బోనాలతో సందడే సందడి

Bonaluఆషాడం రావడంతోనే భాగ్యనగరమంతా సందడే సందడి….బోనాలతో నగరమంతా కళకళలాడుతోంది. హైద్రాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలలో లోని అమ్మవారి ఆలయాలు జాతరలతో మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారి సమక్షంలో మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ.

ప్రభుత్వ యంత్రరంగం భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సౌకర్యాలు కల్పించాయి. ఇందుకోసం ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది.

ఇంతకీ ఈ బోనాల సంప్రదాయం ఏ నాటిదో చూద్దాం….

ఒకప్పుడు మూసీ నది వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలి నగర ప్రజలు నానాయాతన పడ్డారు. అయితే అప్పటి హైదరాబాద్ రాష్ట్ర మహారాజా కిషన్ ప్రసాద్ చేసిన సూచన మేరకు నిజాం మీరు మహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజా దగ్గర్లో ఉన్న ఓ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతేకాదు. చార్మినార్ వద్దకు చేరిన వరద నీటిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ పూజలతోను, సమర్పణతోను అమ్మవారు శాంతించడంతో నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. అప్పుడు నవాబులు అమ్మయ్య అనుకుని బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఆరోజు నుంచి నగరంలో బోనాలు క్రమంతప్పక జరుగుతూ వస్తున్నాయి.

ఎప్పటిలాగే, ఈసారికూడా ముందుగా గోల్కొండ జగదాంబ ఆలయంలో ఈ బోనాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసంలో ప్రతి ఆది, గురువారాల్లో ఖిల్లా వద్ద జాతర ఘనంగా నిర్వహించడం అనేది ఓ సంప్రదాయం. ఈ విధంగా వారానికి రెండుసార్లు చొప్పున తొమ్మిదిసార్లు జాతర జరిగి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఓ ఆనవాయితీ.

ఈసారి ఆషాఢమాసం తొలి గురువారం అయినా జూలై ఏడో తేదీన గోల్కొండలో ఈ బోనాలు ప్రారంభమయ్యాయి. రెండో ఆదివారం (జూలై 17)న ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలోనూ, 24 న చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాలలోను, జూలై 31 న లాల్ దర్వాజా మాతేశ్వరి ఆలయంలో ప్రధానంగా జాతర జరుగుతుంది.

అయినా బోనం అంటే ఏమిటో తెలుసా….

గ్రామదేవతలకు సమర్పించే మొక్కుబడి. దీనినే నైవేద్యం అని కూడా అనుకోవచ్చు. బోనం అనేది వికృతి మాట. మరి ప్రకృతి మాట ఏమిటో చెప్పమంటారా….భోజనం. అమ్మవారికి సమర్పించే బోనం తయారీ ఎంతో విశిష్టమైనది. మట్టికుండ, రాగి, ఇత్తడి లేదా స్టీలు పాత్రలో బోనం తయారు చేస్తారు. ఎవరి శక్తి కోద్దీవారు ఈ ఈ పాత్రలకు సున్నం, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. అన్నం. పెరుగు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యం ఆపాత్రలో ఉంచి దానిపై వేపమండలు వేసి దానిపై మరో చెంబు పెడతారు. అందులో చింతపండు, నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు కలుపుతారు. ఆ తర్వాత దాని మీద ఒక మూత పెడతారు. ఆ మూత మీద ఓ దీపం వెలిగిస్తారు. ముఖానికి పసుపు పూసుకుని అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న బోనాన్ని తల మీద పెట్టుకుని ఊరేగింపుగా వస్తారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారికి ఈ బోనం సమర్పిస్తారు.

మరి కొందరు భక్తులు ఈ సమయంలో తమ శక్తి మేరకు మొక్కుబడులు చెల్లించుకుంటారు.

బోనాలతో పోతరాజుల నిర్వహించే విన్యాసం ఓ ఘట్టం. జంతుబలులు నిషేధం వల్ల పోతరాజుల సొరకాయలు, గుమ్మడికాయలు పగలగొడతారు. అమ్మవారికి దిష్టి తీస్తారు.

ఇక మరో ముఖ్యమైన ఘట్టం – రంగం. రంగం చెప్పడం అంటే భవిష్యవాణిని వినిపించడం. రాబోయే కాలం ఎలా ఉంటుంది అనేది ఓ మహిళా ఈ రంగంలో చెబుతుంది. ఓ కుటుంబానికి చెందిన ఒక పెళ్లి కాని ఆమె రంగం చెబుతుంది. ఈ రంగం సికిందరాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతుంది. అప్పుడుఇసక వేస్తే రాలనంత జనం చేరుతారు. గర్భగుడిలో ఉన్న అమ్మవారిని చూస్తూ ఆ అమ్మవారి అంశను తనలోకి తీసుకుని ఓ పచ్చి కుండా మీద పాదం మోపి భక్తి పూనకంతో ఊగుతూ భవిష్యత్తుని ఆమె వివరించడంతో ఈ బోనాలు ముగుస్తాయి.

Send a Comment

Your email address will not be published.