పాటల ఆవిష్కరణ

”శ్రీమంతుడు ట్రైలర్ చూశాక నేను రెండు సైకిళ్ళు కొన్నాను. నేను కొంచెం రఫ్ గా ఉన్నాను. చిన్నోడు (మహేష్ బాబు) మాత్రం కొంచెం స్మూత్ గా ఉన్నాడు..” అంటూ విక్టరీ వెంకటేష్ చెప్పారు. శ్రీమంతుడు విడుదల అయ్యాక అందరికీ దిమ్మదిరిగిపోతుందని, కలెక్షన్స్ అదరగొట్టేస్తాయని వెంకటేష్ చెప్పారు.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ కథానాయకుడిగా నటించిన “శ్రీమంతుడు” చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం 2015 జూలై 18వ తేదీన హైదరాబాదులోని శిల్పకళా వేదికలో కనులపండువగా సాగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ అతిధిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలోనే వివి వినాయక్ ధియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.

ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ అభిమానులు తన గుండెల్లో ఉన్నారని, అభిమానుల కోసం ఎప్పుడూ మంచి చిత్రాలు చేయడానికే ప్రయత్నిస్తుంటానని చెప్పారు. చివరిసారి అభిమానులను నిరాశపరిచానని, అందుకు తన తప్పుంటే క్షమించాలని అన్నారు. అయితే ఈసారి తన పుట్టినరోజుకు భారీ కానుక ఇస్తారని ఆశిస్తున్నానని మహేష్ బాబు అన్నారు. అభిమానుల ఆశీసులు, అభిమానం తనకు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

మహేష్ బాబు సరసన నటించిన శృతి హాసన్ మాట్లాడుతూ, మహేష్ అందగాడని, మంచి నటుడని, అది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. అయితే అతను ఎంతో నిరాడంబరమైన వ్యక్తి అని, మహేష్ పక్కన నటించడం సంతోషంగా ఉందని చెప్పారు.

జగపతి బాబు మాట్లాడుతూ, చిత్రం చూసిన తర్వాత ఎన్నారైలకు, ఇక్కడివాళ్ళకు సొంతఊరు వెళ్లి దత్తత తీసుకోవాలని అనుకుంటారని, దీనిని బట్టి కథ ఎంత బాగుందో అర్ధం చేసుకోవాలని అన్నారు. ఈ యూనిట్ లో ప్రతిఒక్కరు చిత్రం పెద్ద విజయం సాధించాలని మనసుపెట్టి పని చేశారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలితో ఆట పాటలతో అందరినీ ఆహ్లాదపరిచాడు.

కొరటాల శివ మాట్లాడుతూ, మహేష్ లాంటి గొప్ప నటుడితో పనిచేసే అవకాశం రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం చాలా హోంవర్క్ చేసి, కష్టపడి రాసిన కథ అని అన్నారు. తాను కథ చెప్పడంతోనే మరో ఆలోచన లేకుండా వెంటనే ఆయన ఓకే వ్హేటడం తన అదృష్టమని అన్నారు. ఈ చిత్రంలో పాటలన్నీరామజోగయ్య శాస్త్రి రాసారు. సాహిత్య విలువలతో పాటు కమర్షియల్ బాణీలో పాటలు రాయగల రచయిత రామజోగయ్య శాస్త్రి అని, దేవిశ్రీ మంచి పాటలు ఇచ్చాడని కొరటాల అన్నారు.

ఇలా ఉండగా, వివి వినాయక్ మాట్లాడుతూ… ఈ చిత్రం ట్రైలర్ బాగుందని, పాటలు విన్నానని, దేవిశ్రీ ప్రసాద్ ఇరగదీశాడని అన్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని, . మహేష్ బాబుతో వంద కోట్ల బడ్జెట్ సినిమా తీయాలనుందని, త్వరలో ఆయనకు నచ్చే కథ చెప్పి మంచి సినిమా తీస్తానని అన్నారు.

మహేష్ బాబు తండ్రి కృష్ణ మాట్లాడుతూ యాభై ఏళ్ళుగా తనను ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే మహేష్ బాబును కుడా ఆదరిస్తున్నారని, అభిమానుల ఆశీస్సులతో ఈ చిత్రం భారీ విజయం సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Send a Comment

Your email address will not be published.