ప్రకాష్ రాజ్ వివాదం

కొంతకాలంగా నలుగుతూ వస్తున్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వివాదం సారీ, హెచ్చరికలతో కొలిక్కి వచ్చింది.

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఆగడు చిత్రంలో ప్రకాష్ రాజ్, సహాయ దర్శకుడి మధ్య ఆమధ్య వివాదం  వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ గొడవ చినికిచినికి గాలివానైంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

ఈ గొడవపై మే 9వ తేదీన హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్ వీ ప్రసాద్ అధ్యక్షతన సమన్వయ సంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి గొడవపడ్డ ఇరువర్గాలతో పాటు కమిటీ ప్రతినిధులు వీరశంకర్, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, శివాజీ రాజా, జెమిని కిరణ్, ఆర్ కె తదితరులు హాజరయ్యారు.

ఆగడు చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రవర్తనతో విసిగి దర్శక విభాగం ఆయనను  సినిమా నుంచి తప్పించడమే కాకుండా ఆయన నడతపై దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ ను సినిమా నుంచి తొలగించి ఆయన స్థానంలో సోనూ సూద్ ను తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ గొడవ వెనక ఉన్న ఒక వ్యక్తి పేరు త్వరలోనే బయట పెడతానని అన్నారు. మొత్తానికి ఈ గొడవకు తెర  దించడానికి మే 9న సమన్వయ సంఘం సమావేశమైంది. గొడవ పడిన ఇరు వర్గాలు తమ తమ వాదనలు వినిపించాయి. ఈ వాదనలు దాదాపు మూడు గంటల పాటు వాడిగా వేడిగా సాగాయి.

ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చెయ్యాలని నిర్మాతలు దిల్ రాజ్, స్రవంతి రవి కిషోర్, టాగూర్ మధు నిర్ణయించడమే కాకుండా  ఆయన తరఫున వాదించడానికి ఒక పధకం కూడా రూపొందించారు. ఈ సమావేశానికి రావడానికి ముందు స్రవంతి రవికిషోర్ ఆఫీసులో వీరు ముగ్గురూ కలిసి మాట్లాడుకున్నారు.

దర్శకుల సంఘం తరఫున మీడియాకు పంపిన ఎస్ ఎం ఎస్ పైకూడా సమన్వయ సంఘం సమావేశంలో చర్చ జరిగింది.

చివరకు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్ వీ ప్రసాద్  ఇరు వర్గాలను శాంతింప చేసారు. ప్రకాష్ రాజ్ తో సారీ చెప్పించారు. షూటింగు రెండు రోజులలో గొడవ వల్ల కలిగిన అంతరాయానికి, నిర్మాతకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. సినిమాకు తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చెయ్యడానికి ప్రకాష్ రాజ్ సమ్మతించినట్టు తెలియవచ్చింది. అలాగే దర్శక విభాగానికి క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్  పరిహారం చెల్లించడానికి అంగీకరించినట్టు కూడా తెలిసింది.

ఈ సందర్భంగా ఎన్ వీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ పై ఎలాంటి నిషేధం విధించడం లేదని అన్నారు. ఇక ముందు సెట్స్ లో జరిగే వివాదాలు మీడియా వరకు రాకుండా సంయమనం పాటించాలని ఆయన ఇరు వర్గాలకు హితవు పలికారు.

దీనితో ప్రకాష్ రాజ్ వివాదం ముగిసినట్టు ఎన్ వీ ప్రసాద్ తెలిపారు.

Send a Comment

Your email address will not be published.