బిల్లు పరిస్థితి ఏమిటి?

తెలంగాణ బిల్లు మీద చర్చకు గురువారంతో గడువు తీరిపోయింది. ఈ బిల్లును కేంద్రానికి, అంటే రాష్ట్రపతికి తిప్పి పంపించినట్టు శాసనసభ కార్యాలయం పేర్కొంది. అయితే బిల్లును శాసనసభ తిరస్కరించినట్టు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  ఈ బిల్లు మీద చర్చను పొడిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది కానీ, కేంద్రం నుంచి అటువంటి అనుమతేదీ లభించలేదు. తమకే విజయం లభించిందంటూ సమైక్యాంధ్ర నాయకులు ఒక పక్క, తెలంగాణా నాయకులు మరో పక్క ప్రకటించుకున్నారు. ఈ బిల్లును శాసనసభ మూజువాణీ ఓటుతో  తిరస్కరించినందు వల్ల ఇక దీని మీద పార్లమెంట్ చర్చించడానికి వీల్లేదని సమైక్యాంధ్ర నాయకులు స్పష్టం చేశారు. అయితే, ఈ బిల్లును తిరస్కరిస్తూ ముఖ్యమంత్రి నోటీసు ఇచ్చి ఆమోదం పొందినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని తెలంగాణా నాయకులు తెలిపారు. ఈ బిల్లును శాసనసభ సభ్యుల అభిప్రాయం కోసం మాత్రమే పంపించారని, దీనికి సభ ఆమోదం అవసరం లేదని వారు వాదిస్తున్నారు.

కాగా, ఈ బిల్లుపై చర్చ ముగిసిందనీ, దీన్నిసభ్యుల అభిప్రాయాలతో పాటు రాష్ట్రపతికి తిప్పి పంపడం జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. అంతేకాక, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ అయిన దిగ్విజయ్ సింగ్ కూడా తెలంగాణా ఏర్పాటు విషయంలో మరో మైలురాయిని అధిగమించినట్టు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదింప చేసినప్పటికీ దాని ప్రభావం తెలంగాణా ఏర్పాటు మీద ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు.

మరో  పోరాటానికి కిరణ్ రెడీ

తెలంగాణా బిల్లును వ్యతిరేకిస్తూ శాసన సభ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రం తిరస్కరించిన పక్షంలో దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.  తెలంగాణా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడానికి రెండు రోజుల ముందు న్యాయస్థానానికి వెళ్లాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఈ బిల్లు పార్లమెంట్ దాకా వెళ్ళకుండా న్యాయస్థానం స్టే ఇచ్చే అవకాశం ఉందని ఆయన  ఆలోచన చేస్తున్నారు. పార్లమెంట్ గనుక ఈ బిల్లును ఆమోదించిందంటే ఆ తరువాత ఎవరూ ఏమీ చేయలేరని ఆయనకు తెలుసు. బిల్లును ఆపాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప మార్గం లేదని ఆయన తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.