భగవంతుని సన్నిధానంలో బంగారు బతుకమ్మ

 

MBPhoto01

MBphoto02

పల్లె వాతావరణం, సంస్కృతీ సంప్రదాయాలు, మన పండగలు – ఎన్ని రకాలుగా వర్ణించినా అన్నీ “మనది” అనే హృదయాన్ని హత్తుకుపోయే భావాన్ని కలుగాజేసేవే. అనాదిగా భారతీయ నాగరికత పల్లె జీవనం చుట్టూ పెనవేసుకుపోయింది గనుక మన పండుగలు పల్లె వాతావరణంలో జరిగితే అదో క్రొత్త రకం శోభనిస్తుంది, కొత్తదనం తొణికిసలాడుతుంది, పల్లె పులకరిస్తుంది, జన్మ భూమి ప్రేమతో తడిసి ముద్దయిపోతుంది, మనదన్న సాంప్రదాయం పరవళ్ళు త్రొక్కుతుంది, మన ఊరు పొలికేక పెడుతుంది, చుట్టూ వున్న కొండలు ప్రతిధ్వనిస్తాయి, అడవిలోని పక్షులు కూని రాగాలు తీస్తాయి.

ఊరి పొలిమేరల్లో ఒక గుడి వుంటే ఆ ఊరికి అందం. గుడిగంట జేగంటై బతుకమ్మ పాటపాడితే నట్టింట ఆడపడుచు నడయాడి నృత్యం చేసినట్లే. ఊరందరికీ లక్ష్మీ దేవి తాండవం చేసినట్లే కనబడుతుంది.

ఇదే తరహాలో మెల్బోర్న్ బతుకమ్మ టీం ముగ్దమనోహరమైన మురుగన్ గుడి వద్ద ఊరిని మరిపించే వాతావరణాన్ని స్పురణకు తెచ్చి బంగారు బతుకమ్మ పండగను ఈ నెల 23వ తేదీన ఘనంగా జరుపుకున్నారు. మెల్బోర్న్ లో నివసిస్తున్న తెలంగాణా వాదులే కాకుండా చాలామంది తెలుగువాళ్ళు ఈ కార్యక్రమానికి విచ్చేసి గుడి ముందు బతుకమ్మ పండగను గుడిలోని దేవుడ్ని దర్శించి పునీతులయ్యారు. బతుకమ్మ పాటలతో ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. వచ్చినవారందరికీ ఇంటి వంట రుచులతో కూడిన మంచి వంటకాలు పంచిపెట్టారు.

ఎంతో మంది స్థానిక భారతీయ సంఘాల సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయ సహకారాలందించారని వారందరికీ నిర్వాహక సభ్యులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆర్ధిక సహాయం అందించిన సంస్థలకు మరియు స్వచ్చంద సేవకులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Send a Comment

Your email address will not be published.