మనో జ్ఞానం - మనొజ్ఞ

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు
జనులా పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ

ఈ సుమతీ శతకం ఎప్పుడో చిన్నప్పుడు నాలుగు ఐదు తరగతులు చదువుకున్నప్పుడు చదివాము.  అయితే ఈ పద్యంలో పుత్రుడు అంటే కొడుకు కావచ్చు కూతురు కావచ్చు.  తలిదండ్రులు పిల్లలు పుట్టినప్పటికంటే వారు పెద్దయి విద్యా బుద్ధులు నేర్చుకొని నలుగురిలో కొనియాడ బడినపుడు ఎంతో ఆనందాన్ని  పొందుతారనేది దీని సారాంశం.  ఇది నిత్య సత్యమన్నది నిరూపించింది మన పదహారణాల తెలుగమ్మాయి మనొజ్ఞ కామిశెట్టి.  కుటుంబ పరంపరను తనదిన శైలిలో 16 వ జన్మదిన సందర్భంగా మొట్టమొదటిసారిగా రక్తదానాన్ని మొదలుపెట్టి ఏడేళ్ళలో 50 సార్లు రక్త దానం చేయడమే కాకుండా తనతో పాటు మరో 100 మందిని ప్రోత్సహించి వారిచే  రక్త దానాన్ని చేయించిన  అరుదైన గౌరవాన్ని పొందిన అమ్మాయి మన మనొజ్ఞ.  చిన్న వయసులోనే ఎన్నో జీవితాలను కాపాడడంలో ఒక నిర్దిష్టమైన పాత్రను పోషించిన ధీశాలిగా నిలబడడం తెలుగువారందరికీ ఎంతో గర్వకారణం.   ఈ సందర్భంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారు మనొజ్ఞ 21వ జన్మదినాన్ని సౌత్ బ్యాంకు సెంటర్ లో తాను ప్రోత్సహించిన 100 మందితో జరిపి గౌరవించడం జరిగింది.

మనొజ్ఞ ప్రస్తుతం మోనాష్ యూనివర్సిటీ లో మెడికల్ కోర్స్ పూర్తి చేస్తుంది.  వైద్య వృత్తి దేవుడిచ్చిన వరమనీ ఈ వృత్తిలో మానవ సేవ చేయడానికి ఎంతో అవకాశము వుందని మనొజ్ఞ నమ్మకం. ఈ అమ్మాయి శాఖాహారి.  పర సంస్కృతితో సహజీవనం చేస్తూ తన సంస్క్త్రుతి పట్ల మమకారంతో కుటుంబ సంప్రదాయాలను మమేకంగా పాటిస్తున్న మనొజ్ఞ అభినందనీయురాలు.  తల్లిదండ్రులు శ్రీమతి ఉష గారు మరియు శ్రీ రవి గారు కూడా వైద్య వృత్తిలోనే ఉంటూ మెల్బోర్న్ తెలుగు సంఘానికి ఎంతో సేవ చేస్తూ వుంటారు.  ఈ పరంపరలోనే వారి కుమారుడు చిరంజీవి రవితేజ దంత వైద్య శాస్త్రంలో పట్టబద్రులు కానున్నారు.

మనొజ్ఞ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గానైసేషన్ లో గత ఆగస్ట్ నెలలో 6 వారలు ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసింది .  VCE చదువుతున్నప్పుడు UMATలో వంద శాతం మార్కులు సంపాదించడం మనొజ్ఞ ప్రతిభా పాటవాలకు నిదర్శనం.  గత సంవత్సరం ప్రతీ ఏట వైద్య వృత్తిలో శిక్షణ పొందుతున్న వారికి ఇచ్చే బహుమతి Bongioorno Award మనొజ్ఞకు రావడం తనలోని దీక్ష పట్టుదలకు నిదర్శనాలు.

పిన్న వయసులోనే ఇంతటి మేధా సంపత్తితో ముందుకెళ్తున్న మనొజ్ఞ మన పిల్లలందరికీ స్పూర్తినివ్వాలని తెలుగుమల్లి ఆశిస్తోంది.

Send a Comment

Your email address will not be published.