భారత-ఆస్ట్రేలియా మైత్రీ బంధం

ఆర్ధిక, వ్యాపార, పర్యటన రంగాల్లో ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకోవడం, సంప్రదాయపు విలువల్ని పాటించడం మన రెండు దేశాల మధ్య వున్న సత్సంబంధాలకు నిదర్సనం.  ఇదే కోవలో భారత గణతంత్ర దినోత్సవం, ఆస్ట్రేలియా డే జనవరి 26 వ తేదీన జరుపుకోవడం యాదృశ్చికం.  ఈ రెండు దేశాల చరిత్రలో జనవరి 26 వ తేదీకి చాలా ప్రాముఖ్యత వుంది.

భారతదేశం తన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంచే  ఈ రోజు అమలు పరిస్తే  ఆస్ట్రేలియా – బ్రిటిష్ వారి  మొట్టమొదటి ఓడల గుంపు 1788 లో ఈ రోజే న్యూ సౌత్ వేల్స్ సముద్ర తీరానికి చేరుకుంది.  అప్పటి నుండి షుమారు వంద సంవత్సరాలకు పైగా ఆస్ట్రేలియా దేశంలో ఈ ఉత్సవాలు అంత ప్రాచుర్యంలో లేవు.  అయితే 1808 లో మొదటిసారి ఈ రోజు ఉత్సవాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. 1901 లో ఆస్ట్రేలియా రాష్ట్రాలు అన్నీ కలిసి ఒక సంయుక్త సమాఖ్యగా ఏర్పడ్డాక జనవరి 26 ని ఆస్ట్రేలియా డే గా పరిగణించి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం చేస్తున్నారు.

భారత దేశంలో ఈ రోజున ఉత్తమ సేవలందించిన పౌరులందరికీ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి పురస్కారాల్ని ఎలా ఇస్తారో ఆస్ట్రేలియాలో కూడా ఇటువంటి పురస్కారాలు (ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియా, నైట్, ఆస్ట్రేలియన్ అఫ్ ది ఇయర్, యంగ్ ఆస్ట్రేలియన్ అఫ్ ది ఇయర్) ఎన్నో ఇస్తూ ఉంటారు.  ఈ అవార్డులు ఎంతో మందికి స్పూర్తినిస్తూ ఉంటాయి.  తెలుగు వాళ్ళలో ఈ అవార్డులు అందుకున్న వాళ్ళు ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు.

ఈ రోజు భారత దేశంలోనూ, ఆస్ట్రేలియా లోనూ సెలవుదినాలుగా ప్రకటించడం వలన ఆస్ట్రేలియాలోని చాలా మంది భారతీయులు రెండు దేశాల విభిన్న సంస్కృతులకు సంబందించిన జనరంజకమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంతో   గడుపుతారు.  ఆస్ట్రేలియాలో ముఖ్యంగా ఈ జనవరి నెల వేసవి కాలం కావడం వలన కార్యక్రమాలు బయట నిర్వహించడానికి వాతావరణం అనువుగా వుంటుంది.  ప్రతీ రాష్ట్రంలోనూ భారత కాన్సుల్ జనరల్ కార్యాలయాల్లో జెండా వందనాన్ని సమర్పించి  భారత రాష్ట్రపతి సందేశాన్ని చదువుతారు.

ఈ రెండు దేశాల మైత్రీ బంధం ఇలాగే కొనసాగి మరెంతో బలోపెతమౌతుందని ఆశిద్దాం.

Send a Comment

Your email address will not be published.