మల్లాది సోదరుల మధుర గాన లహరి

మెల్బోర్న్ లోని కర్నాటక సంగీత సంస్థ “సి.ఎం.సి” సంస్థ వారు, తెలుగువారైన “మల్లాది బ్రదర్స్” (శ్రీ శ్రీ రామ్ ప్రసాద్ గారు, శ్రీ రవి కుమార్ గారు) వారి కర్నాటక సంగీత విభావరిని నిర్వహించారు.  ఈ కార్యక్రమము  “ఫారెస్ట్ హిల్ సెకండరీ స్కూల్” లో శనివారం (05/04/2014) సాయంత్రం 7 గంటలకు మొదైలై రాత్రి 10:30 వరకు దిగ్విజయంగా జరిగి, సంగీత ప్రియులను మురిపించి, మైమరపించి సుమధుర సంగీత లోకాలలో విహరింప చెసారు.

తెలుగు వారైన మల్లాది సోదరులు (శ్రీ శ్రీ రామ్ ప్రసాద్ గారు, శ్రీ రవి కుమార్ గారు) వారి బృందంతో విదేశీ పర్యటనలో ముందు “న్యూ జీలాండ్” లో తమ ప్రదర్శన ముగించి మెల్బోర్న్ నగరానికి విచ్చేశారు.  వీరి అద్భుత సంగీత ప్రవాహానికి పరవశులు కాని ప్రేక్షకులు సభలో ఏ ఒక్కరు లేరని అనుటలో అతిశయోక్తి లేదు. వీరి సంగీత గురువులు పద్మభూషణ్  డా॥ శ్రీపాద పినాక పాణి గారు, డా॥ శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గార్లు.  వీరి ప్రధమ గురువులు తండ్రిగారు సుప్రసిద్ధ  శ్రీ మల్లాది సూరిబాబుగారు.

కార్యక్రమము లో ముందు “వినాయక నిను” అని హంసద్వని రాగాలాపనతో ప్రేక్షకుల మనో భావాలను తేలిక పరచి, దివ్య గానామృతంతో అలరించారు. “మానసగురు గుహ” అను తదుపరి ఆనంద భైరవి రాగాన్విత ప్రవాహం    సంగీత ప్రియుల హృదయాలను లాలించి ఊయలలూపింది. “సీతావర సంగీత గ్జ్యానము”, అని దేవ గాంధారి రాగంలో మూడవసారి తమ మధుర గాంధార విద్యతో ప్రేక్షకులకు  దివ్యలోక సందర్శనము చేయించారు.  తదుపరి “హిమగిరి కుమారి ఈశ్వరి” (వివాది రాగం), “సొగసు చూడ తరమ” (కానడ గౌళ), “శివకామ సుందరి” (ముఖారి రాగం), “మరి మరి వచ్చునా” (కాంభోజి రాగం), “కరుణ చూడు” (శ్రీ రాగం), “దీక్షితార్ వర శ్యామ త్యాగారాజం” (గౌరీ మనోహరి రాగం) అనే కీర్తనలతో  తమ దివ్య గాన ప్రతిభ కర్నాటిక్ సంగీతంలోనే కాక, అటు హిందుస్తానీ బాణీ పై కూడా తమకు గల అధిక్యత అనితర సాధ్యముగా ప్రదర్శించి తమకు తామే నని నిరూపించారు.  ఆ తరువాత పరమ పురుష (బేహాగ్ రాగం), అంతరంగ మేల (అన్నమాచర్య కీర్తన, ముఖారి రాగం), అద్వితీయంగా ఆలపించి ప్రేక్షకుల మన్నలను అందుకున్నారు.  కార్యక్రమము చివరి దశలో పురందర దాసు కీర్తన, రామదాసు కీర్తన, సింధు భైరవి రాగంలో “చంద్రశేఖర ఈశ”  అనే దివ్య గానాలు హిమాలయ సిఖరాగ్రాలకు సరి తోడై ప్రేక్షకుల హృదయాలను కదిలించి ఆనంద పరవశులను చేసింది.

మల్లాది సోదరులు కలసి గానం చేస్తూ, ఒకరికొకరు “భిన్నత్వంలో ఏకత్వం” అనే సూక్తిగా తమ దివ్య గానం వినువారికి విశేషంగా ఒక్కరే పాడుతున్నారా అనే సందేహం కలిగించారు. తెలుగు వారైన వీరిరువురు మన జాతి సంప్రదాయం, సంస్కృతులకు అనుగుణంగా వస్త్రాలను ధరించి, నుదుట విభూతి కుంకుమలు ధరించి సరస్వతి పుత్రులవలె దివ్య తేజస్సు  కలిగి వున్నారు. వీరి బృందంలో శ్రీ అవనీస్వరం విను గారు  వయోలిన్ పైన, శ్రీ తుమ్కుర్ రవి శంకర్ గారు  మృదంగం పై వాద్య సహకారం దివ్య ప్రతిభన అందించి కార్యక్రమానికి మరింత దివ్యానుభూతిని జత కలిపారు. తంబూర పైన కుమారి పల్లవి సుసర్ల గారు సహకరించారు.

తాయి అధ్యక్షులు శ్రీ పవన్ మట్టంపల్లి, ఉపాధ్యక్షులు శ్రీ శర్మ చెరుకూరి గారు శ్రీ మల్లాది సోదరులకు వారి బృందానికి శాలువ, జ్ఞాపికలను ఇచ్చి సగౌరవంగా సత్కరించారు.  సి.ఎం.సి సంస్థ తరఫున ఎం సి గారు శ్రీ మల్లాది సోదరులను ప్రశంసిస్తూ వీరి గానంతో మూడున్నర గంటలు తెలియ కుండానే గడిసి పోయిందని, మరి కొన్ని గంటలు కూడా వారి కార్యక్రమము వినడానికి అందరూ సిద్ధమే నని చమత్కరించారు. వారు వినయ పూర్వకంగా శ్రీ మల్లాది సోదరులను ఉద్దేశిస్తూ మన నగరానికి విచ్చేసి నందుకు ధన్యవాదాలర్పిస్తూ, మానవులంత భాషకి అత్యంత విలువలర్పించాలని, భాష మన జీవన, మనుగడలకు ప్రధమ సోపానమని, అదే మనము పరోక్షంగా నివసించే గృహమని బోదించారు

చిట్ట చివరన సాదరంగా నిలుచున్న ప్రేక్షకుల  కరతాళ ధ్వనులతో మిన్ను ముడుతూండగా సభ సమాప్త మైంది. శ్రీ మల్లాది సోదరులు తదుపరి కార్యక్రమము పెర్త్ లో గలదని తాము ఆదివారం అక్కడికి వెళుతున్నామని తెలియ చేసారు.

                                                                                                                                                      –శ్రీ రఘు విస్సంరాజు

Send a Comment

Your email address will not be published.