పాటకు కోట వేటూరి మాట

కలం బలంతో నవరసాలు ఒలికించిన వేటూరి సుందర రామమూర్తి  అంటే పాటకు ఎంతో ఇష్టం. ఆయనెప్పుడు కలం, కాగితాలు తీస్తాడా అని పల్లవులూ, చరణాలూ ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఆయన మనసు వంక చూస్తుంటాయి. మాటలు పోటీ పడుతుంటాయి ఆయన సిరా నుంచి కాగితాన్ని, కాగితంపైన పుట్టిన మాటలు చదివిన వారినీ, విన్న వారినీ మత్తులో గమ్మత్తులో పడేస్తాయి. ఆయన సృష్టించే మాటలకున్న శక్తిని కొలవలేము. మాటలు ఆయనను ఆడిస్తాయా లేక మాటల్ని ఆయన ఆడిస్తారా అనే ప్రశ్న కోడి ముందా? గుడ్డు ముందా అన్న ప్రశ్న లాంటిదే. చిన్న ఛిన్న మాటలతో పాటల ప్రపంచంలో అల్లుకుపోయిన వేటూరి గురుతుల్యులుగా ఆరాధించి అభిమానించిన రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రిగారినే. అచ్చ తెలుగు నుడికారానికి మల్లాది గుడి కట్టారన్నది వేటూరి మాట. అలాగే పాటల్లో దుష్ట సమాసాలు ప్రయోగించిన సముద్రాల (సీనియర్) అన్నా వేటూరికి చాలా అభిమానం. కొత్త కొత్త పద ప్రయోగాలతో ఆకట్టుకున్న పింగళి నాగేంద్ర రావు పాటలన్నా ఆయనకు ఎంతో ఇష్టం. మాట పొదుపులో తనను ప్రభావితం చేసిన కవి ఆచార్య ఆత్రేయ అని వేటూరి చెప్పుకునే వారు.

పాటకు చిలుక పచ్చని చీర కట్టిన వారందరికీ నమస్కరించి వేటూరి చెప్పిన కొన్ని మాటలు ఇక్కడ చూద్దాం…

“ఇచ్చిన ట్యూన్ కి భావాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ చక్కగా పాత రాయడం గొప్ప విషయం….అలా రాసిన వారిలో సముద్రాల రాఘవాచారి గారు ప్రప్రధములు. పూర్వ కవులలో అన్ని విధాలా అగ్రజుడాయన. సముద్రాల వారు తగిన సన్నివేశాన్ని ఆయనే వివరించి పాట రాసేవారు.

మల్లాది వారు గురుతుల్యులు. మహా కథకులు….మహా పండితులు…ఇలా మహా మహా అనడంలో ఉద్దేశం మహా అనే మాటకు సరిపోయే అతికొద్దిమంది ముఖ్యులలో ఆయన ఒకరు. కథా సరిత్సాగారాన్ని మధించిన మహానుభావుడు. జాను తెనుగు, తేనే తెనుగు, తేట తెనుగు ఆయన గడించిన సంపదలు. తెలుగు పాటకు ఎంతో ఉన్నతినీ, వైభవాన్నీ కలిగించిన మహానుభావుడుగా ఆయన గుర్తుండిపోతారు.

తెలుగు సినిమా సాహిత్యంలో పింగళి నాగేంద్ర రావు గారిది ఒక విశిష్టమైన అధ్యాయం. దర్శకులు కె వి రెడ్డి, పింగళి కలిసిన ప్రతిసారి స్వర్నదార కురుస్తూనే ఉంటుంది…” ఇలా పూర్వతరం రచయితలపై తమ అభిప్రాయాలను చెప్పిన వేటూరి “కవి ఈరోజు అత్యాధునికమైన సినిమా రంగం ద్వారా ఒక కట్టేసిన కుక్క కంటే హీనంగా బతుకుతుండటం, నిర్నామదేయుడు కావడం, నిర్నామ కర్మలు ఆచరించడం, కవిత్వం అనేది ఎంత చవుకుబారుతనానికి, నిరాదరణకు లోనైందో చెప్పక చెప్పే విషయాలు….ఆనాటి కవులు పూర్తి స్వాతంత్ర్యాన్ని, పూర్తి గౌరవాభిమానాల్ని చూరగొని ఆదరణకు పాత్రులై చేసిన కవితాలాపాలు మనకు తెలుసు” అని చెప్పడం విస్మరించకూడని వాస్తవం.

ఏదేమైనా వేటూరి  మాటకూ, పాటకూ శిరసాభివందనాలు….

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.