ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత కైలాసం బాలచందర్ ఇక లేరు. ఆయన వయస్సు 84 ఏళ్ళు. ఆయనకు భార్య, ఒక కుమారుడు (ప్రసన్నా), ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మరో కుమారుడు (కైలాసం) ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన మరణించారు.
ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్ర సంబందిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న బాలచందర్ చికిత్స కోసం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం చేరిన బాలచందర్ మొదట్లో కోలుకున్నట్టు అనిపించినా డిసెంబర్ 23వ తేదీ ఉదయం నుంచి ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చినట్టు బాలచందర్ మేనేజర్ తెలిపారు. చివరికి డిసెంబర్ 23వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసారు. తమిళం, తెలుగు, కన్నడం హిందీ భాషా చిత్రాలలో ఆయన దర్శకత్వం వహించారు.
వందకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలచందర్ కమల హాసన్, రజనీకాంత్, సరిత, ప్రకాష్ రాజ్ వంటి వారిలో ప్రతిభను గుర్తించి వారిని చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆయన తమిళ పరిశ్రమకు 65 మందికిపైగా పరిచయం చేసారు.
ఇయక్కునర్ శిఖరం గా ప్రసిద్ధికెక్కిన బాలచందర్ 1930 లో జూలై 30వ తేదీన తంజావూర్ జిల్లాలో నల్ల మామ్గుడి అనే గ్రామంలో ఒక తమిళ బ్రాహ్మిణ్ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కైలాసం, కామాక్షి అమ్మాళ్. నన్నిలం అనే చోట ప్రాధమిక విద్య చదివిన బాలచందర్ అన్నామలై విశ్వవిద్యాలయంలో డిగ్రీ పొందారు. మొదట్లో ఆయన డ్రామాలలో నటించారు.
జంతు శాస్త్రంలో డిగ్రీ పొందిన బాలచందర్ మొదట్లో అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగంలో చేరారు. యునైటెడ్ అమెచ్యూర్ ఆర్టిస్టుల డ్రామా కంపెనీతో అనుబంధం పెంచుకుని డ్రామాలలో పాలు పంచుకున్నారు. ఆ తర్వాత ఆయన సొంతంగా ఒక డ్రామా కంపెనీ ప్రారంభించారు. ఈ సంస్థ తరఫున ఆయన సారధ్యంలో రూపుదిద్దుకున్న మేజర్ చంద్రకాంత్ నాటకానికి విశేష ఆదరణ లభించింది. అనంతరం వెండితెరపై కూడా అదే టైటిల్ తో సమర్పించిన చిత్రం మరింత విజయం సాధించింది.
ఆయన డ్రామాలు, సినిమా కథలన్నీ మధ్యతరగతి చుట్టూ తిరిగేది. వ్యక్తుల సంబంధ బాంధవ్యాలపై , సామాజిక సమస్యలపై ఆయన అల్లిన కథలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేవి. వాటిపై ఎంతో చర్చ జరిగేది. కథలోని మలుపులు ఊహించడానికి వీల్లేకుండా ఉండేవి.
అవల్ ఒరు తోడర్ కథై, అపూర్వ రాగంగళ్, మూండ్రు ముడిచ్చు, 47 నాట్కల్, అవర్గల్, మరో చరిత్ర, గుప్పెడు మనసు, మన్మధలీల, ఆకలిరాజ్యం, తూర్పు పడమర, ఏక తుజే కేలియే, ఏక నహీ పహేలి వంటి చెప్పుకోదగ్గ సినిమాలు ఆయన సారధ్యంలో రూపు దిద్దుకున్నవే. తమిళంలో ఆయన సమర్పించిన సినిమాలనే ఎక్కువగా ఇతర భాషల్లో రీమేక్ చేసేవారు.
2010లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన బాల చందర్ ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1987 లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బాలచందర్ ను నంది పురస్కారంతో సత్కరించింది. అంతేకాకుండా ఆయన ఖాతాలో లెక్కకు మిక్కిలి అవార్డులున్నాయి.
చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్ర బాబు నాయుడు, కె చంద్రశేఖర్ రావు తదితరులు బాలచందర్ మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు.