ప్రణవ స్వరూపి

వినాయకుడు ప్రణవ స్వరూపి. వినాయకుడి ముఖమూ, వక్రతుండం ప్రణవాన్ని స్ఫురింప చేస్తాయి. వినాయకుడు ఎంతటి క్లిష్టమైన కార్యాన్నైనా సునాయాసంగా చేసేస్తాడు. భక్తుల కోరికలు తీర్చడంలో వినాయకుడు కామదేనువే. పైగా వినాయకుడు సర్వగుణాలకు అధిష్టాన దేవత. గజాననుని గణపతిగా ఋగ్వేదం చెబుతోంది

గణపతిలో గ అంటే జ్ఞానార్థ వాచకం. ణ అంటే నిర్వాణ వాచకం. అంటే జ్ఞాన నిర్వాణ వాచక గణానికీ అధిపతి గణపతి. యోగశాస్త్రం ప్రకారం మూలాధారానికి అధిదేవత. సర్వ స్వతంత్రుడు వినాయకుడు. సర్వ విధాలైన సమస్త విఘ్నాలను రూపు మాపి సకల శుభాలు కలుగ జేసే దైవం వినాయకుడు. అందుకే సర్వ పూజా కార్యక్రమాలలో ముందుగా వినాయకుడి పూజ చేస్తారు. వినాయకుడి వాహనం మూషికం. వినాయకుడికి కుడుములు, ఉండ్రాళ్ళతో నైవేద్యం పెట్టడం ముఖ్యం. వినాయక నవరాత్రులతో నగరాలన్నీ సందడిగా మారటం తెలిసిందే కదా.

స్కంద, మౌద్గాల పురాణాలలో వినాయకుని మహత్యం గురించి ఒక కథ ఉంది.

పూర్వం అభినందనుడు అనే రాజు ఇంద్ర భాగం లేని ఒక యజ్ఞం తలపెడతాడు. దీనితో ఇంద్రుడు కోపించి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయమని కాలుడికి ఆదేశిస్తాడు. అంతట ఆ యజ్ఞ పురుషుడైన కాలుడు విఘ్నాసుర రూపం ధరించి అభినందన రాజును సంహరిస్తాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. దీనితో వశిష్టుడు తదితర మునులు కలత చెంది బ్రహ్మ వద్దకు వెళ్లి కాలుడు గురించి చెప్తారు. అప్పుడు బ్రహ్మ గణేశుని స్తుతించి ప్రసన్నం చేసుకుంటాడు. అనతరం మునిగణులు వినయాకుడిని స్తుతిస్తారు. వినాయకుడు ప్రసన్నుడై విఘ్నాసురుడిని ఓడిస్తాడు. అంతట కార్యారంభ సమయాన గణపతిని పూజిస్తే ఏ విఘ్బాలు లేకుండా అనుకున్నవి సాగిపోతాయి.

గజముఖుడు

వినాయకుడు గజముఖుడు అవడానికి ఓ కథ ఉంది.

ఒకరోజు పార్వతి దేవి తలంటు కోవడానికి ముందు నలుగు పిండితో ఒక మూర్తిని తయారుచేస్తుంది. తాను స్నానం చేసి వచ్చేవరకు కావాలి కోసం అ మూర్తిని గడప దగ్గర ఉండమంటుంది. కాస్సేపటికి శివుడు వస్తాడు. అయితే ఆ మూర్తి శివుడ్ని లోపలి వెళ్ళనివ్వకుండా అడ్డగిస్తాడు. దానితో శివుడికి కోపం వచ్చి ఆ మూర్తి తల నరుకుతాడు. పార్వతి దేవి తాను చేసిన మూర్తికి ప్రాణం పోయాలని అడుగుతుంది. అప్పుడు శివుడు సరేనని, ఉత్తర దిక్కున శిరసు పెట్టి పడుకున్న ప్రాణి ఎవరు ముందుగా కనిపించినా ఆ శిరసు తీసుకొచ్చి ఈ మొండానికి పెట్టి ప్రాణం పోస్తానని అంటాడు. అందుకు పార్వతి సరేనని అంటుంది. శివుడు ఉత్తర దిక్కుకు వెళ్ళగా ముందుగా ఓ ఏనుగు కనిపిస్తుంది. శివుడు ఆ ఏనుగు తల తీసుకొచ్చి పార్వతి దేవి తయారు చేసిన మూర్తికి పెట్టి ప్రాణం పోస్తాడు. ఆ శిశువునే తమ తొలి బిడ్డగా శివుడు అంగీకరిస్తాడు. అంతే కాదు శైవగణాలకు పతిగా, సైన్యాధిపతిగా చేస్తాడు. ఈ కారణంగానే ఉత్తర దిక్కున తల పెట్టుకుని నిద్రపోకూదన్న మాట వాడుకలోకి వచ్చింది.

ఏకదంతుడు

పరశురాముడు ఓ సారి శివపార్వతులను చూడటానికి వస్తాడు. అప్పడు అక్కడ కావలిగా ఉన్న వినాయకుడు పరశురాముడిని లోపలి వెళ్ళనివ్వక అడ్డుకుంటాడు. దాంతో పరశురాముడు, వినాయకుడి మధ్య పోరు జరుగుతుంది, వినాయకుడు తన తొండంతో పరశురాముడిని పైకి ఎత్తుతాడు. పరశురాముడు పరశువుతో వినాయకుడిని కొడతాడు. ఆ దెబ్బకు వినాయకుడి ఒక దంతం ఊడిపోతుంది. దీనితో వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు వచ్చింది.

ఇలా వినాయకుడికి ఎన్నో నామాలున్నాయి. వాటిలో గజానన, గజవదన, హరిముఖ, హేరంబ, లంబకర్ణ, లంబోదర, విఘ్నేశ తదితరనామాలు కొన్ని.

వినాయకుడు వివాహితుడు

వినాయకుడు బ్రహ్మచారి అని అంటూ ఉంటారు కాని అది నిజం కాదని, పెళ్లి అయినట్టు ముద్గుల పురాణం చెబుతోంది. పార్వతీ పరమేశ్వరులు అతని శక్తికి మెచ్చి సిద్ధి, బుద్ధి అనే కన్యలనిచ్చి పెళ్లి చేస్తారు. వీరికి క్షేముడు, లాభుడు అని ఇద్దరు కొడుకులు పుడతారు.

పత్ర పూజ ప్రధానం

వినాయక చవితినాడు పువ్వులకన్న పత్రాలతోనే పూజ ప్రధానంగా చేస్తారు. ఈ పత్రాలకు ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా 21 పత్రాలతో పూజ చేస్తారు. అవి, మాచి, బృహతి, బిల్వం, గరిక, దుత్తూర, బదరీ, అపామార్గ, తులసీ, చూత, కరవీర, విష్ణుక్రాంత, దాడిమీ, దేవదారు, మరువం, సింధూర, జాజి, గండకీ, శమీ, అశ్వత్థ, అర్జున, అర్క. వీటిలో గరికకున్న ప్రత్యేకత వేరు. జంట గరిక పోచలతో 21 సార్లు పూజ చేయాలని అంటారు.

గరిక ప్రత్యేకత

ఇందుకో కథ ఉంది.

శివపార్వతులు ఓ సారి పాచికలాడుతూ గరిక పోచాలతో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి సాక్షిగా పెట్టుకుంటారు. అయితే ఆ బొమ్మ శివుడి వైపే మాట్లాడుతుంది. దీనితో పార్వతికి కోపం వచ్చి ఆ బొమ్మను కుంటివాడు కావాలని శపిస్తుంది. అప్పుడు అతను తనకు శాపవిముక్తి ఎలా అని ప్రాదేయపడుతాడు. పార్వతి సరేనని వచ్చే భాద్రపద శుద్ధ చవితికి నాగ కన్యలు వచ్చి ఇక్కడ గణేశ పూజ చేస్తారు. అప్పుడు నువ్వు వారి వల్ల గణేశు పూజ ఉపదేశం పొంది ఆ విధంగా చేస్తే శాపవిముక్తుడవుతావు అని అంటుంది. అతను అలాగే చేస్తాడు. తన నిర్మాణంలో ఉపయోగించిన దూర్వాను అతను విశేషంగా గణపతి పూజకు వాడి ఆత్మార్పణం చేసినట్లు భావిస్తాడు. గరిక పోచల పూజకు ఆనందించి గణపతి అతని కుంటితనం పోగొడతాడు.

అనేక నామాలు – గణపతి దేవునికున్న పేర్లు

ఆఖువాహనుడు, ఉమాసుతుడు, ఎలుకరౌతు, ఏకదంష్ట్రుడు, ఏనుగుమొగమయ్య, ఏనుగుమోముసామి, ఒంటికొమ్ముదేవర, ఒంటికొమ్మువేలుపు, కటంకటుడు, కరివదనుడు, కొక్కుతేజిరౌతు, కొక్కురవుతు, కొమ్ములుగలవేలుపు, గజాననుడు, గజాస్యుడు, గణపతి, గణాధిపుడు, గణేశుడు, గణేశ్వరుడు, గరుత్మంతుడు, గుజ్జువేలుపు, ద్విదేహుడు, ద్విధాతువు, ద్విపాస్యుడు, ద్విమాత్రుకుడు, ద్వైమాతురుడు, పగటిపంటిదొర, పనిచెఱుపులదొర, పరశుధరుడు, పర్శుపాణి, పాపజన్నిగట్టు, పార్వతీనందనుడు, పిళ్ళారి, పుష్టికాంతుడు, పృథ్వీగర్భుడు, బొజ్జదేవర, భవాత్మజుడు, మూషకవాహనుడు, మూషకరథుడు, వక్త్రతుండుడు, వక్రతుండుడు, విఘ్ననాయకుడు, విఘ్నరాజు, విఘ్నహారి, వినాయకుడు, వెనకయ్య, శాంకరి, శూర్పకర్ణుడు, సదాదానుడు, సింధురవదనుడు, సుముఖుడు, హరిహయుడు, హస్తిమల్లుడు, హేరంబుడు, హేరుకుడు.

మట్టి ప్రతిమలే మేలు

వినాయకవ్రతాన్ని ముఖ్యంగా మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమకు చేయడమే ఉత్తమం. ఎందుకంటె రకరకాల రసాయనాలు, ఇనుము తదితర వాటితో చేసే వినాయకుడి బొమ్మలను తీసుకొచ్చి పూజ చేసి ఆ తర్వాత చెరువుల్లోనో, సముద్రాలలోనో నిమజ్జనం చేసేటప్పుడు వాటి రసాయనాల వల్ల నీరు కలుషితమై దేనికీ ఉపయోగం లేకుండా పోతుంది.

– నీరజ, కైకలూరు

Send a Comment

Your email address will not be published.