బుద్ధం శరణం గచ్చామి

అష్ట ఐశ్వర్యాలూ ఉండి కూడా కొన్ని విషాదకర సన్నివేశాలు చూసి తెగ బాధపడి, మధన పడి పరివర్తనం చెంది ఆయుధాలు విసర్జించి, సంసార బంధాలను తెంపుకుని వెళ్ళిపోయిన సిద్ధార్ధుడు దీక్షతో సత్యాన్వేషణ చేస్తూ చివరకు బీహార్ లోని బుద్ధ గయలో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన  బుద్ధుడు తత్వవేత్త కాదు. అలాగని వేదాంతీ కాదు. ఒక చక్కని ఆద్యాత్మిక మార్గాన్ని తెలుసుకుని మనకు చెప్పిన మహాత్ముడు.

మానవాళిని శోక సాగరం నుంచి, పరితాపం నుంచి ఉద్ధరించేందుకు భౌతిక రూపం దాల్చిన జ్ఞానమే బుద్ధుడు.

ఆయన ప్రేమ, శాంతి, అహింసలకు ప్రతిరూపంగా నిలిచాడు. బుద్ధుడు పొందిన చైతన్యం గురించి ఒక పవిత్ర బౌద్ధ గ్రంధంలో “నిర్వచించరానిది.. మనసుకు ప్రశాంతతను చేకూర్చేది.. తర్కం ద్వారా అర్ధం కానిది. ఉత్కృష్ట మైనది. పరమానందకరమైనది. వివేకుల ఆత్మల్లో  వికసించే”దిగా  అభివర్ణించారు.

జీవితాన్ని రెండువిపరీతమైన వైఖరులకు మధ్యస్తంగా అంటే ఇటు గృహస్తునిగా సుఖలోలతకు, అటు సాధకునిగా నియమ నిష్టలకు మధ్యే మార్గంగా సాగించాలని బుద్ధుడు ప్రబోధించాడు. అదే బౌద్ధ మతంలోని అష్టాంగా మార్గం. సమ్యక్ దృష్టి. సమ్యక్ సంకల్పం, సమ్యగ్ వచనం, సమ్యక్ కర్మ, సమ్యగ్ జీవిక, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి.

బుద్ధుడు 45 ఏళ్ళకు పైగా మధ్య భారతంలోని ప్రదేశాలలో అనేక ప్రాంతాలు తిరిగి ప్రచారం సాగించారు.

ఆయన గంభీరమైన వ్యక్తిత్వం, త్యాగశీలమ్, ఇంద్రియాలకు అతీతమైన దృక్పధం, భాష్య నైపుణ్యం ఆయనను అనేకుల ఆదరాభిమానాలకు పాత్రున్ని చేసాయి.

సుప్రియ అనే ఒక గురువు బుద్దున్ని విమర్శిస్తున్నారని, నిందిస్తున్నారని ఒక శిష్యుడు బాధ పడి బుద్ధుడి వద్దకు వెళ్లి తాను విన్న మాటలు చెప్పి ఆవేదన చెందాడు. అప్పుడు బుద్ధుడు “ఒక్కోసారి కొందరు ఏ కారణం లేకుండా ఇలా నానా మాటలు అంటారు. అది సర్వసహజం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు విమర్శలకూ, దూషణలకు గురి అవుతుంటారు. కడకు రారాజులు కూడా విమర్శలకు గురి కాక తప్పదు. అంత మాత్రాన నన్ను ఎవరో ఏదో అన్నారని నేను కూడా నోరు పారేసుకుంటే ఇక నాకూ వారికి తేడా ఏముంటుంది” అని చిన్న నవ్వు నవ్వాడు.

దేవదత్తుడు అనే అతను బుద్దుడి బంధువర్గంలోని వ్యక్తే. అతను గొప్ప వక్త. బౌద్ధం స్వీకరించినా అతనిలో ఏదో కీర్తి పొందేయ్యాలని ఎప్పుడూ ఆరాట పడుతుండేవాడు. బౌద్ధ సంఘానికి అధినేత అయిపోవాలని అనుకున్నాడు. బుద్ధుడిని వ్యతిరేకించి ఆయనను హత మార్చడానికి ప్రయత్నించాడు. కొందరిని పంపించి బుద్ధుడిని చంపమని ఉసి కొల్పాడు. కానీ వారు బుద్దుడి దివ్య తేజస్సు చూసి తాము తమ పని మానుకుని ఆయన సత్యంపై చేసిన ప్రసంగం విని మంత్రముగ్ధులై ఆయనకు శిష్యులైపోయారు. విషయం తెలుసుకున్న దేవదత్తుడు ఇక లాభం లేదనుకుని ఒక పర్వతం పై నుంచి బుద్ధుడి మీదకు ఒక బండ రాయి దొర్లించాడు.  ఆ సంఘటనలో బుద్ధుడికి అతి చిన్న గాయం మాత్రమే అయ్యింది.

బుద్ధుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆయన మనలను ఆచరించ మంటాడు గానీ తాను మాత్రం మనకు చెప్పినవేవీ ఆచరించడని దేవదత్తుడు ఒక మారు ఆయనపై నిందారోపణలు చేస్తాడు. అంతే కాదు, బుద్ధుడి శిష్యులలో కొందరిని  తన వైపునకు తిప్పుకుని వారితోను మాటలు అనిపించాడు. అయితే త్వరలోనే ఆ శిష్యులు తమ పొరపాటు తెలుసుకుని బుద్ధుడి కాళ్ళపై క్షమించమని పడతారు.

ఒకసారి ఒకడు బుద్ధుడి వద్దకు వచ్చి బాహుక నదిలో స్నానం చేస్తే చేసిన అన్ని పాపాలు నశిస్తాయటగా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు బుద్ధుడు “అవివేకినీ, బుద్ధి లేని వాడినీ పాపాల నుంచి ఏ నదీ పవిత్రం చెయ్య లేదు. ప్రతి ఒక్కరూ తమలో తాము విచారణ చేసుకుని అందులో మునిగి స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయి. అంతే తప్ప ఒక నదిలో మునిగి స్నానం చేసినంత మాత్రాన పాపాలన్నీ తొలగి పోతాయనుకోవడం అజ్ఞానం. ఒక నది గొప్పది. మరో నది కాదు వంటి వాదనలన్నీ సరి కాదు. అన్ని నదులూ సమానమే” అని అతని సందేహాని తీర్చాడు బుద్ధుడు.

సర్వ సంసార బాధలకు కోరికలే కారణం కనుక ఇంద్రియ నిగ్రహం అవసరమని పడే పడే చెప్పే బుద్ధుడు గురువంటే శరీరం కాదని, గురు వచనమే గురువని అన్నాడు.

బుద్ధుడి తుది ఘడియల్లో ఒక శిష్యుడు ఏడ్చినప్పుడు జననంతో పాటే మరణ బీజమూ పుడుతుందని, పుట్టిన ప్రతిదీ గిట్టక మానదని, కాబట్టి మృత్యువు గురించి బాధపడటం మాని నిజాయితీగా సత్య సాధన చెయ్యమని బుద్ధుడు సూచిస్తాడు.

బుద్ధుడి భావం, భాష, సామాన్యులకు సైతం అర్ధంయ్యేవే. ఆయన మాటలు నిత్య జీవిత సత్యాలకు సంబంధించినవే.

సంఘంలో అందరూ సమానులే అన్నది బుద్ధుడి అభిప్రాయమ.

బుద్ధం  శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.