కంప్యూటర్ తో ఎనిమిది గంటల పని. పెళ్లి, కుటుంబం, ఈ ఎం ఐ, ఇంక్రిమెంట్, భవిష్యత్తు ఇలా అనేక విషయాలపై అదే పనిగా ఆలోచనలతో బతికే బోలెడు మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లలో ఒకరే రవీందర్ సింగ్ . కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆయన జీవితం కూడా ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఒక గొప్ప రచయితగా యువతరంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన రాసే పుస్తకాలకు మంచి డిమాండ్ ఉండడం విశేషం.
ఉత్తర భారత దేశంలో ప్రేమ జంటలు పరస్పరం అందించుకునే కానుకలలో రవీంద్ర సింగ్ రాసే పుస్తకాలు తప్పక ఉండితీరుతాయి. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు.
ప్రేమను ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవలలతో ఆయన ఫోర్బ్స్ ఎడిషన్ పేర్కొన్న టాప్ – 100 భారతీయులలో స్థానం సంపాదించడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. ఇంతకీ ఆయన కంప్యూటర్ రంగంలో నుంచి రచయితగా ఎలా మారేరో చూద్దాం.
కలకత్తాలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన రవీందర్ సింగ్ జీవితంలో ఆశించిన అంశాలు రెండున్నాయి. ఐ టీ ఉద్యోగంలో నెలకు పది వేల రూపాయల జీతం. ఒక వెస్పా స్కూటర్. అవి రెండూ చేతికి అందే సమయం. ఇంతలో ఇంట్లో ఆయనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసారు. పెళ్లి వెబ్ సైట్ తో ఆయనకు ఖుషీ పరిచయమయ్యారు. బలవంతంగా కలిగిన ఆ పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఓ ఫెబ్రవరి 14న నిశ్చితార్ధమ్ తేదీకోసం ఎదురు చూస్తున్న రోజు. తీరా ఖుషీ ఒక ప్రమాదంలో చిక్కుకుని ఆస్పత్రిలోని ఐ సీ యు విభాగంలో చేరి చికిత్స చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆమె కొంచం కొంచంగా మరణిస్తున్న వేళ. చేతిలో నిశ్చితార్ధమ్ ఉంగరం. కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతున్నాయి. ఎదలో ప్రేమ….నెలకొన్న ఆ తరుణంలో ఆయనలో బాధ అనుక్షణం ఎక్కువవుతోంది. ఆ బాధ నుంచి బయట పడటం ఆయనకు గగనమైంది. కానీ కాలానికి కరుణ, దయ వంటివి లేకుండా పోయాయి. ఖుషి చనిపోయింది.
తన ప్రేమ కథ ముగింపు అనేది లేకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఆయన మనసంతా అయోమయం. ఖుషీని తిరిగి తన జీవితంలోకి తీసుకురావడానికి ఆయన ఆరాటపడ్డారు. అప్పుడు ఆయనకు చేరువైంది రచనా శక్తి. మూడు చుక్కలతో అర్ధంతరంగా ముగిసిపోయిన ఆయన ఖుషీతో ప్రేమను ఒక కథగా రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జరిగినవేవీ తాను ఎదురుచూడలేదు.
అతనికి, ఖుషీకి మధ్య జరిగిన ప్రేమను ఐ టూ హాడ్ ఎ లవ్ స్టోరీ అని ఒక నవల రాసారు. ఈ పుస్తకం విడుదలైన నాలుగు నెలల్లో దాదాపు పది వేల పుస్తకాలు అమ్ముడుపోయాయి. దీంతో ఆయన పేరు ముందు బెస్ట్ సెల్లింగ్ రైటర్ అనే ఖ్యాతి చేరింది. పేస్ బుక్ వంటి వాటిలో ఆయన పేరు శరవేగంతో వ్యాపించింది.
యువతరమంతా ఆయన పేరును ఎక్కడ పడితే అక్కడ చెప్పుకున్నారు.
యువకులు తమ ప్రేమ కథలను ఆయనతో పంచుకున్నారు. అంతే కాదు ప్రేమలో విఫలమైతే ఆయనతో చెప్పుకుని సలహాలు అడగసాగారు. ఆయన కూడా వారికి తగిన సూచనలు చేసారు. సలహాలు ఇచ్చారు. ప్రేమను మొదలుపెట్టిన వారు. ప్రేమలో విడిపోయిన వారు ఇలా రకరకాల వారు ఆయనతో మాట్లాడటానికి ముందుకు వచ్చారు. ఆయనను తమ ప్రేమకు ఒక ఆదర్శ వ్యక్తిగా చెప్పుకున్నారు. తన దృష్టికి వచ్చిన ప్రేమ కథలను ఒక క్రమ పద్దతిలో రాసిపెట్టుకుని కాన్ లవ్ హాపెన్ ట్వైస్ అనే రెండో పుస్తకం రాసారు. అది కూడా సూపర్ హిట్టైంది.
ఆరు సంవత్సరాలలో నాలుగు బెస్ట్ సెల్లింగ్ నవలలతో రవీందర్ సింగ్ అగ్రస్థానంలో నిలిచారు.
ప్రేమికులు పంపిన రెండు వేల ప్రేమ అనుభవాలను క్షుణ్ణంగా పరిశీలించి లవ్ స్టోరీస్ దట్ టచ్ డ్ మై హార్ట్ అనే నాలుగో నవల రాసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రచయిత అవుతానని కలలో కూడా అనుకోలేదని, కానీ నేనుగా రచనా లోకంలో నుంచి ఇప్పుడు బయటకు వచ్చెద్దామన్నా నా వల్ల అయ్యేటట్టు లేదు అని అన్నారు.
ఆయన భార్య పేరు ఖుష్బూ.
భార్యను కోల్పోయిన శోకంలో ఉన్నరవీందర్ సింగ్ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడా అని విస్తుపోకండి. ఎందుకంటే ప్రేమ అనేది ఒకసారి మొదలైందంటే అది ఎప్పటికప్పుడు చిగురిస్తూనే ఉంటుందని చెప్తోంది రవీందర్ సింగ్ విజయ సూత్రం.
ఇలా ఉండగా, ఖుష్బూ మాట్లాడుతూ తన మిత్రులు చెప్పగా ఐ టూ హాడ్ అ లవ్ స్టొరీ నవలను చదివానని, చదవగా చదవగా తాను కన్నీళ్ళు ఆపుకోలేక పోయానని, నవల చదివిన శోకం నుంచి బయటకు రాలేకపోయానని, వెంటనే రవీందర్ సింగ్ ను ప్రశంసిస్తూ, ఓదారుస్తూ ఒక ఉత్తరం రాసానని చెప్పారు.
కొన్ని రోజులకు ఆయన ఖుష్బూ కి ఒక ఉత్తరం రాసారు. ఆ తర్వాత వీరి మధ్య చాటింగ్ మొదలైంది. ఉన్నట్లుండి ఒక రోజు తాను పని చేసే సంస్థ ఆమె పని చేసే ఆఫీసుకి దగ్గరలో మారిందని చెప్తూ అక్కడకి వెళ్లి ఆమెను కలిసారు రవీందర్ సింగ్. ఆ తర్వాత వీరి మధ్య తరచూ కలయికలు చోటు చేసుకున్నాయి. ఇలా కలిసినప్పుడు వారి మధ్య ప్రేమ పర్వం మొదలై అది పెళ్లికి దారి తీసింది. ఇద్దరు ఒక్కటయ్యారు.
ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న రవీందర్ సింగ్ ఒక ఉత్తమ ప్రేమ కథ రచయితగా ఖ్యాతి పొందటం నిజంగా విశేషమే.