ప్రవాస భారతీయ దివస్ లో తెలుగు

బహుళ సంస్కృతికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఆస్ట్రేలియా దేశంలోని వార్తా మాధ్యమాల్లోనూ, గ్రంధాలయాల్లోనూ, ప్రభుత్వ కర పత్రాల్లోను ఇతర భాషలతో పాటు తెలుగుని కూడా ప్రచార భాషగా ప్రాధాన్యతనివ్వాలని శ్రీ సారధి మోటమర్రి గారు సిడ్నీలో జరుగుతున్న ప్రాంతీయ ప్రవాస దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన భాషా వేదికలో ఆస్ట్రేలియా, భారత దేశ ప్రభుత్వాదినేతలకు అభ్యర్ధించారు.  అలాగే ABS Census లో తెలుగు కూడా ఒక భాషగా పొందుపరచాలని విజ్ణప్తి చేశారు.

ప్రపంచంలో షుమారు 18 కోట్ల మంది మాట్లాడే తెలుగు భాష అతి ప్రాచీన భాషనీ, భారత ప్రభుత్వం రెండేళ్ళ క్రితం తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించిందని తెలిపారు.  ఆస్ట్రేలియాలో తెలుగు వారి వలస 50 సంవత్సరాల క్రితం మొదలై గత 20 ఏళ్లుగా విశేషమైన రీతిలో పెరిగింది.  ప్రస్తుతం ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాల్లో షుమారు లక్షకి పైగా తెలుగువారున్నట్లు అనధికార గణాంకాల అంచనా.

ఈ నెల 11వ తేదీన సిడ్నీలో ప్రాంతీయ ప్రవాస దినాన్ని NSW ప్రీమియర్ శ్రీ బారీ ఓ ఫారెల్ మరియు భారత ప్రభుత్వం తరఫున ప్రవాస భారతీయుల మంత్రి శ్రీ వావిలాల రవి ప్రారంభించారు.  ఆస్ట్రేలియా దేశంలో మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఈ ప్రవాస దినం ముఖ్యోద్దేశ్యం ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రవాసీయులందరికీ భారత ప్రభుత్వ కార్యక్రమాలు తెలియజేయడం మరియు వారి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉభయ దేశాల సంయుక్త కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఉపయోగించడం.

వివిధ నగరాల్లో తెలుగువారు

సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, ఆక్లాండ్ మొదలైన  పెద్ద నగరాల్లో తెలుగు సంఘాలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలుగు బడులు నిర్వహిస్తున్నట్లు శ్రీ సారధి గారు చెప్పారు.  ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో సిడ్నీలో రెండవ ప్రపంచ తెలుగు మహోత్సవం జరిగిందనీ ఈ ఉత్సవం తెలుగు భాషోద్యమంలో భాగమనీ శ్రీ సారధి గారు వక్కాణించారు.  ఇవే కాకుండా ప్రతీ నగరంలోనూ తెలుగు రేడియో కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయని తెలిపారు.  అంతే కాకుండా ఆస్స్ట్రేలియా తెలుగువారు అంతర్జాతీయ ఇంటర్ నెట్ రేడియోలలో (TORI, Tharanga)  పాలు పంచుకొంటున్నారు. భారత ప్రభుత్వము కూడా ఆకాశవాణి మరియు దూరదర్శని కార్యక్రమాలని ఇక్కడివారికి కూడా అందుబాటులోనికి తీసుకొని రావాలని కోరారు.

భువన విజయం

మెల్బోర్న్ లోని భువన విజయం సాహితీ సాంస్కృతిక సంవేదిక గత మూడేళ్ళుగా ఎన్నో సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ 2010  లో “కవితాస్త్రాలయ” అనే సాహితీ సంకలనం ప్రచురించిందనీ 2014 ఉగాది సందర్భంగా ఆస్ట్రేలియా లోని తెలుగు వారందరి రచనలతో ఇంకొక పుస్తకం ప్రచురించడానికి రంగం సిద్ధం చేస్తుందనీ తెలిపారు.

 

ఈ సందర్భంగా శ్రీ సారధి గారు తెలుగుని విశ్వవిద్యాలయాల్లోనూ మొదటగా పరిచయం చేసి పరిశోధకు అవకాశం ఇవ్వాలని సూచించారు.  దీనికి భారత మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు తగు ప్రోత్సహన్నిచ్చి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడాలని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

తమ ఉపన్యాసాన్ని ముగిస్తూ, తెలుగు ప్రత్యేకత గురించి నాలుగు మాటలు చెప్పారు, ఏమిటంటే: తీయనైన తెలుగు భాషని బ్రిటిషరైన సి.పి. బ్రౌన్, ‘Italian of the East’ గా అభివర్ణించారని, బహుశ అదే ఏ తెలుగువారో, పాశ్చాత్య దేశాలని పాలించివుంటే, ఇటాలియన్ భాషను ‘Telugu of the West’ గా చెప్పి వుండే వారన్నారు. పైగా ఆస్ట్రేలియాలోని ఎబోరిజినల్ పదాలు వింటుంటే తెలుగు పలుకులా వుంటాయని చెప్పారు. ఈ రెండు విషయాలు సభ్యుల మన్ననల నందుకొన్నాయి.

Send a Comment

Your email address will not be published.