హైదరాబాద్ నగరంతో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మట్టి గణపతి విగ్రహాలకు ప్రచారం పెరుగుతోంది. ఈ ఏడాది సుమారు ఐదు కోట్ల మట్టి విగ్రహాలు తయారు కాబోతున్నట్టు అంచనా. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులనే పూజించాలంటూ వందలాది మంది ప్రకృతి ప్రేమికులు ప్రచారం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాళ్ళ పర్యావరణానికి జరిగే హానిని వారు ప్రజానీకానికి వివరిస్తున్నారు. నగరంలో ధూల్ పేట, బాలానగర్, జీడిమెట్ల, కూకట్ పల్లి, సంకర పల్లి తదితర ప్రాంతాల్లో ఈ విగ్రహాల తయారీ ఒక కుటీర పరిశ్రమ స్థాయిలో అభివృద్ధి చెందింది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలను తయారు చేసే ఈ కుటీర పరిశ్రమలు ఈసారి పూర్తిగా పుట్ట మట్టితోనే విగ్రహాలను తయారు చేస్తున్నాయి. ఒక అడుగు నుంచి 20 అడుగుల వరకూ ఇక్కడ విగ్రహాలు తయారవుతున్నాయి. “మట్టి విగ్రహాలు తయారు చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి” అనే నినాదంతో రాష్ట్ర కాలుష్య నివారణ సంస్థ కూడా ఈ ఏడాది మట్టి విగ్రహాల తయారీని మొదలుపెట్టింది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కాబోయే గణపతి నవరాత్రుల కోసం ఇప్పటి నుంచే విగ్రహాల కొనుగోలు ఊపందుకుంది.