బంగారు బతుకమ్మ ఉయ్యాల

తెలంగాణా ప్రజల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి. మరో మాటలో చెప్పాలంటే ఇది పూల పండగ. స్త్రీల పండుగ. ఆడబిడ్డలను ఇంటికి ఆహ్వానించి వారికి అపురూప స్థానం కల్పించే గొప్ప పండుగ బతుకమ్మ. సోమవారం (అక్టోబర్ 12వ తేదీ) నాడు ఎంగిలిపూల పేరుతో ఈ పండుగ మొదలైంది. తొమ్మిది రోజులపాటు తెలంగాణా రాష్ట్రమంతటా ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. అంటే ఈ తొమ్మిది రోజులూ తెలంగాణా అంతటా పూల శోభతో వెల్లివిరియడం ఇప్పటికే మొదలయింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో బతుకమ్మ ఉత్సవాలను ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతాయి. బతుకమ్మ చిత్రోత్సవాలు పేరిట పండుగ సంబరాలు నిర్వహిస్తున్నారు.

బతుకమ్మ పండుగ రావడంతోనే తెలంగాణా జిల్లాలన్నీ ముత్తయిదువులా మెరిసిపోతోంది. బతుకమ్మ పాటలతో సాయంకాలాలు ప్రతిధ్వనిస్తాయి. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని, జీవనాధారమైన తల్లి అని చెప్పుకోవాలి. బొడ్డే కుప్ప, కుప్ప పోసిన పువ్వుల తల్లి, పసుపు కుంకుమల తల్లి, బొడ్డున ఉన్న అమ్మ అంటూ రకరకాల పేర్లతో పూజించడం ఆచారం.

తంగేడు, బంతి, గునుగు, గుమ్మడి పూలు, తీగమల్లె, మంకెన పువ్వు, చత్రి పువ్వు, గులాబీ, పోలా బంతి, కనకాంబరాలు, గన్నేరు పూలు, సలిమల్లె, ఇంకా ఈ సేజన్లో దొరికే పువ్వులు పేరుస్తారు. బతుకమ్మ గట్టిగా ఉండటానికి లోపలి వైపు గుమ్మడి, ఆముదం, కాకర, బీర ఆకులను విరిచి ముక్కలు చేసి నింపుకుంటూ అంగుళం చొప్పున పైకి లేపుతారు. తల్లిబతుకమ్మతో పాటు పిల్ల బతుకమ్మ కూడా చేస్తారు. ఎందుకంటె బతుకమ్మను ఒంటరిగా పంపకూడదు. ఈ బతుకమ్మలో ముఖ్యమైన మరో అంశం వాయినం ఇచ్చిపుచ్చుకోవడం. సేకరించిన పూలను పంచుకుంటారు. అలాగే ఫలహారాన్ని పరస్పరం ఒకరికొకరు ఇచ్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు చెరువు దగ్గరకు మలీదముద్దలు తీసుకువెళ్ళి పెడతారు. బతుకమ్మ వేడుకల్లో చిన్నా పెద్దా అందరూ పాల్గొని ఆడి పాడి ఆనందంగా గడుపుతారు. బతుకమ్మ పాటలు పాడుతారు. ఆ పాటలు పాడుతూ చేయి చేయి కలిపి వృత్తాకారంలో తిరుగుతూ ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తారు.

బతుకమ్మ పేరిట ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంఛి మహార్నవమి వరకు మంగళ గౌరిని పూజ చేస్తారు. ఈ పండుగకు ముందు తొమ్మిది రోజులు బొడ్డెమ్మ పండుగ చేస్తారు. ఇది మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఆ వేడుక వర్ష రుతువు సమాప్తిని, శరదృతువు రాకను సూచిస్తుంది. ఈ తొమ్మిది రోజులూ తొమ్మిది రకాల సద్దులు అంటే చక్కర కలిపిన వేరువేరు ధాన్యపు పిండులు కలిపి గౌరీదేవికి నివేదిస్తారు. కనుక దీనిని సద్దుల బతుకమ్మ అని కూడా అంటారు.

తొమ్మిది రోజులూ తొమ్మిది రకాలుగా చేస్తారు.

మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పేరుస్తారు. తులసి ఆకులు, వక్కలు ప్రసాదంగా తీసుకుంటారు. ఈ రోజు బతుకమ్మను తులసి చెట్టు దగ్గర పెడతారు.

రెండవ రోజు అటుకుల బతుకమ్మ …చప్పిడి పప్పు, బెల్లం అటుకులు నివేదిస్తారు.

మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ…ముద్దపప్పు, బెల్లం, పాలు ఇస్తారు.

నాలుగో రోజు నానా బియ్యం, బతుకమ్మ నానేసిన బియ్యం, పాలు, బెల్లం నివేదిస్తారు.

ఐదో రోజు అట్ల బతుకమ్మ ..అట్లు ప్రసాదంగా ఇస్తారు.

ఆరవ రోజు అలిగిన బతుకమ్మ…అర్రేం అంటే సెలవని ఆ రోజున బతుకమ్మ ఆడారు.

ఏడవ రోజు మాసరాకుల, వేపకాయల బతుకమ్మ …సకినాల పిండిని వేపకాయల్లా చేసి నూనెలో వేయిస్తారు.

ఎనిమిదో రోజు వెన్న ముద్దలా బతుకమ్మ ….నువ్వులు, వెన్న ముద్దా, బెల్లం నివేదిస్తారు.

తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ…(పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు). పెరుగన్నం, చిత్రాన్నం, కొబ్బరిపొడి, ఇలా రకరకాల సద్దులతో నైవేద్యం ఇస్తారు అమ్మవారికి.

ఏదేమైనా, ఈ తొమ్మిది రోజులూ తెలంగాణా రాష్ట్రం “బతుకమ్మ”లతో శోభాయమానం అవుతుంది. ఎటు చూచినా పువ్వుల మాయం. కనులకు ఇంపూ సోంపూ.

 

Send a Comment

Your email address will not be published.