ప్రమాదంలో విజయవాడ

విజయవాడ, దాని చుట్టుపక్కల సుమారు 150 కిలోమీటర్ల పరిధిని భూకంప ఆస్కార ప్రాంతంగా అధికారులు గుర్తించారు. నేపాల్ లో భూకంపం వచ్చిన నేపథ్యంలో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఈమేరకు ఒక ప్రకటన చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక అధికారులు అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉందని వారు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో 159 సార్లు భూమి అతి తక్కువ స్థాయిలో కంపించినట్టు సర్వే నిపుణులు తెలిపారు.
విజయవాడ, దాని పరిసర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం శ్రేయస్కరం కాదని, ఈ నగరాన్ని రాజధానిగా అభివృద్ధి చేయడం కూడా అంత మంచిది కాదని నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు.
ఒకవేళ ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించదలచుకున్నా, భూకంప నిరోధక సామగ్రిని, నిర్మాణ సామగ్రిని ఎక్కువగా ఉపయోగించాలని వారు సూచించారు.
విజయవాడ మట్టి కూడా భారీ భవనాలకు అనుకూలంగా లేదని వారన్నారు. గుజరాత్ రాష్ట్రంలో భూకంపం తరువాత భవన నిర్మాణానికి మార్గదర్శకాలు రూపొందాయని, అటువంటి వాటిని ఇక్కడా అనుసరించాలని వారు భవన నిర్మాణ వ్యాపారులను కోరారు.

Send a Comment

Your email address will not be published.