బుర్రిపాలెంకు "ప్రిన్స్" కళ

సూపర్ స్టార్ మహేష్ బాబు స్వస్థలం బుర్రిపాలెంకు త్వరలోనే అన్ని అందాలు రాబోతున్నాయి.
మహేష్ బాబుతో తమ గ్రామాన్ని ఎలాగైనా దత్తత చేయించుకునేలా చేయాలని ఆ పల్లె ప్రజలు తహతహలాడుతున్నారు. అందువల్ల తమ గ్రామానికి బోలెడంత కళ వస్తుందన్నది వాళ్ళ ఆశ.

ఈమధ్యే విడుదలై విజయవంతంగా ఆడుతున్న మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంలో ఓ వెనుకబడిన పల్లెను దత్తత తీసుకోవడం ప్రధానాంశంగా సాగింది.

అయితే ఇప్పుడు బుర్రిపాలెం విషయానికి వద్దాం….

బుర్రిపాలెం గుంటూరు జిల్లా తెనాలికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పల్లె అభివృద్ధి కోసం అలనాటి సూపర్ స్టార్ కృష్ణ, వాళ్ళ అమ్మ నాగరత్నమ్మ ఎంతో కృషి చేసారు. మహేష్ బాబు కుటుంబం ఆ ఊళ్ళో ఒక స్కూలు, ఆలయం, ఓ మ్యారేజ్ హాల్, ఓ బీ ఈ డీ కాలేజ్ ఏర్పాటు చేశారు. బహుశా మహేష్ బాబు ఈ బుర్రిపాలెం పల్లెను దత్తత తీసుకునే అవకాశం ఉందని సినీ, రాజకీయ వర్గాల మాట.

మహేష్ బాబు సోదరి, ఏం పీ గల్లా జయదేవ్ పద్మావతి కూడా త్వరలోనే తమ తల్లి గారి గ్రామమైన కంచర్లపాలెం ను దత్తత తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ పల్లె బుర్రిపాలెంకు ఆనుకునే ఉంది.

శ్రీమంతుడు చిత్రం విజయవంతం అయిన నేపధ్యంలో మహేష్ బాబు మాట్లాడుతూ బుర్రిపాలెం పల్లెను దత్తత తీసుకునే అవకాశం ఉన్నట్టు సూచనప్రాయంగా చెప్పడం గమనార్హం.

మహేష్ బాబు నాయనమ్మ నాగరత్నమ్మ కూడా ఈ పల్లె అభివృద్ధి పనుల్లో ఎన్నో చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, గ్రామ స్థాయి రాజకీయాలలోనూ ఆమె చురుకైన పాత్ర పోషించారు.

మహేష్ బాబు తండ్రి నటుడు అయిన కృష్ణ ఈ పల్లెను తరచూ సందర్శించడం తెలిసిందే. అయితే నాగరత్నమ్మ మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు దాదాపు దశాబ్ద కాలం నుంచి ఈ పల్లెకు కాస్తంత ఎడంగానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ బుర్రిపాలెం ప్రజలు మహేష్ బాబు మీద కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఆయన దాట్థత తీసుకుంటే తమ పల్లెకు ఎక్కడ లేని వెలుగూ వస్తుందని వారి ఆశ.

Send a Comment

Your email address will not be published.