తిరుమల బ్రహ్మోత్సవాలే వారి టార్గెట్

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా శుక్రవారం తిరుమలలో ప్రారంభమయ్యాయి. కలియుగ దైవం వెంకన్నని దర్సించుకోడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకి బయలు దేరుతున్నారు. బస్సులు లేక పోయినా, బందులు జరుగుతున్నా వెంకన్న భక్తులు ఆగ లేదు. వడ్డి కాసుల వాడికి మొక్కులు తీర్చడానికి మోకాళ్ళతో నడిచి అయినా వెళ్దామని దేశం నలు వైపుల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తం గా ఉన్న భక్తులు భావించారు. వెంకన్న సామి మీద భక్తులకు ఉన్న ఈ భక్తి పారవశ్యమునే తీవ్రవాదులు టార్గెట్ గా చేసుకున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో బాంబు దాడులు చేసి దేశాన్ని వణికించాలని తీవ్రవాదులు భావించారు. అయితే వారి కుట్రని తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు కలిసి చేధించారు.

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దు పుత్తూరు పట్టణం. చిన్న మునిసిపాలిటీ అయిన ఈ పుత్తూరు ప్రశాంతతకు మారు పేరు. విరిగిన కాళ్ళ ఎముకలకు ఆకు పసరతో నయం చేసే వైద్యం పుత్తూరులో ప్రముఖమైనది. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ తో సహా ఎంతోమంది ప్రముఖులు ఇక్కడ వైద్యం చేయించుకున్నారు. ఎడ్యుకేషన్ సెంటర్ గా, ప్రశాంతతకి మారు పేరుగా ఉన్న పుత్తూరు లో శనివారం తెల్లవారుజాము నుంచి పోలిసుల బూట్ల చప్పుడు, తుపాకీల మోతతో దద్దరిల్లింది. పుత్తూరు లోని గేటు పుత్తూరు లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో తమిళనాడు పోలీసులు ఒక ఇంటి పై దాడి చేసారు. వారు తిరిగి ఎదురు కాల్పులకు దిగడం తో తమిళ నాడు పోలీస్ శాఖకు చెందిన సి. ఐ. లక్ష్మణ్ మరణించారు. మరో పోలీస్ తీవ్రంగా గాయపడ్డారు . వారి వద్ద అధునాతన ఆయుధాలుతో పాటు మారణాయుధాలు ఉన్నాయని గ్రహించిన పోలీసులు ఆక్టోపస్ పోలీస్ సహాయంతో సుమారు ఎనిమిది గంటల పాటు రిస్క్యు ఆపరేషన్ చేసి లోపలున్న ఇద్దరు తీవ్ర వాదుల్ని సజీవంగా పట్టుకొని తమిళనాడు కి తరలించారు

పోలీసులు అరెస్ట్ చేసిన తీవ్రవాదులు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు. వారి పేర్లు బిలాల్, ఇస్మాయిల్ . వీరితోపాటు ఉన్న మరో ఉస్మాన్ తప్పించుకున్నాడు. వీరు ఇద్దరు తమిళనాడు లోని మధురైలో జరిగిన అద్వాని సభ లో జరిగిన బాంబు పేలుళ్ళకి కారకులు. తమిళనాడు బి.జె.పి రాష్ట్ర నేతని హత్య చేయడంతో పాటు మరో పదహారు హత్యల్లో నిందితులు. ఇప్పుడు కూడా తిరుమలలో జరుగుతున్నఉత్సవాల్లో బాంబ్ దాడులు చేయాలనే పక్కా ప్రణాళిక తో పుత్తూరులో తిష్ట వేసిన వీరిని పోలీసులు పట్టుకోవడంతో వారి కుట్ర రట్టు అయింది.

Send a Comment

Your email address will not be published.