ప్రజాస్వామ్యం నవ్వులపాలు!

లోక్ సభ నిండుసభలో ప్రజాస్వామ్యం నవ్వులపాలయింది. వివిధ రాజకీయ పక్షాలు పోటాపోటీగా వేసిన వ్యూహాలతో తెలుగువారి పరువు కుప్పకూలిపోయింది. సొంత సభ్యుల మీదకే కాంగ్రెస్ కమాండో బలగాన్ని ఉపయోగించగా, సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని కొట్టుకున్నారు. మైకులు విరిచేశారు. అద్దాలు బద్దలుకొట్టారు. సెక్రటరీ జనరల్ ముందున్న కంప్యూటర్ ను పగలగొట్టారు. పెప్పర్ స్ప్రేతో లగడపాటి రాజగోపాల్ వీర విహారం చేశారు. కాళ్ళ మంటలతో సభ్యులంతా హాహాకారాలు చేశారు. ఏదో జరిగిందని సభ్యులంతా బయటికి పరుగులు పెట్టారు. గాయాలయిన నలుగు సభ్యులని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి తెలంగాణా సభ్యులతో సహా 10 మంది సభ్యులని సస్పెండ్ చేశారు.

ఈ పరిస్థితుల మధ్య కేంద్రం మొత్తానికి తెలంగాణా బిల్లును ప్రవేశ పెట్టింది. అయితే తమ ప్రమేయం లేకుండా బిల్లును ప్రవేశ పెట్టె ప్రయత్నం చేసినందువల్ల బిల్లును ప్రవేశ పెట్టినట్టు కాదని బీజేపీ వాదిస్తోంది. ఈ గందరగోళం మధ్య బిల్లుపై చర్చను సోమవారం నాటికి వాయిదా వేయడం జరిగింది. బిల్లును ప్రవేశ పెట్టామని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ ప్రకటించారు. సంప్రదాయాన్ని పాటించలేదని, తీర్మానాన్ని చదవలేదని, అందువల్ల బిల్లును ప్రవేశ పెట్టినట్టు కాదని బీజేపీ సభానాయకురాలు సుష్మా స్వరాజ్ వాదించారు. ఆరు పార్టీల సభ్యులతో వెళ్లి సభాపతికి తమ అభిప్రాయం తెలిపారు.

నిజానికి సభాపతి మీరా కుమార్ సూచన మేరకు షిండే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని చదవబోతుండగా సభలో గందరగోళం మొదలయింది. విచిత్రమేమిటంటే, బిల్లు ప్రవేశ పెట్టె సమయంలో సభలో ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ, సోనియా గాంధీ గానీ లేరు. ఆ తరువాత కూడా రాలేదు. గందరగోళం సృష్టించిన కారణంగా 16 మంది సభ్యులను సస్పెండ్ చేసిన తరువాత సభలో తెలంగాణా అనుకూల సభ్యుల సమాఖ్య పెరిగిందని షిండే చెప్పారు. సభ వెల్ లోకి వెళ్లి అరుపులు, కేకలు పెట్టిన వారిలో కేంద్ర మంత్రులు పురందేశ్వరి, కావూరి, పల్లంరాజు ప్రభ్రుథులు కూడా ఉన్నారు.

కుప్పకూలిన కొనకళ్ళ
తెలంగాణా బిల్లుపై నిన్న లోక్ సభలో గందరగోళం నెలకొన్న సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు కొనకళ్ళ నారాయణ రావు లోక్ సభ వెల్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కాంగ్రెస్ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, పైగా సీమాంధ్ర సభ్యులు కత్తులతో దిగారంటూ మంత్రి కమల్ నాథ్ ఆరోపించడంతో ఆయన తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఆయన వెల్ లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు భద్రతా సిబ్బంది గట్టిగా అడ్డుకున్నారు. దాంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ లోపల తోపులాటలు కూడా మొదలయ్యాయి. ఈ పరిస్థితిలో ఆయన గుండెపోటుకు గురై, పడిపోయారు. ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.