మనోరమ ఇక లేరు

సుప్రసిద్ధ నటి మనోరమ ఇక లేరు. విలక్షణ నటిగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన మనోరమ అక్టోబర్ 10వ తేదీన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గుండె సంబంధిత అనారోగ్యంతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆమె వయస్సు 78 ఏళ్ళు. వెయ్యికిపైగా చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పుటలకెక్కిన మనోరమ ప్రస్తానం చూద్దాం….

1937 మే 26వ తేదీన తమిళనాడులోని మన్నార్గుడిలో పుట్టి పెరిగిన మనోరమను తమిళ అభిమానులు “ఆచ్చి” అని పిలుస్తారు. ఆమె అసలు పేరు గోపీ శాంత. ఆమె తల్లి పేరు రామామృతం. తండ్రి పేరు కాశీ క్లాక్ ఉడయార్. ఆమెకు చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఇష్టం. మనోరమకు మనోరమ అనే పేరు పెట్టింది దర్శకుడు తిరువేంగడం, త్యాగరాజన్ (ఈయన ఓ హార్మోనిస్టు). ఆమె చిన్న వయస్సులోనే పేదరికం కారణంగా కారైక్కుడి సమీపంలోని పల్లత్తూర్ అనే ప్రాంతానికి తల్లితోపాటు చేరుకున్నారు. ఆమె ఆరో తరగతి వరకు చదువుకున్నారు.

ప్రారంభంలో వైరం నాటక సభ వారి నాటకాలలో నటించిన మనోరమ ప్రతిభను గుర్తించి రాజేంద్రన్ తన ఎస్ ఎస్ ఆర్ నాటక మండ్రంలో చేర్చుకున్నారు. ఈ నాటక సంస్థ తరఫున మణిమకుటం, తెన్ పాండి వీరన్, పుదు వెళ్ళాం తదితర వందల నాటకాల్లో నటించిన మనోరమ రాజేంద్రన్, దేవిక జంటగా నటించిన ఒక చిత్రంలో మొదటిసారిగా నటించారు. కానీ ఆ సినిమా సగంలో ఆగిపోయింది.

ఆమె ఆరు భాషా చిత్రాలలో నటించారు. అవి తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ (కునారా బాప్), సింహళం భాషా చిత్రాలు.

అయిదుగురు ముఖ్యమంత్రులతో(అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎమ్జీఆర్, ఎన్టీఆర్) నటించిన మనోరమ మున్ముందుగా నటినచిన తమిళ చిత్రం మాలయిట్ట మంగై. ఈ చిత్రం 1958 నాటిది. ఈ మొదటి సంవత్సరంలో మరో తమిళ చిత్రంలోను నటించింది. ఆమె నటించిన ఆఖరి చిత్రం 2013లో వచ్చిన సింగం – 2. తమిళం ముక్తా శ్రీనివాస్ వారి సంస్థలో వచ్చిన ప్రతి సినిమాలోను ఆమె నటించడం విశేషం. అన్నాదురై, కరుణానిధిలతో నాటకాలలో నటించారు. తెలుగులో ఆమె శుభోదయం, అల్లరి ప్రేమికుడు, రిక్షావోడు, బావ నచ్చాడు, అరుంధతి తదితర చిత్రాలలో నటించారు.

ఆమె 1964 లో ఎస్ ఎం రామనాథన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి భూపతి అని ఒక తనయుడు ఉన్నారు. అయితే 1966 లో ఆమె భర్త నుంచి విడాకులు పొంది విడిగా జీవించారు.

సినీ రంగంలో అనేక అవార్డులూ, రివార్డులూ అందుకున్న మనోరమను కేంద్ర ప్రభుత్వం 2002 లో పద్మశ్రీ బిరుదుతో సమ్మానించింది.

ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు.

Send a Comment

Your email address will not be published.