భాషా ప్రయుక్త రాష్ట్రాలకు తిలోదకాలా?

భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే మాటకు కేంద్రం ఇక స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సీమాంధ్ర నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఓ తెలుగు రాష్ట్రాన్ని విభజించడంతో మొదలుపెట్టి కేంద్రం మరి కొన్ని రాష్ట్రాలను కూడా ఇదే విధంగా విభజించే ఆలోచన చేస్తోందని కొందరు సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆంద్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసే ముందు ఒక చట్టాన్ని రూపొందించిందని, ఇప్పుడు ఆ చట్టం స్ఫూర్తికి వ్యతిరేకంగా రాష్ట్రాలను విభజించే ఆలోచన చేస్తోందని విద్యాశాఖ మంత్రి, సీమాంధ్ర శాసనసభ్యుల ఫోరం కన్వీనర్ ఎస్. శైలజానాథ్ వెల్లడించారు.

ఈ చట్టం ఆధారంగా దేశంలో మొట్ట మొదట ఏర్పడిన రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ అనీ, ఆ చట్టాన్ని రద్దు చేస్తే తప్ప కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకూడదనీ ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్రానికి స్వయంగా చెప్పి, కొత్త రాష్ట్రం ఏర్పాటు నిర్ణయాన్ని ఆపించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చట్టం కారణంగానే రాష్ట్ర శాసనసభలో తప్పనిసరిగా తెలంగాణా బిల్లును ఆమోదింప చేయాల్సి ఉంటుందనీ ఆయన స్పష్టం చేశారు.

Send a Comment

Your email address will not be published.