పునర్ముద్రణకు పవన్ సాయం

Adhunika Mahabharatamపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుస్తకప్రియుడు అన్న విషయం బహుశా కొందరికి తెలిసుండకపోవచ్చు. ఆయన ఇంట పెద్ద గ్రంధాలయమే ఉంది. టైం ఉన్నప్పుడల్లా పుస్తకాలు చదవడం పవన్ అలవాటు. తన ఇంటిదగ్గరే కాకుండా తన కార్యాలయంలోనూ బోలెడు పుస్తకాలు దర్శనమిస్తాయి. ఆయన ఎక్కువగా ఇష్టపడే తెలుగు రచయితలలో గుంటూరు శేషేంద్ర శర్మ ఒకరు. కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులైన శేషేంద్ర శర్మ ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం కలవారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులైన శర్మ అటు వచన కవిత్వంలోను, ఇటు పద్యరచనలోను సమాన ప్రతిభావంతులుగా ఖ్యాతి గడించారు. ఆధునిక కవిత్వంలో విలక్షణమైన ప్రత్యేకతను సంతరించుకున్న శర్మ వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరచిన ఓ మహా రచయిత.

అంతటి గొప్ప రచయిత రాసిన పుస్తకాలలో ఆధునిక మహాభారతం ఒకటి. ఈ పుస్తకం ఇప్పుడు మార్కెట్లో దొరకడం లేదు. చాలా కాలంగా ఈ పుస్తకం మార్కెట్ లో లేదు. దీనిని పునర్ముద్రించేందుకు ఏ పబ్లిషర్ కూడా ఆసక్తి చూపలేదు. శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకి దీనిని పునర్ముద్రించడం కోసం తహతహలాడారు. ఇంతలో ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ఈ పుస్తకం పునర్ముద్రణకు తాను ఆర్ధిక సహాయం చేస్తానని మాట ఇవ్వడమే కాకుండా ఆ పుస్తకం మీద కొన్ని మాటలు కూడా రాశారు. ఆ పుస్తకం తనను ఎలా ప్రభావితం చేసిందీ ఆయన చెప్తూ అది తన జీవితానికి అది ఎంత ప్రధానమైందో పేర్కొన్నారు.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే తనకు శేషేంద్ర శర్మ సాహిత్యం పరిచయమైంది అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.