేజ్ ని తగ్గకుండా మరింత పెంచుకుంటారో వేచి చూడాలి.

Send a Comment

Your email address will not be published.