పూల పండగ - సద్దుల బతుకమ్మ

Bathukamma
మరో మాటలో చెప్పాలంటే ఇది ప్రకృతి పండగ అని చెప్పుకోవచ్చు. ఈ పండగ నాటిదే కాదు. సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆదిలో దీనిని కాకతమ్మ పూజగా చెప్పుకునేవారు. ఆ తర్వాత ఇదే బతుకమ్మ పండగగా మారింది.

తెలంగాణ సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. చోళ వంశానికి చెందిన ధర్మాంగుడు, సత్యవతి దంపతులకు చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. దాంతో వారు పిల్లల కోసం నోములు చేశారు. వారికి వంద మంది పిల్లలు పుడతారు. కానీ వారెవ్వరూ బతకరు. అందరూ యుద్ధంలో చనిపోతారు. ఈ విషాదంతో ఆ రాజదంపతులు అడవికి వెళ్ళి తపస్సు చేస్తారు. అప్పుడు వారికి లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. వారి బిడ్డగా పుడతానని చెబుతుంది లక్ష్మీదేవి. ఈ నేపథ్యంలో పుట్టిన బిడ్డ దీర్ఘ ఆయష్షుతో ఉండాలని వారు ఆ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెడతారు. ఆమె పెరిగి పెద్దదయిన తర్వాత శ్రీహరిని పెళ్ళి చేసుకున్నట్టు చారిత్రక కథనం. అప్పటి నుంచి బతుకమ్మ సంక్షేమం కోసం పండగ చేసుకోవడం సంప్రదాయంగా మారింది. బతుకమ్మ అనే దీవనే బతుకమ్మగా వాడుకలోకి వచ్చింది.

ఈ పండుగలో ముఖ్యంగా అందరినీ ఆకట్టుకునేది పువ్వులు పేర్చడం. గోపురం తీరులో పేరుస్తారు. ఇందుకు ఉపయోగించే పువ్వులు తంగేడు, పట్టుకుచ్చులు (సీత జడ పూలని మరొకపేరుంది), గులాబీ, కట్ల పూలు, గుమ్మడి, గునుగు, మందార, బంతి, తామర పువ్వులు. ఈ ఒక్కో పువ్వుకు ఔషధ గుణాలు ఉన్నాయి.

అవేంటో చూద్దాం…
తంగేడు పూలు – శరీరంలోని వాతం, ఉష్ణం, పరకోపాలను తగ్గిస్తుంది. రక్తప్రసరణను నియంత్రించి క్రమబదీదకరిస్తుంది.bathukamma1
పట్టుకుచ్చులు – ఈ పూలు జలుబును, ఆస్తమాను తగ్గిస్తుంది.
గులాబీ – ఆయుర్వేద మందుల్లో విరివిగా ఉపయోగిస్తారు.
కట్లపూలు – దీనిని కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
గుమ్మడి – ఈ పూలలో శరీరంలోని వేడి తగ్గించే ఔషధ లక్షణాలు ఉన్నాయి.
గునుగు – గునుగు, గడ్డిపూలు జీర్ణం చేసే ఔషధ లక్షణాలు ఉన్నాయి.
మందార – ఈ పూలను ఎండబెట్టి నూనెలో మరిగించి తలకు రాస్తే తలనొప్పి తగ్గుతుంది.
బంతి – ఈ పూలు సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. దీంతో సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు.
తామర – ఈ పూలు శరీర వేడిని తగ్గిస్తాయి. గాయాల నుంచి త్వరగా కోలుకునేట్లు చేస్తాయి.

బతుకమ్మ గౌరమ్మ తల్లిగా పూజలు అందుకుంటుంది. ఈ పూలతో పూజించడం ఓ ప్రత్యేకత. బతుకమ్మను తొమ్మిది రోజులపాటు ఆడతారు. తరావత చెరువు గట్టున మహిళలు తమ వెంట తెచ్చుకున్న ఫలహారాలను పంచుకుని ఆరగిస్తారు. ఒక్కోరోజు ఉపయోగించే ఫలహారాలు బతుకమ్మ పేర్లు – తొలి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ అని, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ అని, అయిదో రోజు అట్ల బతుకమ్మ అని, ఆరో రోజు అలిగిన బతుకమ్మ ని, ఏడో రోజు వేప కాయల బతుకమ్మ అని, ఎనిమిదో రోజు – వెన్నముద్దల బతుకమ్మ అని, తొమ్మిదో రోజు సద్దుల బతుకుమ్మ అని అంటారు. ఇలా తొమ్మిది రోజులపాటు బతుకమ్మలను చేసి ఫలహాహరాలతో గ్రామాలలో బొడ్రాయి, పట్టణాలలో ప్రధాన కూడళ్ళ వద్ద బతుకమ్మలను పెట్టి అన్ని వర్గాలవారు అక్కడికి చేరుకుని బతుకమ్మలు ఆడుతారు. తర్వాత చెరువులలో నీటి కొలనులలో నిమజ్జనం చేస్తారు. ఫలహారాలను ఒకరికి ఒకరు ఇట్టుకుంటారు. ఆనందంగా ఆరగిస్తారు.
– మహిమ

Send a Comment

Your email address will not be published.