బాహుబలికి జాతీయ ఉత్తమ చిత్రం

కంచెకు ప్రాంతీయ భాషా చిత్రం పురస్కారం
—————————————————–
Baahubaliకేంద్రప్రభుత్వం 63వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రకటనలో రెండు తెలుగు చిత్రాలు (ఒకటి బాహుబలి….. మరొకటి కంచె – ప్రాంతీయ భాషల విభాగంలో) ఒకే ఏడాది ‘ఉత్తమం’గా అవార్డులు పొందటం ఒక విశేషం కాగా బాహుబలికి రెండు అవార్డులు దక్కడం మరో విశేషం. బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతోపాటు ఉత్తమ స్పెషెల్ ఎఫెక్ట్స్ అవార్డు కూడా ఈ చిత్రానికి దక్కింది.
అవార్డుల వివరాలు ….
ఉత్తమ చిత్రం; బాహుబలి
ఉత్తమ నటుడు ; అమితాబ్ బచ్చన్ (పీకూ)
ఉత్తమ నటి ; కంగనా రౌనత్ (తనూ వెడ్స్ మనూ రిటర్న్స్)
ఉత్తమ దర్శకుడు ; సంజయ్ లీలా బన్సాలీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం; బజరంగీ భాయిజాన్
ఉత్తమ నృత్య దర్శకుడు ; రెమో డిసౌజా (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ మాటల రచయిత ; జూహి చతుర్వేది (పీకూ)
ఉత్తమ మాటల రచాయిత; హిమాన్షు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తర బాల నటుడు ; గౌరవ్ మేనన్
ఉత్తమ సహాయ నటి ; సన్వీ అజ్మీ
ఉత్తమ బాలల చిత్రం ; దురంతో
ఉత్తమ తెలుగు చిత్రం ; కంచె (ప్రాంతీయ భాషల విభాగంలో)
ఉత్తమ స్పెషెల్ ఎఫెక్ట్స్ ; బాహుబలి
……………………………………………………………………….
63వ జాతీయ చలన చిత్ర అవార్డుల కమిటీ అధిపతి, నటుడు, నిర్మాత సతీష్ కౌశిక్ మాట్లాడుతూ భారతీయ చలన చిత్రాలలో బాహుబలి అత్యుత్తమ చిత్రమనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. దేశవ్యాప్తంగా వివిధ భాషలలో అత్యుత్తమ చిత్రాలు లేకపోవచ్చు కానీ బాహుబలి ఆ అత్యుత్తమ చిత్రాలను మించి ఓ మెట్టు పైనే ఉందని అన్నారు. దర్శకుల విషయానికి వచ్చేసరికి సంజయ్ లీలా బన్సాలి, రాజమౌళిలలో ఎవరు ఉత్తమ దర్శకులో అని నిర్ణయించడంలో చాలా సేపు ఆలోచించవలసి వచ్చిందని, బాహుబలి, బాజీరావు మస్తానీ రెండూ రెండు చిత్రాలని, అయితే బాజీరావు మస్తానీ దర్శకులు బన్సాలి ఓ మెట్టు పైన నిలిచారని, బన్సాలి చిత్రం రాజ్ మౌళి చిత్రంతో పోలిస్తే పైనే ఉందని అనుకుని బన్సాలి కి ఉత్తమ దర్శకులు అవార్డు ఇవ్వడం జరిగినట్టు ఆయన చెప్పారు. అలాగని బాహుబలిని చిన్నచూపు చూడటానికి వీలులేదని, హాలీవుడ్ కి సమానంగా రాజ్ మౌళి దర్శకత్వంలోని బాహుబలి చిత్రం నిలిచిందని, అయినప్పటికీ బాహుబలిని బాజీరావు మస్తానీ అధిగమించినట్టు చెప్పారు.

ఇలా ఉండగా రాజ్ మౌళి మాట్లాడుతూ, “ఈ అవార్డు మాకు ఓ గొప్ప గుర్తింపు. బాహుబలి – 2ని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ఈ అవార్డు ప్రోత్సహించింది. అవార్డు కమిటీకి మా ధన్యవాదాలు. మనస్పూర్తిగా మా యూనిట్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాహుబలి నిర్మాతల కృషిని జ్యూరి కూడా గుర్తించడం ముదావహం. సాంకేతిక నిపుణులు శ్రీనివాస్ మోహన్ పర్యవేక్షణలో పని చేసిన విజువల్ ఎఫెక్ట్స్ బృందంలోని ప్రతి ఒక్కరికీ సంతోషకరమే” అన్నారు.

“కంచె” విషయానికి వస్తే దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ తమ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ అవార్డు తనను వెన్ను తట్టి ప్రోత్సహించినట్టు భావిస్తున్నానని చెప్పారు. ఓ ముఖ్య కారణం కోసం పోరాడిన ప్రపంచ యుద్ధ వెటరన్స్ కి ఈ అవార్డుని అంకితం చేస్తున్నాను అని తెలిపారు. గమ్యం నుంచి వేదం, వేదం నుంచి కంచె వరకు తానూ నిజమైన వ్యక్తుల కథలనే చిత్రీకరించానని క్రిష్ తెలిపారు.

నిజమైన వ్యక్తుల జీవితాలను వెండితెరపైకి తీసుకొచ్చేటప్పుడు ప్రతిఫలం ఆశిస్తానని, కనుక తానూ ఎప్పుడూ ఈ కథలను వాణిజ్యపరంగా చిత్రీకరిస్తానని అన్నారు. తన చిత్రాలలో పాటలు, యాక్షన్, ఇతర కమర్షియల్ అంశాలూ ఉంటాయని, కానీ అవి తగు పాళ్ళల్లో ఉంటాయని అన్నారు.

అవార్డులు గెలుచుకున్న బాహుబలి, కంచె చిత్రాల యూనిట్ ని కేంద్రమంత్రి ఎం వెంకయ్య నాయుడు అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా బాహుబలి, కంచె చిత్రాలకు అవార్డులు లభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయా చిత్ర బృందాలకు అభినందనలు తెలిపారు.

Send a Comment

Your email address will not be published.