బిగి విడువని తెలుగు అక్షరం

New Image1
New Image4
New Image7

మెచ్చుకున్నా నొచ్చుకున్నా అక్షరం ఎప్పుడూ మన పక్షమే. కావ్యానికి వాక్యాలు, వాక్యానికి పదాలు, పదాలకి అక్షరాలు – సముద్రంలో ఒక నదీ ప్రవాహం కలిసిపోయేంత సహజంగా ఉంటాయి. ‘నా అక్షరాలు ముత్యాల కోవలు’, ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అని మన భాష మీదే కాదు మన అక్షరాలపై కూడా మన కవులు ఎంతో అందంగా కవితలల్లేరు.

ఆ అందం, చందం ఒక్క తెలుగు వర్ణమాలకే ఉంది. చాలా భాషల లిపులన్నీ రేఖాత్మకాలు. ప్రధానంగా కొన్ని (సరళ) రేఖలు కలుపుకుంటూ ఆ అక్షరాలు రాస్తారు. కానీ తెలుగు లిపిది వర్తులాకృతి. ‘అ’ మొదలు ‘క్ష’ దాకా ఏ అక్షరమైనా వృత్తంలో ఇముడుతుంది. త్రికోణాలు, చతుష్కోణాల కన్న వర్తులాకృతులు కనువిందుగా ఉంటాయని వేరే చెప్పాలా? తెలుగు అజంత (అచ్+అంత) భాష అని భాషావేత్తలు సాధారణంగా చెప్పే మాట. అంటే తెలుగు మాటల చివర అచ్చులుంటాయి. ఇందువల్ల భాష వినసొంపుగా ఉంటుంది. అందుకే మన భాషని ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని నికొలొకాంటి అనే ఇటలీ యాత్రికుడు వర్ణించాడు.

ఈ వినసొంపైన లక్షణమే, కర్ణాటక సంగీత సంప్రదాయంలో తెలుగు కీర్తనల్ని అగ్రస్థానంలో నిల్పింది. ‘సుందర తెలుంగు’ అని సుబ్రహ్మణ్య భారతి వంటి తమిళ మహాకవుల మెప్పు పొందింది. పరాయి భాషలంటే మొహం చిట్లించే తమిళులు త్యాగరాజు కీర్తనల్ని ఆస్వాదించటానికి ముఖ్య కారణం మన భాషలోని నాద మాధుర్యమే.

పర భాషా సంస్కృతులతో సహజీవనం చేస్తున్న మనం తర తరాల మన తెలుగును తరువాతి తరం వారికి అందివ్వడం మహా భాగ్యం. భావితరానికి ఇదొక పూర్వ జన్మ సుకృతం. అమ్మ భాషని అమర భాషగా నిలపడానికి చేస్తున్న ఒక యజ్ఞం.

New Image3
New Image2

ఆస్ట్రేలియాలోని ఇంచుమించు అన్ని ప్రధాన నగరాల్లో తెలుగు బడులు నడుపుతున్న సంగతి తెలిసిందే.  అయితే గత ఆదివారం అడిలైడ్ నగరంలోని తెలుగు సంఘం అంగరంగ వైభవంగా మొదటిసారిగా షుమారు 45 మంది విద్యార్ధులతో  తెలుగు బడిని ప్రారంభించి మన చిన్నారుల కళ్ళల్లో అక్షర కాంతిని నింపారు. తెలుగు వెలుగుల జిలుగును పరవశింప జేసారు.  అమ్మ భాషకు అద్దం పట్టారు. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పంచి పెట్టారు. అక్షరం మన పక్షమే అని మరోసారి నిరూపించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డానా వార్ట్లీ  – తోరెన్స్ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రీమియర్ మరియు విద్యా శాఖా మంత్రి తరఫున పాల్గొన్నారు.

లోక్లీ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫియన్ లవ్, ఎతినిక్ స్కూల్ అసోసియేషన్ ఎక్స్ క్యుటివ్ ఆఫీసర్  డేరిల్ బుచానన్  కూడా పాల్గొన్నారు.

తెలుగు బడి యాజమాన్యంలో షుమారు 20 ఏళ్ల అనుభవంగల వారు కలిసి ప్రారంభించారని మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని సౌత్ ఆస్ట్రేలియాలో ప్రారంభించిన సందర్భంగా పిల్లలందరికీ ఉచితంగా ఆరు నెలలు విద్యా బోధనా సౌకర్యాలు కల్పిస్తామని తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ శీలం గారు చెప్పారు.

ఈ కార్యక్రమానికి తెలుగు సంఘంలోని పెద్దలు, ఇతర కార్యవర్గ సభ్యులు వచ్చి ఆశీర్వాద వచనాలు అందజేసారు.

మన తెలుగు బడి కార్యవర్గం:

సత్యనారాయణ శీలం: చైర్మన్ (తెలుగు సంఘం అధ్యక్షులు)

జ్యోతి తాళ్లూరి: ప్రిన్సిపాల్

శ్రీ వరూధిని దైత: వైస్ – ప్రిన్సిపాల్

వాణిశ్రీ వకచర్ల: వైస్ – ప్రిన్సిపాల్

మరో 15 మంది తలిదండ్రులు స్వచ్చంద కార్యకర్తలుగా ముందుకొచ్చి ఈ తెలుగుబడి నిర్వహణలో తోడ్పడతామని హామీ ఇచ్చినట్లు శ్రీ సత్య గారు తెలిపారు.

Address: Lockleys Primary School, 29 ELSTON Street, Brooklyn Park, South Australia, 5032

ప్రతీ ఆదివారం మధ్యహ్నం 2 – 3:00 గంటల మధ్య