ప్రేమ లేఖ

ఈ నెల 14 వ తేదీన వాలెంటైన్స్ డే సదర్భంగా ఈ ప్రేమ లేఖను ప్రచురిస్తున్నాం.

నీ కోసం …
—————————-
ప్రియా ….
నాకు ఇద్దరు ప్రేయసులున్నారు.
వారిలో ఒకరు మీ ఇంట్లో ఉన్నారు. మరొకరు నా హృదయంలో ఉన్నారు.
నిన్ను కళ్ళు తెరచి చూస్తున్నాను. ఆమెను కనులు మూసి చూస్తున్నాను.
నేను నిన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే ఆమె నా హృదయంలో పుట్టేసింది.
నువ్వు నవ్వుతున్నట్లే ఆమె కూడా నవ్వుతుంది.
కానీ ఒక్కటి.
నువ్వు కోపగించుకున్నట్టు ఆమె కోపగించుకోదు.
నువ్వు సిసువుగా పుట్టి దేవతవయ్యావు.
ఆమె అలా కాదు. ఆమె పుట్టడమే దేవతగా పుట్టింది.
నువ్వు నాతో మాట్లాడక మౌనంగా ఉన్నావు.
కానీ ఆమె మౌనంగానే నాతో ఉన్నా మాట్లాడుతూనే ఉంటుంది.
ఆమె కళ్ళను చూసే నేర్చుకున్నాను, నీ కళ్ళను తదేకంగా చూడటానికి వస్తున్నాను.
నువ్వు నీ ఇంటిని ఎంత అందంగా ఉంచుకున్నావో అంత అందంగా ఆమె నా హృదయాన్ని ఉంచుకుంది.
నువ్వు మీ ఇంట ఎంత స్వేచ్చగా ఉంటావో ఆమె అంతే స్వేచ్చగా నా హృదయంలో ఉంటుంది.
నీ వద్ద ఒకసారి ప్రేమను చెప్పడం కోసం ఆమెతో వేల సార్లు చెప్పాను. మాట్లాడాను.
నువ్వు నా ప్రేమను స్వీకరించడాన్ని ఆమెతో నేను పంచుకున్నాను.
నీకు ఒక గొలుసు కొన్నా కూడా అది ముందుగా ఆమె కాలికి వేసి అందం చూసిన తర్వాతే నీకు కానుకగా ఇస్తున్నాను.
ఏ రోజుకా రోజు నిన్ను ఏ దుస్తుల్లో చూస్తుంటానో అచ్చంగా ఆ రకం దుస్తులనే ఆమెకూ వేసి మురిసిపోతుంటాను.
మీ ఇద్దరిలో ఎవరు అందమైన వాళ్ళో పోటీ పెడితే నువ్వు ఆమెను గెలవ లేవు.
ఇలా అన్నానని బాధ పడకు. కోపగించుకోకు. అలాగే ఆమె కూడా నిన్ను గెలవలేదు.
నువ్వు ఆమెను చూడాలనుకుంటే చెప్పు.,
హనుమంతుడు తన హృదయాన్ని చీల్చి రాముడికే రాముడి చూపించినట్టు నీకు నిన్నే చూపుతాను.
ఏమిటిదంతా అని నీకు గందరగోళంగా ఉందా? అర్ధం కావడం లేదు కదూ. నన్ను అనుమానించకు.
నువ్వు తొందరపడి నన్ను అపార్ధం చేసుకోకు.
ఇంతకూ ఆమె ఎవరో ఊహించేవా? నువ్వు అంతగా బుర్ర బద్దలు కొట్టుకోవద్దు.
నేనే చెప్తాను. మనసుని శాంతపరచి నేను రాస్తున్నది చదువు. నీకు విషయం అర్ధమవుతుంది.
ఆమె ఎవరో కాదు. ఆమె అచ్చంగా నువ్వంటే నువ్వే. మరెవరో కాదు.
నువ్వు ప్రేమరూపమై నా మదిలో అల్లుకుపోయినదానివి.
అంతా చెప్పానుగా ….ఇక నవ్వు….

ఇట్లు

నీ
ప్రేమదాసుడు

యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.