భారత కోకిల ఎమ్మెస్

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అనగానే ఎమ్మెస్ ఆలపించిన గొంతు గుర్తుకు రాకమానదు. సరోజినీ నాయుడు ఎమ్మెస్ ని భారత కోకిల అని పొగిడారు.

ఆమె 98వ జయంతిని దేశవ్యాప్తంగా సంగీత ప్రపంచం ఘనంగా జరుపుకున్న రోజు సెప్టెంబర్ 16వ తేదీ.

ఆమె పూర్తి పేరు మదురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి. కానీ ఆమె సంగీత ప్రపంచంలో ఎమ్మెస్ గా పొందిన పేరుప్రఖ్యాతులు అనంత సాగరం.

కుటుంబ సభ్యులు ఆమెను ముద్దుగా కుంజమ్మా లేదా కుంజూ అని పిలిచే వారు.

ఆమె తన తల్లి షణ్ముఖవడివు వద్దే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆమె పాడిన పాటలు విడుదల అయినప్పుడు ఎమ్మెస్ వయస్సు పది సంవత్సరాలు మాత్రమే.

ఆమె మొదటిసారిగా 1929 లో మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో జనం ముందు బహిరంగ వేదికలో పాడినప్పుడు ఆమె వయస్సు పదమూడు సంవత్సరాలు. ఆమె ఈ కార్యక్రమంలో కొన్ని భజనలు కూడా ఆలపించారు.

ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు. ఆమె నటించిన మొదటి సినిమా సేవా సదనం. ఈ సినిమా 1938 లో విడుదల అయ్యింది.

ఆమె తన భర్త సదాశివం నడిపిన తమిళ వార పత్రిక కల్కి ప్రారంభానికి నిధుల సేకరణ కోసం 1941 లో సావిత్రి అనే సినిమాలో నారదుడి పాత్రలో నటించారు. అయితే రాజస్థానీ భక్తురాలు మీరా పేరిట 1945 లో విడుదల అయిన చిత్రంలో ఆమె మీరాగా టైటిల్ రోల్ లో నటించినప్పుడు జాతీయ స్థాయిలో ఎమ్మెస్ కు ఎనలేని పేరుప్రఖ్యాతులు లభించాయి. ఈ చిత్రాన్నే 1947 లో హిందీలో మళ్ళీ తీసారు. ఆ సినిమాలో ఆమె మీరా భజనలు కూడా పాడారు.

కొంతకాలం మాత్రమే ఆమె సినీ జగత్తులో ఉంది ఆ తర్వాత ఎమ్మెస్ దృష్టి శాస్త్రీయ సంగీతంపైనే కేంద్రీకృతమైంది.

హిందీ నేపధ్య గాయకురాలు లతా మంగేష్కర్ ఎమ్మెస్ ని తపస్విని అని పిలిచే వారు.

కాంచీపురం పట్టు చీరలలో ఒక దానిని ఎమ్మెస్ బ్లూ అని పిలిచే వారు.

2005 లో ఆమె గుర్తుగా ఒక పోస్టేజ్ స్టాంప్ విడుదల చేసారు.

1997 లో ఆమె భర్త కల్కి సదాశివం మరణించారు. ఆ తర్వాత ఆమె బహిరంగ కార్యక్రమాల్లో పాడటం మానేశారు.

1926 లో ఆమె మొదటి తమిళ పాట పాడినా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఆమెకు చిరస్మరణీయమైన కీర్తిప్రతిష్టలు తెచ్చి పెట్టినది మాత్రం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ ఆల్బం ని 1963 లో గ్రామ్ ఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా రికార్డ్ చేసింది. ఈ సుప్రభాత రచయిత ప్రముఖ కవి ప్రతివాద భయంకర శ్రీ అనంతా చార్య. ఇది 1430 లో రాసినది. ఈ గ్రామ్ ఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా సంస్థ తర్వాతి రోజుల్లో హెచ్ ఎం వీ సరేగమాగా పేరు మారింది. ఈ సంస్థ వర్గాలు అందించిన సమాచారం మేరకు ఇప్పటికీ ఎమ్మెస్ పాడిన ఈ సుప్రభాతమే రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయట.

తాను పాడిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పై వచ్చే రాయల్టీని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధీనంలో నిర్వహించే వేద విద్యాలయానికి ఇవ్వాలని ఎమ్మెస్ హెచ్ ఎం వీ సంస్థకు చెప్పారు.

పాటియాలా ఘరానా విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ ఎమ్మెస్ ని సుస్వర లక్ష్మి అని పిలిచేవారు.

మరో ప్రముఖ హిందుస్తానీ గాయకులు కిశోరి ఆమోన్కర్ ఎమ్మెస్ ని “ఆత్వన్ సుర్” అని పిలిచేవారు.

సేకరణ – యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.