పేరులోనే కాంక్ష

ఠాకూర్ ఆకాంక్ష సింగ్ – పేరులోనే కాంక్ష, సాధించాలన్న పట్టుదల, విజయ పథమే లక్ష్యం, లక్ష్యసాధనకే ఆరాటం, ఆ దిశలోనే పోరాటం, మొక్కవోని ధైర్యం, మరచిపోని కర్తవ్యం, త్వరలో అందుకోనున్న కిరీటం.

పూర్వీకులు రాజస్తాన్ నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తెలంగాణా బిడ్డ ఠాకూర్ ఆకాంక్ష సింగ్ హైదరాబాద్ లో పుట్టి పెరిగి యాదృచ్చికంగా బిలియర్డ్స్ ఆటకు ఖైజెర్ చే పరిచయం చేయబడింది. అలా మొదలైన ప్రయాణం అంచలంచెలుగా ఎదిగి గతనెల అడిలైడ్ లో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొనే స్థాయికి ఎదిగింది. ఈ పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ వరకు రాగలిగింది ఆకాంక్ష. ఈ నెల సిడ్నీలో 8 – 11 తెదేల్లో జరగనున్న స్నూకర్ పోటీల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా తెలుగుమల్లి ఆకాంక్షను సాదరంగా పలకరించడం జరిగింది.

చిన్నప్పటి నుండి బిలియర్డ్స్ అంటే ఇష్టం ఏర్పడి ఈ ఆటకే అంకితం అయిన ఆకాంక్ష భారతదేశంలో 4వ స్థానంలో ఉండి 2008 లో డెంటల్ కోర్స్ పూర్తి చేయడానికి షుమారు 6 సంవత్సరాలు బిలియర్డ్స్ కు దూరం అయింది. అయినా పట్టుదలతో చదువు పూర్తి అయిన తరువాత ఏకాగ్రతతో మళ్ళీ ఆటపై పట్టు సాధించి అడిలైడ్ లో జరుగుతున్న పోటీలకు రావడం తెలంగాణా బిడ్డగా గర్వించదగ్గ విషయం. అంతకు ముందు పాల్గొన్న పోటీలన్నీ తనకు ఆత్మ స్థైర్యాన్నిచ్చి ఈ ఆటలోని మెలుకవలు నేర్పాయనీ ఇప్పుడు ప్రపంచంలో మొదటి స్థానాన్ని సంపాదించాలన్న తపన ఎక్కువైందనీ ఆకాంక్ష తెలిపారు.

ఆటలోని మెలుకవులు నేర్పిన కోచ్ శ్రీ శ్రీనివాసరావు గారు, రాజీవ్ గార్లకు ఆకాంక్ష కృతజ్ఞతలు తెలిపింది.

ప్రస్తుతం గచ్చిబౌలిలోని స్టేడియంలో ప్రాక్టీసు చేస్తూ ఉంటానని ప్రభుత్వ పరంగా మరిన్ని సదుపాయాలు కల్పించి ఆర్ధిక సహాయం అందిస్తే తన కల సాకారం అవుతుందనీ ఆకాంక్ష తెలిపారు. ఆర్ధికంగా ఇక్కడి NRI దాతలు ముందుకు వస్తే వారికీ ఋణ పడి ఉంటానని ఆమె అన్నారు.

Send a Comment

Your email address will not be published.