పేరుపై వివాదం

హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ పేరును కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ టెర్మినల్ గా మార్చడంపై పెద్దఎత్తున వివాదం చెలరేగుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణా రాష్ట్ర శాసనసభ ఏకంగా ఓ తీర్మానాన్నే చేసింది. తెలంగాణాలో చరిత్ర సృష్టించిన నాయకులు పలువురు ఉండగా ఆంధ్రా నాయకుడి పేరును పెట్టడమేమిటని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్రంపై విరుచుకుపడ్డారు. దీనిపై తెలంగాణా శాసనసభలో సభ్యుల మధ్య వాద వివాదాలు పెట్రేగిపోయాయి. విమానాశ్రయం పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని, దీనికి రాజీవ్ పేరునే కొనసాగించాలని జానారెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ అందరివాడని, ఆయన పేరును పెట్టడంలో తప్పేమీ లేదని తెలుగుదేశం పార్టీ సభ్యులు వాదించారు. పైగా కేసీఆర్ ఒకప్పుడు ఎన్టీఆర్ కారణంగా పైకి వచ్చిన వాడేనని, నిజానికి ఆయన ఎన్టీ ఆర్ శిష్యుడేనని కూడా టీడీపీ వాదించింది. ఎన్టీ ఆర్ పేరు కన్నా పీవీ, కొమరం భీం పేర్లు పెట్టడం సమంజసమని కొందరు సభ్యులు మధ్యే మార్గంగా సూచించారు.
ఎన్టీ ఆర్ పేరును తొలగించాలని వ్యక్తిగంగా కూడా కేంద్రాన్ని కోరడానికి తెలంగాణా ముఖ్యమంత్రి త్వరలో ఢిల్లీ వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు.

Send a Comment

Your email address will not be published.