భయానికే భయం - జాహ్నవి

భారతావని చరిత్రలో సరిక్రొత్త అధ్యాయం. ఆడపడుచుల అభ్యుదయమే ధ్యేయం. అతిపిన్న వయసులో వినూత్న పధకం. సప్త శిఖరాల ఆరోహణం. భయానికే భయం. నూతనాధ్యాయంలో తరుణీ తరుణం. జాతిపిత అడుగుజాడల్లో శాంతి సమరం. చిన్నారులెందరికో స్పూర్తిదాయకం.

జాహ్నవి – పేరులోనే వుంది గంగ. ఇదొక అనంత ప్రవాహం. వచ్చే రెండేళ్లలో ప్రపంచంలోని 7 ఖండాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి చరిత్ర సృష్టించాలన్న ధ్యేయంతో గత రెండేళ్లలో 3 ఖండాలలోని శిఖరాలను అధిరోహించడం జరిగింది. ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో (5896 మీటర్లు) పర్వతం 2014 గాంధీ జయంతి రోజున ఎక్కి శుభారంభం చేయడం జరిగింది. యూరోప్ లోని మౌంట్ ఎల్బృస్ (5642 మీటర్లు) పర్వతం 2015 జూలై 31 వ తేదీన, మరియు ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసిస్కో శిఖరం (2228 మీటర్లు) 2015 డిసంబరు 11 వ తేదీన ఎక్కి మూడు శిఖరాలు పూర్తి చేసింది జాహ్నవి. ఈ సంవత్సరం సౌత్ అమెరికాలోని అకాంక్ గువ (6961 మీటర్లు) మరియు మౌంట్ ఎవరెస్ట్ (8850 మీటర్లు) పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు దూసుకుపోతున్నది. పదహారేళ్ళ ప్రాయంలో ప్రపంచంలోని 7 ఖండాలలోని ఎత్తైన శిఖరాలు అధిరోహించి చరిత్రపుటల్లో కెక్కాలన్న అకుంటిత దీక్ష. సువర్ణాక్షరాలలో చరిత్ర పుటలు వ్రాయాలన్న ఆకాంక్ష.

గతనెల ఆస్ట్రేలియా వచ్చినపుడు చిరంజీవి జాహ్నవి తెలుగుమల్లితో ముచ్చటించడం జరిగింది.

సిడ్నీ తెలుగు అసోసియేషన్ తెలుగువాణి రేడియోలో శ్రీ సారధి మోటమర్రి మరియు శ్రీ మధుసూదన్ బైరెడ్డి గార్లు ప్రత్యక్ష ముఖాముఖీ కార్యక్రమం కూడా నిర్వహించారు. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారు ఒక సన్మాన సభ కూడా నిర్వహించడం జరిగింది. ఈ సభలో చాలా మంది సిడ్నీ తెలుగు అసోసియేషన్ సభ్యులు చిరంజీవి జాహ్నవి ప్రతిభాపాటవాలకు ముగ్దులై కొంత సొమ్మును అందజేయటం కూడా జరిగింది. అందులోని కొన్ని ముఖ్యాంశాలు.

స్వతహాగా పర్వతరోహకుడైన తండ్రి శ్రీ కృష్ణారావు గారు తాను (జాహ్నవి) 10 నెలల ప్రాయంనుండే తనతో పాటుగా ఎత్తైన పర్వతాలకు తీసుకొని వెళ్ళేవారు. శ్రీ కృష్ణారావు గారి మాటల్లో భారత దేశంలో ఆడపిల్ల అంటే ఒక చిన్నచూపు భావం వుండడం – తనకు ఆడపిల్ల కలిగితే ప్రపంచంలో ఆ భావాన్ని మార్చగల వ్యక్తిగా మలచాలన్న తలంపుతో జాహ్నవికి చిన్నప్పటినుండే తగిన శిక్షణనిచ్చి పదేళ్ళ వయసు వచ్చే సరికి భారతదేశంలోని 2 అతి కష్టమైన మరియు ఎత్తైన పర్వత శ్రేణులు, 5 జాతీయ శ్రేణులు మరియు 25 స్థానిక పర్వతాలు అధిరోహించడం జరిగింది. జాహ్నవికి పర్వతారోహణమే కాకుండా పారా సెయిలింగ్, రాఫ్టింగ్, రాపెల్లింగ్ లో కూడా అభిరుచి వుంది. అందరి పిల్లల లాగే మన సాంప్రదాయపు నృత్యం భరతనాట్యం కూడా నేర్చుకుంటుంది.

చిన్నప్పటి నుండీ తండ్రి ప్రేరణే తనకు స్పూర్తినిచ్చిందని ఆయనే కోచ్, ట్రైనర్, పోర్టర్ అని జాహ్నవి తెలిపింది. ఆస్ట్రేలియాలో ఇక్కడి తెలుగువారు మరియు స్థానికులు ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని ఆదరించారని చిరంజీవి జాహ్నవి చెప్పింది.

ఆస్ట్రేలియాలోని కోసిస్కో ఎక్కినపుడు 10 పర్వత శిఖరాలు అతి సులభంగా, సునాయాసంగా నాలుగు రోజుల్లో పూర్తి చేయడం జరిగిందనీ శ్రీ కృష్ణారావు గారు చెప్పారు.  పర్వతారోహణ చేసినపుడు చుట్టుప్రక్కల మద్దతునిచ్చేవాళ్ళు కానీ, స్పూర్తినందించే వాళ్ళు కానీ, చప్పట్లు కొట్టేవాళ్ళు కానీ వుండరు.  అందుకని ఈ ప్రక్రియలో స్వతహాగా ప్రోత్సహించుకోవాలి.

ఇప్పటి వరకూ అధిరోహించిన 3 పర్వతాలకైన ఖర్చు తమ స్వంత డబ్బుతోనే జరిగిందనీ ఇక ముందు 4 పర్వతాలకు ఫండ్ రైసింగ్ కోసం చాలా ప్రయత్నాలు జరుపుతున్నట్లు శ్రీ కృష్ణా రావు గారు చెప్పారు.  అటు ప్రభుత్వం నుండి ఇటు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలనుండి కూడా వనరులు సమకూర్చడానికి ఎంతగానో కృషి చేస్తున్నట్లు శ్రీ కృష్ణా రావు గారు చెప్పారు.  ఒక్క ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి షుమారు 50 లక్షల సొమ్ము అవసరం పడుతుందని అయన చెప్పారు.

చిరంజీవి జాహ్నవికి స్వంత వెబ్సైటు కూడా వుంది.  http://www.jaahnavi.com/

ఫేస్ బుక్ పేజీ: https://www.facebook.com/drskrishnarao?fref=ts

తన ప్రయత్నంలో సఫలీకృతమై 7 పర్వత శిఖరాలు అధిరోహించి కీర్తి పతకాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలని పలువురు చిన్నారులకు ఆదర్శవంతంగా నిలవాలని తెలుగుమల్లి అకాంక్షిస్తోంది.

Send a Comment

Your email address will not be published.