ప్రేమానురాగాలకు ప్రతీక

శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది. విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రం. కనుక శ్రవణా నక్షత్రం కూడిన పూర్ణిమ కావడంతో ఈ నెలకు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రీ కృష్ణుడు పుట్టిన మాసం ఇది. గరుడుడు అమృత భాండాన్ని సాధించిన ఈ మాసంలో బోలెడు పండగలు వస్తాయి. ఈ మాసంలో శని, మంగళ , శుక్రవారాలను విశేషంగా పరిగణిస్తారు. అటువంటి ఈ నెలలోనే రక్షా బంధన్ లేక రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజునే శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, అనురాగానికి సూచకంగా ఈ పండుగ జరుపుకుంటారు. సోదరులకు ప్రేమ పూర్వకంగా సోదరి రాఖీ కట్టడం ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నదే. రాఖీ అంటే రక్షణ బంధం. తోరం పట్టు దారంతోనో నూలు దారంతోనో చేస్తారు.

సర్వ రోగ ఉపశమనం కోసం సర్వాశుభ వినాశం కోసం యుధిష్టరుడు శ్రీకృష్ణుడిని ఉపాయం అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రక్షా బంధన విధి ఉపదేశిస్తాడు. దేవాసుర పోరులో ఇంద్రుడికి ఇంద్రాణి రక్షాబంధనం ఇచ్చి విజయాన్ని సంపాదించినట్టు శ్రీకృష్ణుడు చెప్తాడు.

ఇలా రక్షా బంధనం ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నదే.

రాఖీ పౌర్ణమి రోజు సోదరులు, సోదరీమణులు తమ పెద్దల సమక్షంలో చూడముచ్చటైన దుస్తులతో కనిపించి ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడతారు. ఒకవేళ సోదరులు ఎక్కడో దూరప్రాంతాల్లో ఉంటే రాఖీ పౌర్ణమి నాటికల్లా వారికి రాఖీ చేరేలా గ్రీటింగ్ కార్డుతోసహా ముందే పంపుతారు. సోదరుడి ముంజేతికి సోదరి ఉదయాన్నే రాఖీ కట్టడం ఆనవాయితి. అయితే ఆ రాఖీ కట్టడంలో ఒక పద్ధతి పాటించాలి. అదేమిటో చూద్దాం…

రాఖీ కట్టడంతోనే సోదరి తన సోదరుడి సుఖసంతోషాలకోసం ప్రార్ధిస్తుంది. మధ్యాన్నం సోదరుడు తన ఇంట్లో కానీ తన సోదరి ఇంట్లో కానీ తన సోదరి వండి వడ్డించిన అన్నం తినే ఆచారం ఉంది. భోజనం చేసిన తర్వాత సోదరి సోదరుడికి హారతి ఇస్తుంది. దీపపు కుందిలో రెండు జతల వత్తులు వేసి నూనె పోసి వెలిగిస్తుంది. ఆ కుందిని ఒక పళ్ళెంలో పెట్టి అందులో కొన్ని అక్షింతలు రెండు పోకలు ఉంచుతుంది. సోదరుడు తూర్పు ముఖంగా పీట మీద కూర్చున్న తర్వాత సోదరి అతని నుదుట బొట్టు పెట్టి అతనితో అక్షింతలు వేయించుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఆ పళ్ళాన్ని అతని చుట్టూ తిప్పుతుంది. అనంతరం ఒక పోక తీసి అతని తల చుట్టూ కుడి నుంచి ఎడమకు తిప్పి మళ్ళీ పళ్ళెంలో వేస్తుంది. ఆ తర్వాత రెండో పోక తీసుకుని అతని తల చుట్టూ ఈసారి ఎడమనుంచి కుడి వైపు తిప్పి పళ్ళెంలో వేస్తుంది. అప్పుడు అతని కుడి ముంజేతికి ఆమె రాఖీ కడుతుంది. దీనితో రాఖీ కట్టే తంతు పూర్తి అవుతుంది. ఆ తర్వాత అతను ఆమెకు కానుకలు, నూతన వస్త్రాలు, నగదు తన శక్తి కొద్దీ ఇస్తాడు.

వినాయకుడికి ఇద్దరు కొడుకులు. వాళ్ళ పేర్లు, శుభం, లాభం. రక్షాబంధనం రోజు వినాయకుడి సోదరి అతనికి రాఖీ కడుతుంది. అప్పుడు వినాయకుడి పిల్లలు తమకు రాఖీ కట్టే వాళ్ళు లేరుగా అని నొచ్చుకుంటారు. తమకో సోదరి కావాలని నాన్నను అడుగుతారు. సరేనని వినాయకుడు సంతోషి మాతను సృష్టిస్తాడు. ఆ తర్వాత నుంచి వినాయకుడి కొడుకులు కూడా రక్షాబంధనం జరుపుకోవడం మొదలుపెట్టారు.

మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుడికి రాఖీ కట్టినట్టు చెప్పబడుతోంది.
కుంతీ దేవి తన మనవడు అభిమన్యుడికి రాఖీ కట్టి యుద్ధంలో శుభం జరగాలని వేడుకుంటుంది.

ఇక చరిత్రలోకి వస్తే, అలెగ్జాండర్ భారత దేశం మీద దాడి చేసినప్పుడు అతని భార్య ఓ పవిత్ర తాడు (తోరం) ని కైకేయ సామ్రాజ్యాధిపతికి ఓ పవిత్ర తోరం పంపి తన భర్తకు ఏ హానీ జరగకుండా చూడాలని కోరుతుంది. అప్పుడు పురుషోత్తమ మహారాజు ఆ మేరకు అలెగ్జాండర్ కు ఏ హానీ జరగకుండా అండగా ఉంటాడు. అలెగ్జాండర్ ను దెబ్బ తీసే క్షణంలో పురుషోత్తముడి ముంజేతిలో ఉన్న రాఖీ కనిపించి అతనిని విడిచిపెడతాడు.

విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ హిందువులు, ముస్లిముల మధ్య ప్రేమానురాగాల కోసం కృషి చేసారు. మతపరంగా ఆంగ్లేయులు బెంగాల్ విభజనకు పూనుకున్నప్పుడు టాగూర్ ఈ రెండు మతస్తుల మధ్య సత్సంబందాలకోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరి మధ్య ఐకమత్యం కోసం తన వంతు సహకారం అందజేశారు. రక్షా బంధనం ఇందుకు దోహదపడేలా చేసిన ఆయన ఆలోచన అమోఘం. అంతేకాదు రాఖీ మీద ఆయన కవిత కూడా రాశారు.

దక్షిణాసియాలోని వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతుల్లో రక్షాబంధనం జరుపుకుంటారు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలలో ఝులన్ పూర్ణిమ అంటారు. రాధాకృష్ణులకు పూజలు చేస్తారు. అక్కచెల్లెళ్ళు సోదరులకు రాఖీ కడతారు.

మన దేశంలోనే కొన్ని చోట్ల రాఖీ పండుగను నార్లీ పూర్ణిమ గా జరుపుకుంటారు. ముంబైలో ఈ పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకుని సాయంత్రం చౌపాతి సముద్ర తీరానికి వెళ్లి వరుణ దేవుడి తృప్తి కోసం కొబ్బరి కాయలు సమర్పిస్తారు.

పూనాలో హిందువులందరూ బ్యాండు మేళాలతో మూలా, ముత్తా అనే నదుల సంగమ స్థానానికి నాలుగు గుర్రాలు లాగే రథంతో వెళ్లి అక్కడ కొబ్బరికాయలు సమర్పిస్తారు.

జమ్మూలో రాఖీ రోజు గాలిపటాలు ఎగరేస్తారు. ఆ గాలిపటాలు రకరకాల ఆకారాల్లో ఎగురుతూ ఆకాశానికి మరింత అందాన్నిస్తాయి. కొన్నిసార్లయితే నెల రోజుల ముందు నుంచే ఇలా గాలిపటాలు ఎగరేస్తుంటారు.

నేపాల్ లో రక్షాబంధనం శ్రావణ పూర్ణిమ రోజు జరుపుకుంటారు. జనేయు పూర్ణిమ అని వ్యవహరిస్తారు. జనేయు అంటే పవిత్ర తోరం అని అర్ధం. కుటుంబ పెద్దలు, బంధువులు ముంజేతికి ఈ తోరం కడతారు. ఈ రోజున నేపాలీలు ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. దానిని క్వాటి అంటారు. సప్త ధాన్యాలతో తాయారు చేసే సూప్ ని క్వాటి అంటారు. శివుడికి విశేషంగా పూజలు చేస్తారు.

– నర్తన, హైదరాబాద్

Send a Comment

Your email address will not be published.