భారీగా వలసలు

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్న కొందరు సీనియర్ నేతలు క్రమంగా బీజేపీలో చేరడం మొదలుపెట్టారు. అలాగే జగన్ పార్టీలో ఇమడలేమని భావించిన తెలంగాణా నేతలు కూడా తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన కన్నా లక్ష్మీ నారాయణ కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పి బీజేపీలో చేరిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈ సీనియర్ నాయకుడు నిన్న ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, జగన్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన ఇప్పటికే పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ పార్టీకి చెందిన మరికొందరు సీనియర్ నాయకులు కూడా జగన్ నిరంకుశ వైఖరికి విసిగిపోయి బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఇది ఇలా వుండగా, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఈ నాయకులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.