బతుకమ్మ సంబరాల ఆనందోత్సాహాల హేల

బతుకమ్మ సంబరాల ఆనందోత్సాహాల హేల

మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అధ్వర్యంలో ఈ నెల 27 వ తేదీన జరిగిన బతుకమ్మ సంబరం చాలా మంది తెలుగు వారు హాజరై ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో జరుపుకోవడం విశేషం. ఈ పండగకు ప్రత్యేకంగా శ్రీ రసమయి బాలకృష్ణ గారు (ప్రస్తుతం తెలంగాణా శాసన సభ సభ్యులు, మరియు జానపద గాయకులు) ముఖ్య అతిధిగా భారత దేశం నుండి వచ్చి, వారు పాడిన జానపద గీతాలు ప్రేక్షకులనందరినీ అలరించాయి. ప్రఖ్యాత సినీ గేయ రచయిత శ్రీ చంద్రబోస్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మెల్బోర్న్ నగరంపై వారు వ్రాసిన గీతం పాడి ఎంతో చక్కగా ప్రేక్షకులందరినీ మంత్ర ముగ్దుల్ని చేసారు. ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వ శాసన మండలి సభ్యులు శ్రీ కర్నే ప్రభాకర్ గారు ఈ ఉత్సవానికి ప్రత్యెక అతిధిగా విచ్చేసారు. మరియు శ్రీ లక్ష్మన్ రెడ్డి గారు అమెరికా నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం విశేషం. విందం సిటీ కౌన్సిల్ మేయర్ శ్రీ Bob Fairclough మరియు మేరీ బైరనాంగ్ మేయర్ శ్రీ Grant Miles కూడా పాల్గొన్నారు.

ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం ఈ పండగ ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణా రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టే ఈ పండగ కార్యక్రమంలో అడపడుచులందరూ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేసారు. ఒక పరాయి గడ్డపై తెలుగువారి సంబరాలు ఇంత ఎత్తున జరగడం – దానికి బహుళ సంస్కృతికి పట్టంగట్టే విక్టోరియా రాష్ట్రం సమూలమైన చేయూతనివ్వడం తెలుగువారిగా మనమందరం గర్వించదగ్గ విషయం. తెలుగువారే కాకుండా స్థానిక సంస్థలు మరియు ఇతర సంస్కృతుల వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రెడ్డి నూకల చెప్పారు.

వచ్చిన వారందరికీ మధ్యాహ్న భోజనం ఉచితంగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమం చివరిలో బతుకమ్మను తెచ్చిన వారికి ప్రత్యెక బహుమతులివ్వడం జరిగింది. మెల్బోర్న్ తెలంగాణా ఫోరం కార్యవర్గం ఆర్ధిక సహాయం చేసిన వారికీ, ప్రేక్షకులకు మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహాయం చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపింది.

 

 

Send a Comment

Your email address will not be published.